‘మొబైల్‌’ కశ్మీరం

15 Oct, 2019 03:10 IST|Sakshi

మరో పది రోజుల్లో జమ్మూ–కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుండగా సోమవారం ఆ రాష్ట్రంలో మొబైల్‌ సర్వీసుల్ని పాక్షికంగా పునరుద్ధరించారు. ఇకనుంచి అమ్మాయిలు, అబ్బాయిలు ఇంచక్కా మళ్లీ ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోవచ్చునని అంటూ త్వరలోనే ఇంటర్నెట్‌ సర్వీ సులు కూడా పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ప్రకటించారు. అమ్మాయిలు, అబ్బాయిల సంగతేమోగానీ.. చదువులకోసం, ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వలసపోయిన తమ కన్నబిడ్డలెలా ఉన్నారో తెలియక కలవరపడిన తల్లిదండ్రులున్నారు. వయసు మీదపడిన తమ పెద్దలు అక్కడెలా కాలక్షేపం చేస్తున్నారో, వారి యోగక్షేమాలేమిటో తెలియక దేశంలోని వివిధచోట్ల ఉంటున్న వారి పిల్లలు బెంగపెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న బంధు వులు, స్నేహితుల మధ్య కూడా ఇటువంటి పరిస్థితే నెలకొన్నది. ఆపత్సమయాల్లో వైద్యుడికి కబురు పెట్టేందుకు కూడా వీలులేకుండా పోయింది. ఇలా లక్షలాదిమంది 72 రోజుల నుంచి పడుతున్న మానసిక యాతనలకు ఇప్పుడు ముగింపు లభించింది. గత నెల 15 నుంచి ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సదుపాయంపై ఉన్న ఆంక్షల్ని సడలించారు. దాన్ని ఇళ్లలో వినియోగిస్తున్నవారు తక్కువ గనుక అందువల్ల కలిగిన మార్పు స్వల్పమే.

ఏదైనా అలవాటుగా, అతి సహజంగా మారినప్పుడు.. కోరుకున్న వెంటనే అందుబాటులో కొచ్చినప్పుడు దాని విలువను గుర్తించడం ఎలాంటి వారికైనా కష్టమే. కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం మాత్రమే కాదు... సాధారణ కదలికలపై సైతం ఆంక్షలు వచ్చి పడిన కశ్మీర్‌లో ఫోన్‌ సౌకర్యం పునరుద్ధరణ జరిగాక ఎటువంటి భావోద్వేగాలు ఉబికి వచ్చాయో చానెళ్ల లోని దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఈ సమస్య ఒక్క కశ్మీరీలది మాత్రమే కాదు... అక్కడ శాంతిభద్రత లను కాపాడటానికెళ్లిన జవాన్లది కూడా. వారు సైతం తమ క్షేమసమాచారాలను దూరప్రాంతాల్లో ఉన్న తమ ఆప్తులతో పంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సత్యపాల్‌ మాలిక్‌ అన్నట్టు మొబైల్‌ సర్వీసుల కన్నా కశ్మీరీల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం కావొచ్చు. వాటిని ఉగ్రవాదులు వినియోగించుకుని విధ్వంసకర కార్యకలాపాలకు దిగే ప్రమాదం ఉండొచ్చని ప్రభుత్వానికేర్పడ్డ భయాందోళనలు సహేతుకమైనవే కావొచ్చు. అయితే వాటికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే, కొన్ని పరిమితులతోనైనా కమ్యూనికేషన్‌ సదుపాయాలకు వీలు కల్పించి ఉంటే బాగుండేది. పర స్పరం సంభాషించుకోవడానికి, స్వేచ్ఛగా సంచరించడానికి, తమ భావాలను వ్యక్తం చేయడానికి, అయినవారి గురించి తెలుసుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఎలాంటివారికైనా దుర్భరమనిపిస్తాయి. బతుక్కి అర్ధం లేదనిపిస్తాయి.

ఒక్క కమ్యూనికేషన్ల వ్యవస్థ మాత్రమే కాదు...ఆ రాష్ట్రంలో లక్షలాదిమంది పిల్లలు బడి మొహం చూసి కూడా 72 రోజులవుతోంది. బడులేమిటి...ఉన్నత విద్యాసంస్థల వరకూ అన్నిటా అదే పరిస్థితి. ఈ నెల 9 నుంచి కళాశాలలు తెరిచారు. కానీ హాజరవుతున్న విద్యార్థులు అంతంత మాత్రమే. ఒక విద్యాసంవత్సరంలో ఇంత సుదీర్ఘకాలం విద్యార్థులు చదువులకు దూరం కావడం వారి భవిష్యత్తుకెంత నష్టం కలిగిస్తుందో చెప్పనవసరం లేదు. దేశంలో ఇతర ప్రాంతాల విద్యార్థు లతో సమంగా వారు పోటీపడటం అసాధ్యమవుతుంది. విద్యాసంస్థలతోపాటు దుకాణాలు, ప్రజా రవాణా వ్యవస్థ కూడా పడకేశాయి. ఆ రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించాలని ప్రభుత్వం కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నదనడానికి ఈమధ్య అక్కడి పత్రికల్లో ఇచ్చిన వాణిజ్య ప్రకటనే సాక్ష్యం. మూతపడిన దుకాణాలు, కనబడని ప్రజారవాణా వ్యవస్థ ఎవరి లబ్ధికంటూ ఆ ప్రకటన ప్రశ్నించింది. ‘మిలిటెంట్లకు లొంగిపోదామా... ఆలోచించండ’ని కోరింది. దుకాణాలు, విద్యాసంస్థలు మూతబడటం మిలిటెంట్ల బెదిరింపుల వల్లేనని అధికారులు చెబుతుంటే, అది నిరసన వ్యక్తీకరణగా 370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్నారు. మీడియాపై ఆంక్షలు లేకుంటే ఇలాంటి పరిస్థితులు చాలావరకూ నిరోధించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో, వాటి మంచిచెడ్డలేమిటో తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు సాధారణ ప్రజానీకం భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉండదు. సమాచార వినిమయంపై ఆంక్షలున్నప్పుడే వదం తులు రాజ్యమేలుతాయి. ఆ స్థితిని తమకనుకూలంగా వినియోగించుకునేందుకు రకరకాల శక్తులూ ప్రయత్నిస్తాయి. కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తు న్నప్పుడు చేసిన ప్రకటనలో ఇది తాత్కాలికమేనని ప్రకటించింది. పరిస్థితులు అనుకూలించాక తిరిగి రాష్ట్ర ప్రతిపత్తినిస్తామని తెలిపింది.

ఇంకా నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్‌ వంటి ప్రధాన పక్షాల నేతలు నిర్బంధంలోనే ఉన్నారు. కనుకనే ఈ నెల 24న జరగబోయే బ్లాక్‌ డెవెలప్‌మెంట్‌ కౌన్సిళ్ల ఎన్నికల్లో తాము పాలు పంచుకోవడం లేదని ఆ పార్టీలు తెలియజేశాయి. 370 అధికరణ రద్దు విషయంలో భిన్నాభిప్రా యంతో ఉన్నా ఈ పార్టీలన్నీ జమ్మూ–కశ్మీర్‌ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టంగా ప్రకటించినవే. కశ్మీర్‌లో వేర్పాటువాదుల పలుకుబడి గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గడంలో ఈ పార్టీల పాత్ర కూడా తక్కువేమీ కాదు. ఈమధ్యకాలంలో వరసగా ఆంక్షలు సడలిస్తున్నామని జమ్మూ–కశ్మీర్‌ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటున్న పర్యాటకం నాలుగు రోజుల క్రితం మొదలైంది. అయితే సందర్శకుల తాకిడి పెరగడానికి కొంచెం సమయం పడుతుంది. అంతర్జాతీయంగా కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట పడా లంటే అక్కడ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడమే మార్గం. రాష్ట్రంలోనూ, వెలుపలా నిర్బం ధంలో ఉన్న కశ్మీర్‌ నేతలను కూడా సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తే అక్కడ పరిస్థితి మెరుగ వుతుంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి.

>
మరిన్ని వార్తలు