-

ప్రసార స్వేచ్ఛకు సంకెళ్లా?

10 Aug, 2015 01:26 IST|Sakshi

నలభైయ్యేళ్ల క్రితం దేశంలో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా హోరాహోరీ పోరాడామని బీజేపీ నేతలు సభజేసి సగర్వంగా ప్రకటించుకుని ఇంకా రెండు నెలలు కాలేదు. ఇంతలోనే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మీడియా గొంతు నులిమే పనికి పూనుకుంది. వారంక్రితం మరణశిక్ష అమలైన యాకూబ్ మెమన్ కేసు విషయంలో కొన్ని చానెళ్లు నిబంధనలు అతిక్రమిం చాయని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేసి ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చింది. మీడియా పని తీరు విమర్శలకు అతీతంగా ఉన్నదని, దాన్ని తప్పుబట్ట డానికేమీ లేదని ఎవరూ అనరు.
 
 నిజానికి మీడియాను కేవలం పత్రికలకూ, మేగజీ న్‌లకూ, చానెళ్లకూ పరిమితం చేసి ఆలోచించడం కూడా సరికాదు. గత పదేళ్లుగా వీటికి తోడు సామాజిక మాధ్యమాలు కూడా రంగం మీదికొచ్చాయి. మీడియా ఇలా విస్తృతం కావడంవల్లా, వాటిమధ్య విపరీతమైన పోటీ పెరగడంవల్లా ఆ క్రమంలో సమాజంలోని వివిధ వర్గాలనుంచి ఆరోపణలనూ, విమర్శలనూ కూడా ఎదుర్కొంటున్నది. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడి సందర్భంగా చానెళ్లు వ్యవహరించిన తీరును అందరూ తప్పుబట్టారు. ఆ దాడి సందర్భంగా లైవ్ కవరేజీ పేరిట చానెళ్లు శ్రుతిమించాయి.  
 
 ఈ మితిమీరిన ఉత్సాహాన్ని నియంత్రిం చడం కోసం ఒక నియమావళిని తీసుకొస్తామని ప్రభుత్వం హెచ్చరించాక చానెళ్లే మార్గదర్శకాలను ఏర్పర్చుకున్నాయి. మనుషుల్లో ఉండే సహజాతాలు దెబ్బతినేలా, వక్రమార్గం పట్టేలా ఉండే దృశ్యాలను ప్రసారం చేయడం, మరణావస్థలో ఉన్న, నెత్తుటి ముద్దలైన బాధితులను చూపడం వంటి వి క్రమేపీ తగ్గాయి. ఇంకా సరి చేయాల్సినవీ, మెరుగుపర్చాల్సినవీ ఉన్నాయని ఎవరైనా అంటే ఆ అభిప్రాయంతో విభేదించాల్సిన అవసరం లేదు. ఒక కేసులోని మంచిచెడ్డల్ని న్యాయస్థానాలు నిరా ్ధరించే లోగానే మీడియా అత్యుత్సాహానికి పోయి తానే తీర్పరిగా మారడానికి తహతహలాడటాన్ని తరచు చూస్తున్నాం. స్టూడియోలనే కంగారూ కోర్టులుగా మార్చి చర్చించడానికి వచ్చినవారికి ముద్రలేయడం, హేళన చేసి నోరుమూయిం చడం గమనిస్తున్నాం. ఇదంతా మారాలని, మరింత పరిణతితో ప్రవర్తిల్లాలని అందరూ కోరుకుంటారు.
 
 అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల వెనకున్న ఉద్దేశాలు వేరు. అవి ఆరోగ్యవంతమైన చర్చనూ, సంభాషణనూ తొక్కి పెట్టదల్చుకున్నట్టు కనబడు తోంది. యాకూబ్ మెమన్ ఉరికంబం ఎక్కిన కేసుకు సంబంధించి సవాలక్ష అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతను నరరూప రాక్షసుడూ, ఉరికంబం ఎక్కడా నికి అర్హమైన నేరం చేసినవాడన్న వాదన మొదలుకొని ఇందులో ఎన్నో ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారూ...రాజకీయ నాయకు లు, హక్కుల సంఘాలు, పౌర సమాజానికి చెందిన కార్యకర్తలు, సీనియర్ పాత్రికే యులు ఈ సంవాదంలో పాలుపంచుకున్నారు.
 
 సర్వోన్నత న్యాయస్థానం అసాధా రణ రీతిలో అర్థరాత్రి దాటాక సమావేశమై తెల్లవారుజామువరకూ కేసును విచారిం చి తీర్పునివ్వడాన్ని శ్లాఘించిన వారున్నట్టే...అంతగా శ్రమించి కూడా అది కొన్ని మౌలిక సూత్రాలను విస్మరించిందని విమర్శించినవారున్నారు. వీటన్నిటికీ మీడి యాలో చోటు దొరికింది. ఆ వాదనల్లోని మంచి చెడ్డల్ని, లోటుపాట్లనూ... వాటి ఉద్దేశాలనూ, అంతరార్థాలనూ అందరూ తెలుసుకోగలిగారు. నిజానికి ఈ తరహా చర్చ ఇంకా ముందే జరిగుంటే పరిస్థితి వేరుగా ఉండేదని...మీడియా చివరి నిమి షంలో మాత్రమే స్పందించిందని అసంతృప్తి వ్యక్తం చేసినవారున్నారు.
 
 ఇంతకూ కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులందుకున్న మూడు చానాళ్లూ చేసిన తప్పేమిటి? ఆజ్‌తక్, ఏబీపీ చానెళ్లు మెమన్ ఉరి తర్వాత మాఫియా డాన్ చోటా షకీల్‌తో ఫోన్ సంభాషణ జరిపాయి. మెమన్ నిర్దోషని, అతనికి న్యాయం జరగలేదని ఆ సంద ర్భంగా చోటా షకీల్ అన్నాడు. ఎన్డీటీవీ మెమన్ న్యాయవాదితో ఇంటర్వ్యూ నిర్వ హించింది. చాలా దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయని ఆయనన్నాడు. ఈ ప్రసారాలు రాష్ట్రపతినీ, న్యాయవ్యవస్థనూ అగౌరవపరిచేలా ఉన్నాయని, వారి విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ జారీచేసిన నోటీసులు అభ్యంతరపెడుతున్నాయి. అసభ్యత, పరువునష్టం... కావాలని అసత్యాలు, అర్థసత్యాలు వ్యాప్తిచేయడంవంటి ఆరోపణలు ఈ నోటీసుల్లో ఉన్నాయి. హింసను ప్రేరేపించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, జాతి వ్యతిరేక ధోరణులు ప్రదర్శించడంవంటి నిందలున్నాయి.
 
 ప్రసారమైన అంశాలకూ, ఈ ఆరోపణలకూ అసలు పొంతన ఉందా? ఇలాంటి ఆరోపణలు పుక్కిటబట్టిన నోటీసుల్ని జారీచేసి ప్రభుత్వం సాధించదల్చుకున్నదేమిటి? మీడియాను వేధించడం, భయపెట్టడం కాదా? ఇవే సెక్షన్లను ఉపయోగించి మీడియాను దారికి తెచ్చుకోవాలని గతంలో యూపీఏ సర్కారు సైతం చూసింది. ఇలాంటి ధోరణులు పాలకుల బలాన్నిగాక బలహీనతనే పట్టిచూపుతాయి. మీడియా పోకడలు సరిగా లేవనుకుంటే వాటిని ఎత్తి చూపడానికి వేదికలున్నాయి. న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్‌బీఎస్‌ఏ), బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ కంప్లెయింట్ కౌన్సిల్(బీసీసీసీ) వంటి స్వీయ నియంత్రణ సంస్థలు ఆ పనిలోనే ఉంటాయి. చానెళ్ల పనితీరుపై వచ్చే ఫిర్యా దుల్ని స్వీకరించి, విచారణ జరిపి అవసరమనుకున్న సందర్భాల్లో చర్యలు తీసుకుం టాయి. ఆ మూడు చానెళ్ల విషయంలోనూ కేంద్రం ఆ తోవన వెళ్తే ఎవరూ అభ్యం తరపెట్టరు. కానీ దాన్ని వదిలిపెట్టి 1994నాటి కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ నిబంధ నలను ఆయుధంగా చేసుకుంది. నిజానికి ఇది ఒక రకంగా మేలే. అవి పుస్తకాల్లోనే నిక్షిప్తమై ఉంటే వాటితో వచ్చే ప్రమాదాన్ని ఎవరూ పసిగట్టి ఉండేవారు కాదు.
 
 దేశంలోకి ప్రైవేటు చానెళ్లు ప్రవేశించిన కొత్తలో వచ్చిన ఆ నిబంధనలు ఎంతో అనిర్దిష్టంగా, అమూర్తంగా...అధికారంలో ఉన్నవారు ఏంచేసినా చెల్లుబాటయ్యేలా రూపొందాయి. అవి మన రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నాయి. ఆ నిబంధనలనే యూపీఏ సర్కారు అమలు చేయబూనుకుంటే ఒక్క కుంభకోణమైనా వెల్లడయ్యేది కాదు. సందర్భం వచ్చింది గనుక మీడియాతో పాటు అందరూ ఏకమై ఈ నిబంధనల రద్దుకు ఉద్యమించాలి. ఈ బాపతు నోటీసుల జారీలోని అప్రజాస్వామికతను కేంద్ర ప్రభుత్వం గ్రహించి పొరపాటును సరిదిద్దుకోవాలి.
 

మరిన్ని వార్తలు