ముల్లా నసీరుద్దీన్ కథలు

5 Aug, 2013 00:14 IST|Sakshi
ముల్లా నసీరుద్దీన్ కథలు
ముల్లా నసీరుద్దీన్ వాక్చమత్కారానికి, సద్యఃస్ఫూర్తికి పెట్టింది పేరు. వ్యంగ్యంతో కూడిన హాస్య కథలు ఆయన సొత్తు. సామాన్యుడులా కనిపించే అసామాన్యుడు. అమాయకుడులా కనిపించే అఖండ మేధావి. విదూషకుడులా కనిపించే జ్ఞాని. సూఫీ తత్వవేత్త. డాబు, దర్పం ఏ మాత్రం ఎరుగని నిష్కల్మష హృదయుడు. ప్రజల మనిషి. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ముల్లా నసీరుద్దీన్ టర్కీ దేశంలో పుట్టి ఏడు వందల ఏండ్లు గడిచిపోయినా ప్రపంచం ఆయన్ను మరచిపోలేదు. పోదు. ప్రజలు ఆయన్ను ఎంతగా ప్రేమించారంటే, చాలా దేశాలు ఆయన్ను తమ దేశానికి చెందిన వాడుగానే భావించి గౌరవిస్తున్నారు. మొదట్లో ఆయన పేరు మీద ఉన్న కథలు ఎన్నో చెప్పలేముగాని, ప్రతి తరంలోనూ కొత్త కొత్తవి చేర్చబడుతూ, పాతవి కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ, నేటికి వాటి సంఖ్య వెయ్యి వరకు వచ్చింది. చాలా దేశాల్లో ఈ కతలు వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా మార్పు చెంది, జానపద కథల్లో భాగమై
 పోయాయి. ప్రపంచంలోని అనేక భాషల్లోకి ఈ కథలు అనువాదం చెందాయి. నలుగురు కలిసి కూర్చున్న చోట, నసీరుద్దీన్ కథలు చెప్పుకొని  ఆనందించటం చాలా దేశాల సంస్కృతుల్లో ఆనవాయితీగా ఉన్నది. సందర్భానికి తగ్గట్టుగా ఏదో కథ ఉంటుంది. ప్రతి కథలో పైకి కనిపించే అర్థం ఒకటి, లోతుగా ఆలోచిస్తే తెలిసే లోపలి అర్థం ఇంకొకటి ఉంటుంది. గంభీరమైన తాత్వికార్థం ఉండబట్టే ఈ కథలకు అంతటి ఖ్యాతి, గౌరవం లభించింది. ముల్లా నసీరుద్దీన్ కథల గురించి ఉపన్యసించే కంటే, ఆ కథల్నే ఒకటి రెండు వినిపిస్తే వాటి గొప్పతనం వినేవాళ్లకు చప్పున స్ఫురిస్తుంది.
 
 ఎవరిని నమ్మేది?
 ముల్లా నసీరుద్దీన్ ఇంటికి ఓ పొరిగింటాయన వచ్చి తలుపు కొట్టాడు. ముల్లా తలుపు తీశాడు. ‘ఈ ఒక్కరోజుకు నీ గాడిదను అరువిస్తావా? పక్క ఊరికి సరుకు తీసుకు వెళ్లాలి’ అని అడిగాడు ఆ వచ్చినాయన. గాడిదను ఇవ్వడం ముల్లాకు ఇష్టం లేకపోయింది. తన అయిష్టత బయట పడకుండా ముల్లా సమాధానం చెప్పాడు.‘క్షమించాలి. ఏమనుకోకు. నేను ఈ వరకే గాడిదను ఇంకొకరికి ఇచ్చాను’సరిగ్గా అదే సమయానికి దొడ్లో కట్టివేసిన గాడిద ఓండ్ర పెట్టటం వినిపించింది. ‘ముల్లా. మరి నీ గాడిద అరుపు వినిపిస్తోంది గదా’ అన్నాడు ఆ పొరిగింటాయన. ‘ఎవర్ని నమ్ముతావు నీవు?’ చిరాగ్గా అడిగాడు ముల్లా. ‘నన్నా... ఆ గాడిదనా?’
 
 ఒకటే రుచి
 ద్రాక్ష పళ్లతో నిండిన రెండు బుట్టల్ని గాడిద మీద వేసి తోట నుండి తిరిగి వస్తున్న ముల్లాను చూశారు కొంతమంది పిల్లలు. వాళ్లు నసీరుద్దీన్ చుట్టూ చేరి రుచి చూడటానికి కాసిని ద్రాక్ష పళ్లు అడిగారు. ముల్లా ద్రాక్ష గుత్తినొక దాన్ని తీసి తలా ఒక ద్రాక్ష పండు ఇచ్చాడు. ‘అన్ని ద్రాక్ష పళ్లు ఉన్నవి గదా నీ దగ్గర. మాకిచ్చేది ఇంతేనా?’ అని గొణిగారు వాళ్లు. ‘బుట్టడైనా, ఒక్కటైనా తేడా ఏం లేదు. అన్నింటిదీ ఒకటే రుచి’ అంటూ ముల్లా ముందుకు సాగిపోయాడు.
 
 ప్రసంగం:
 ఓసారి నసీరుద్దీన్‌ను మతం గురించి ప్రసంగించవలసిందిగా ఆ ఊరి వాళ్లు కోరారు. ప్రసంగించే ముందు నసీరుద్దీన్ అడిగాడు- ‘నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా?’. తెలియదని చెప్పారు వాళ్లు. వెంటనే నసీరుద్దీన్ ‘నేను ఏం మాట్లాడబోతున్నానో తెలియనివాళ్ల ముందు ప్రసంగించటం నాకు ఇష్టం 
 
 లేదు’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊళ్లో వాళ్లు చాలా తర్జనభర్జన పడి, మర్నాడు మళ్లీ ఆయన్ను పిలిచారు. ఈసారి నిన్నటికి మల్లే అదే ప్రశ్న వేయగా అందరూ ‘తెలుసు’ అని సమాధానం చెప్పారు. వెంటనే ముల్లా ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు ముందుగానే తెలుసు గాబట్టి మీ సమయాన్ని నేను వృథా చేయను’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.దాంతో వూరి వాళ్లందరూ నిజంగానే అయోమయంలో పడ్డారు. ఇంకోసారి ప్రయత్నించి చూద్దామని, మరుసటి రోజు మళ్లీ నసీరుద్దీన్‌ను ఆహ్వానించారు.
  అతడు మళ్లీ అదే ప్రశ్న వేశాడు ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు తెలుసా?’ 
 ఈసారి వాళ్లంతా ముందుగానే కూడబలుక్కుని వచ్చారు. అందువల్ల సగం మంది ‘తెలుసు’ అని, సగం మంది ‘తెలియదు’ అని సమాధానం చెప్పారు. అప్పుడు ముల్లా నసీరుద్దీన్ అన్నాడు- 
 ‘తెలిసిన సగం మంది తెలియని సగం మందికి చెప్పండి’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
 
 లెక్క
 ఒకప్పుడు నసీరుద్దీన్ దగ్గర కొంత డబ్బు పోగైంది. దాంతో చాలామంది ఆయన చుట్టూ చీమల్లా చేరారు. ఒకాయన నసీరుద్దీన్‌ను అడిగాడు ‘ముల్లా. నీకెంత మంది స్నేహితులు ఉన్నారో లెక్క చెప్పగలవా?’ అని. 
 అందుకు నసీరుద్దీన్ అన్నాడు, ‘ఇప్పటికిప్పుడు లెక్క చెప్పటం ఎలా కుదురుతుంది? చేతిలో పైసా లేనప్పుడు గదా ఆ లెక్క తెలిసేది?
 
 ’వెతకడం 
 
 ఓసారి ముల్లా నసీరుద్దీన్ తన ఇంటి బయట ఏదో వెతుకుతూ ఒకతనికి కనిపించాడు. ఏమిటి అని అడిగితే తాళం చెవి కోసం అని సమాధానం చెప్పాడు. ఆ అడిగిన మనిషి కూడా ముల్లాతో పాటు వెతకటం మొదలుపెట్టాడు. కాసేపయ్యాక అతడు అడిగాడు.
 
 ‘నీవు సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నావు?’
 ముల్లా సమాధానం - ‘ఇంట్లో’
 ‘మరి ఇక్కడ వెతుకుతున్నావెందుకు?’
 ‘ఇంట్లో కంటే ఇక్కడ వెలుతురు ఎక్కువగా ఉంది’ అని ముల్లా సమాధానం. 
 
 ఇలా ఉంటవి ముల్లా నసీరుద్దీన్ కథలు. అటు టర్కీ నుంచి ఇటు చైనా, రష్యాల దాకా ఇవాళ ఆయన పేరు విననివాళ్లు లేరు. ముల్లా నసీరుద్దీన్‌ను కొన్ని దేశాల్లో నసీరుద్దీన్ హోడ్జా అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నసీరుద్దీన్ ఉత్సవం ప్రతి సంవత్సరం అతని నివాస స్థలమైన టర్కీలోని అక్సెహిర్ పట్టణంలో జూలై 5- 10 మధ్య జరుగుతుంది. యునెస్కో వారు 1996-97 సంవత్సరాన్ని అంతర్జాతీయ  నసీరుద్దీన్ సంవత్సరంగా గుర్తించి, అతని కథలకు అతనికి ఒక ప్రత్యేకమైన గౌరవం కలుగచేశారు.
 - దీవి సుబ్బారావు
 
మరిన్ని వార్తలు