గుర్తుండిపోయే నేత!

8 Aug, 2019 01:08 IST|Sakshi

కొందరు తమకొచ్చిన పదవులకుండే ప్రాముఖ్యత వల్ల వెలిగిపోతారు. కానీ చాలా తక్కువమంది చేపట్టిన పదవి ఏదైనా దానిపై తమదైన ముద్ర వేస్తారు. ఆ పదవికే వన్నె తెస్తారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన సుష్మాస్వరాజ్‌  42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా తరచుగా తన విశిష్టతను చాటుకున్నారు. ఒకానొక దశలో ఆమెను ప్రధాని పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయొచ్చునన్న ఊహాగానాలు రావడానికి ఈ విశిష్టతే కారణం. ఇతర రంగాల మాదిరిగా పురుషాధిక్యత రాజ్యమేలే రాజకీయరంగంలో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవడం, తమను తాము నిరూపించుకోవడం సాధారణమైన విషయం కాదు.

దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీకి తండ్రి జవహర్‌లాల్‌ నెహ్రూ సమున్నత వారసత్వం ఉంది. కానీ సుష్మా స్వరాజ్‌కు అటువంటి నేపథ్యం లేదు. ఆమె పూర్తిగా స్వశక్తితో ఎదిగిన మహిళ. విద్యార్థి దశలోనే సమస్యలపై పోరాడి, పరిష్కారాలు సాధించిన చరిత్రగలవారు. అప్పట్లోనే గొప్ప వక్తగా అందరి మన్ననలూ పొందారు. అరుదైన నాయకత్వ లక్షణాలు, ఏ సమస్యపైన అయినా ప్రభావవంతంగా మాట్లాడగల సామర్థ్యం సొంతం చేసుకోవడం వల్లనే ఆమె 25 ఏళ్ల పిన్న వయసులోనే హర్యానాలో కేబినెట్‌ మంత్రి కాగలిగారు. జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవ హరించారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. విద్యార్థి దశలో సంఘ్‌ పరివార్‌ అనుబంధ సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)లో చురుగ్గా పనిచేసిన చరిత్ర ఆమెది. ఆ దశలోనే ఆమె ఆనాటి జనసంఘ్‌ నాయకుడు ఎల్‌కే అడ్వాణీ దృష్టిలో పడ్డారు. తన రాజకీయంగా భిన్నాభిప్రా యాలుండే స్వరాజ్‌ కౌశల్‌ను పెళ్లాడాక ఆమె జనసంఘ్‌కు దూరమయ్యారు. సోషలిస్టు రాజకీ యాల్లో చురుకైన పాత్ర పోషించారు. దేశం ఉక్కు నిర్బంధాన్ని చవిచూసిన అత్యవసర పరిస్థితి కాలంలో నిరసన ప్రదర్శనల్లో ధైర్యంగా పాల్గొన్నారు. ఆ చీకటి రోజుల్లోనే సోషలిస్టు నేత, దివంగత నాయకుడు జార్జి ఫెర్నాండెజ్‌ను ప్రధాన కుట్రదారుగా చేర్చిన బరోడా డైనమైట్‌ కేసులో భర్తతో పాటు న్యాయస్థానంలో వాదించారు.

ఆ క్రమంలో ఆమె లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అనుయాయిగా మారారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యాక సోషలిస్టు పార్టీ జనతా పార్టీలో విలీనమై నప్పుడు ఆ పార్టీలో చేరారు. అనంతరకాలంలో బీజేపీలో చేరి కీలకపాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా, విపక్ష నేతగా పనిచేశారు.అయితే బీజేపీలో చాలామందికి లేని వెసులుబాటు çసుష్మకు ఉంది. సోషలిస్టుగా రాజకీయ రంగప్రవేశం చేయడం వల్ల కావొచ్చు... బీజేపీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నా ఆమెను ఉదారవాద నేతగానే అనేకులు పరిగణించారు. దానికితోడు ఆమె కొన్ని కీలక సందర్భాల్లో  నిర్మొహమాటంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఆ భావనే కలిగించేవి.

బెంగళూరులోని పబ్‌పై హిందూ ఛాందసవాదులు దాడిచేసి మహిళలపై దౌర్జన్యానికి దిగినప్పుడు ఆ చర్యను ఖండించిన ఏకైక బీజేపీ నేత సుష్మానే. ప్రియాంకా చతుర్వేది కాంగ్రెస్‌ నేతగా ఉండగా పదేళ్ల ఆమె కుమార్తె పట్ల అసభ్యకరంగా ట్వీట్‌లు చేసినవారిని సుష్మ మందలించారు. ప్రియాంకకు అండగా నిలిచారు. మతాంతర వివాహం చేసుకున్న జంట పాస్‌పోర్టు కోసం వచ్చినప్పుడు లక్నోలోని అధికారి ఆ మహిళపై తన పరిధి దాటి వ్యాఖ్యానించినప్పుడు సుష్మ మందలించారు. ఆమెకు పాస్‌పోర్టు అందేలా చూశారు. ఇలాంటి సందర్భాల్లో సంఘ్‌ పరివార్‌ శ్రేణులుగా చెప్పుకున్నవారు ఆమెపై విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినా సుష్మ లెక్కచేయలేదు.

విదేశీ వ్యవ హారాల శాఖ నిర్వహణ ఏ రాజకీయ నేతకైనా ప్రతిష్టాత్మకమైనదే. ఐక్యరాజ్యసమితితోసహా అనేక అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యంవహించే అవకాశం లభించడం, మన వాదనను సమ ర్ధవంతంగా వినిపించడం ఒక వరం. అదే సందర్భంలో ఆ పదవితో సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉండటం సాధ్యపడదు. కానీ ఆ పదవి స్వభావాన్నే ఆమె మార్చారు. ఇరాక్‌లోని బస్రాలో ఉగ్రవాదుల చక్రబంధంలో చిక్కుకున్న 168మందిని కాపాడటం వెనక ఆమె కృషి చాలా ఉంది. విదేశాల్లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నవారికి, ఇక్కడి వ్యక్తిని పెళ్లాడి వీసా లభించక ఇబ్బందులు పడుతున్నవారికి, గల్ఫ్‌ దేశాలకెళ్లి అక్కడ వెట్టిచాకిరీలో మగ్గినవారికి ఆమె అమ్మలా ఆపన్నహస్తం అందించారు. ‘మీరు అరుణగ్రహంపై చిక్కుకున్నా కాపాడతాన’ంటూ ఆమె ఒక సందర్భంలో పెట్టిన ట్వీట్‌ విదేశాల్లో ఉండకతప్పనివారికి ఎంతో భరోసానిచ్చింది.

ఆమెలోని మాన వీయతకు అద్దం పట్టింది. విదేశాంగ శాఖలో కూడా ఇంత చేయొచ్చా అని అందరూ ఆశ్చర్య పోయారు. అడ్వాణీ శిబిరానికి చెందినవారు గనుక ఆమెకు మోదీ ప్రభుత్వంలో చోటుండకపోవ చ్చన్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఆమె సమర్థతను మోదీ సరిగానే గుర్తించారు. కీలకమైన విదే శాంగ శాఖ అప్పగించారు. వాజపేయి ప్రభుత్వంలో సమాచార మంత్రిగా ఆ శాఖపై సుష్మ చెరగని ముద్రవేశారు. చిత్రరంగాన్ని పరిశ్రమగా గుర్తించింది ఆమె హయాంలోనే. అందువల్లే చిత్ర నిర్మా ణాలకు బ్యాంకు రుణాలు అందడం మొదలైంది. తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఎదగనీయడం లేదని అనేకులు ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటివారు సుష్మ రాజకీయ జీవితం అధ్యయనం చేయాలి. అడుగడుగునా ఆధిపత్య ధోర ణులు, పితృస్వామిక భావజాలం తొంగిచూసే సమాజంలో ఎలాంటి నేపథ్యమూ లేని కుటుంబాల నుంచి వచ్చిన మహిళలకు ఏదో ఒక రూపంలో, ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు తప్పవు. వాట న్నిటినీ దీటుగా ఎదుర్కొనడం వల్లనే, తనను తాను నిరూపించుకోవడం వల్లనే సుష్మా స్వరాజ్‌ ఇంతమంది అభిమానాన్ని పొందగలిగారు. విశిష్ట నేతగా ఎదిగారు. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా