శరద్‌ పవార్‌ రాయని డైరీ

28 Jan, 2018 01:49 IST|Sakshi

‘సంవిధాన్‌ బచావ్‌’ సక్సెస్‌ అయింది! రిపబ్లిక్‌ డే రోజు ముంబైలో పెద్ద ర్యాలీ తీశాం. సీతారాం ఏచూరి, శరద్‌ యాదవ్, ఒమర్‌ అబ్దుల్లా, పృథ్వీరాజ్‌ చవాన్, హార్ధిక్‌ పటేల్, అల్పేశ్‌ ఠాకూర్, ఇంకా.. నేను తెలిసినవాళ్లు, నాకు తెలియనివాళ్లు చాలామంది వచ్చారు. ర్యాలీ మధ్యలో ఎవరో నా వెనుక నుంచి నా ముందుకు వచ్చి.. ‘‘మీకెందుకు పవార్‌జీ.. శ్రమ’’ అని నా దగ్గర్నుంచి ఏదో లాక్కుపోయారు. ర్యాలీలో శరద్‌ యాదవ్‌  నా పక్కనే ఉన్నాడు. 
‘‘యాదవ్‌.. నా దగ్గర్నుంచి ఎవరో ఏదో లాక్కుపోయారు, వాళ్లెవరో చూడొద్దు కానీ, ఏం లాక్కుపోయారో చూసి చెప్పు’’ అన్నాను. 
‘‘మీ దగ్గర ఏం ఉండేదో గుర్తు చేసుకుంటే, మీ దగ్గర్నుంచి ఏం లాక్కుపోయారో తెలుస్తుంది కదా సర్‌’’ అన్నాడు హార్ధిక్‌ పటేల్‌!
కుర్రాడు షార్ప్‌గా ఉన్నాడు. ‘‘పోనీ, నువ్వు చెప్పు. నువ్వూ నా పక్కనే ఉన్నావు కదా’’ అన్నాను. 
‘‘మీ దగ్గర్నుంచి ఏం లాక్కెళ్లారో చెప్పలేను కానీ, మీ దగ్గర్నుంచి ఎవరు లాక్కెళ్లారో చెప్పగలను సర్‌’’ అన్నాడు హార్ధిక్‌ పటేల్‌. 
‘‘మనది ఎవరు లాక్కెళ్లారో మనకెందుకయ్యా. మనది ఏం లాక్కెళ్లారో ముఖ్యం కానీ’’ అన్నాను. 
‘‘కానీ సర్, మనది ఏం లాక్కెళితే మనకెందుకు? మనది ఎవరు లాక్కెళ్లారో ముఖ్యం కానీ’’ అన్నాడు. 
జనరేషన్‌ గ్యాప్‌!
ర్యాలీ అయ్యాక అంతా ఒకచోట కూర్చున్నాం. 
‘‘29న ఢిల్లీకి ఎవరొస్తారో చేతులెత్తండీ’’ అన్నాను. కొంతమంది ఎత్తారు. కొంతమంది ఎత్తలేదు! 
ఎత్తినవాళ్లు ఎందుకు ఎత్తారో అడిగాను. ‘‘మీరు ఎత్తమన్నారు కాబట్టి ఎత్తాం’’ అన్నారు. ఎత్తనివాళ్లు ఎందుకు ఎత్తలేదో అడిగాను. ‘‘ఆ రోజు మేము ఢిల్లీలోనే ఉంటాం కాబట్టి ఎత్తలేదు’’ అన్నారు!
‘‘ఉంటే మాత్రం? చెయ్యెత్తకూడదా?’’ అన్నాను. 
‘‘ఢిల్లీలో లేనివాళ్లు ఢిల్లీ రావడానికి చెయ్యెత్తాలి కానీ, ఢిల్లీలో ఉండేవాళ్లు ఢిల్లీ వస్తామని చెయ్యెత్తడానికి ఏముంటుంది పవార్‌జీ?’’ అన్నారు! 
‘‘అక్కడ మళ్లీ ఇంకొక ర్యాలీనా సర్‌’’ అన్నాడు అల్పేశ్‌ ఠాకూర్‌ ఉత్సాహంగా. 
‘‘ర్యాలీ కోసం కాదయ్యా.. అందరం కూర్చొని మాట్లాడుకోడానికి. ఇవాళెందుకు ర్యాలీ తీశాం? రాజ్యాంగాన్ని రాయిలా చేత్తో పట్టుకుని తిరుగుతున్నాడనే కదా మోదీ! ఆయన చేతుల్లోంచి రాజ్యాంగాన్ని లాగేసుకోవడం ఎలా అని ఆ రోజు ప్లాన్‌ చేస్తాం’’ అని చెప్పాను. 
హార్థిక్‌ పటేల్‌ నా చేతికి జాతీయ జెండా అందించాడు!!
‘‘ఏంటయ్యా ఇది? కాంప్లిమెంటా!’’ అన్నాను.
‘‘లాక్కెళ్లినవాడి దగ్గర్నుంచి లాక్కొచ్చాను సార్‌’’ అన్నాడు!
అతడివైపు చూశాను. 
లాక్కొచ్చే పనికి బాగా పనికొచ్చేలా ఉన్నాడు. 
‘‘రా.. నా పక్కన కూర్చో’’ అన్నాను.

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు