రాహుల్‌ పశ్చాత్తాపం!

4 Oct, 2013 09:47 IST|Sakshi
రాహుల్‌ పశ్చాత్తాపం!
నేర చరితుల రక్షణకు సంకల్పించిన ఆర్డినెన్‌‌సను వ్యతిరేకించడమే కాదు... యూపీఏ సమన్వయ కమిటీని, కేంద్ర కేబినెట్‌నూ, ప్రధాని మన్మోహన్‌నూ ‘నాన్సెన్స్’ అన్న ఒక్క పదంతో తీసి అవతలపారేసినట్టు మాట్లాడిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆరురోజుల ఆలస్యంగా జ్ఞానోదయమైంది. తాను వాడిన పదజాలం పరుషమైనదని అమ్మ చెప్పిందని ఆయన గురువారం ప్రకటించారు. అయితే, తాను అలా అనడం వెనకున్న మనోభావాన్ని అర్ధం చేసుకోమని ఆయన కోరుతున్నారు. బాల్యంలో ఫలానాది కావాలనో, వద్దనో మారాం చేయడం వింతేమీ కాదు. కానీ కాలం గడిచేకొద్దీ, పరిణతివచ్చేకొద్దీ అన్నీ అర్ధం కావాలి. హద్దులేమిటో తెలియాలి. అలాంటి హద్దులు ఆయనకు తెలిసినట్టులేదని ఈ ఎపిసోడ్‌ వెల్లడించింది. 
 
అలాగని ఆయన ఆర్డినెన్‌‌సను తప్పుబట్టడం తప్పని ఎవరూ అనడంలేదు. అందుకు ఎంచుకున్న సమయాన్ని, మాట్లాడి న తీరునూ మాత్రమే విమర్శిస్తున్నారు. ఆ సమస్యపై అఖిలపక్ష భేటీ జరిగినప్పుడు, యూపీఏ సమన్వయ కమిటీ భేటీ జరిగినప్పుడు కాంగ్రెస్‌ తరఫున ఏం చెప్పాలో ఆయన వెల్లడించలేదు. కనీసం ఆ రెండు సమావేశాల్లోనూ కాంగ్రెస్‌ తీసుకున్న వైఖరి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అది తప్పో, కాదో చెప్పలేదు. కేంద్ర కేబినెట్‌ సమావేశమై బిల్లును ఖరారు చేశాకైనా, దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాకైనా ఆరా తీయలేదు. ఆర్డినెన్‌‌స జారీచేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించినప్పుడైనా జోక్యంచేసుకోలేదు. ఇలా ఎన్నో రోజుల నుంచి భిన్న వేదికలపై నలుగుతున్న ఒక సమస్యపై ఏనాడూ మాట్లాడకుండా హఠాత్తుగా వచ్చి ‘దాన్ని చించి అవతల పారేయాల’నడమే అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. 
 
అయితే, ఆర్డినెన్‌‌స జారీ యత్నమే తనను దిగ్భ్రాంతిపరిచిందని రాహుల్‌ అంటున్నారు. కనుక అలా మాట్లాడవలసి వచ్చిందన్నది ఆయన సంజాయిషీ. ఆర్డినెన్‌‌సను విమర్శించడమేకాక... అదే కాంగ్రెస్‌ శ్రేణుల మనోగతమని ఆయన చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. అదే నిజమైతే, వారందరి స్వరం ఏ దశలోనూ ఎందుకు వినబడలేదు? టీవీ చానెళ్ల చర్చల్లో కాంగ్రెస్‌ తరఫున మాట్లాడినవారంతా దాన్ని ఎంతగానో సమర్ధించుకున్నారు. సరే...ఏమి మాట్లాడినా, ఏమి చేసినా చివరకు రాహుల్‌ మాటే నెగ్గింది. దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్‌‌స ఉపసంహరించుకుంటున్నట్టు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. 
 
ఈ ఆర్డినెన్‌‌స వ్యవహారమంతా ముగిసిన అధ్యాయంగా భావించాలని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ చెబుతున్నారు. ఆయన చెప్పినదాంట్లో నిజముంది. ఇప్పుడు ఆర్డినెన్‌‌స గురించి లాలూవంటి కొందరికి తప్ప ఎవరికీ బాధలేదు. అయితే, ఈ అధ్యాయం తీసుకొచ్చిన కొత్త సంప్రదాయంలోని గుణదోషాల గురించిన చర్చ అంత సులభంగా ముగిసిపోదు. ఎందుకంటే, ఈ మొత్తం వ్యవహారంలో... నిర్ణయంలోని తప్పొప్పుల సంగతలా ఉంచి నిర్ణయప్రక్రియే అభాసుపాలైంది. ఒక వ్యక్తి శక్తిమంతుడైతే ప్రజాస్వామిక పద్ధతిలో తీసుకునే ఏ నిర్ణయమైనా గాలికి కొట్టుకుపోతుందని అందరికీ అర్ధమైంది. బీజేపీ వంటి పార్టీలు వెనక్కి తగ్గాయి గనుక అఖిలపక్ష భేటీలో వ్యక్తమైన అభిప్రాయాలను పక్కనబెట్టినా యూపీఏ మిత్రుల సమావేశం, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చించిందంతా ఏమైనట్టు? ఒక్క వ్యక్తి అభ్యంతరంతో అంత మంది సమాలోచనల సారాంశమంతా కొట్టుకుపోవడమేమిటి? రాజకీయాల్లో కొందరు వ్యక్తులే అన్నీ నిర్ణయించే పరిస్థితి మారాలని తాను కోరుకుంటున్నట్టు రాహుల్‌ చెప్పారు. 
 
కానీ, ఇప్పుడు జరిగింది అదే కదా! నిజానికి యూపీఏ మిత్రపక్షాలైన ఎన్‌సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్‌‌సలకు ఆగ్రహం కలిగింది అందుకే. యూపీఏ భేటీలో నిర్ణయించిన అంశాన్ని ఒక వ్యక్తి అడిగేసరికి మార్చేయడమేమిటని శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. వారి బాధ రాహుల్‌కు ఇప్పటికీ అర్ధమైనట్టు లేదు. అలాంటి వారి ప్రతిస్పందనలే తనను దిగ్భ్రాంతిపరుస్తున్నాయని ఆయనంటున్నారు. అదే నిజమైతే, ఆయన ఇంకా మారనట్టే లెక్క. తన పదజాలం పరుషంగా ఉండొచ్చుగానీ... తన మనసుకు తోచింది చెప్పానంటున్నారాయన అయితే, అందుకో పద్ధతి ఉండాలని ఇంకా గ్రహించడంలేదు. ఆయన ఆ విధంగా మాట్లాడే సమయానికి ప్రధాని అమెరికాలో ఉన్నారు. 
 
తన మాటలవల్ల మన్మోహన్‌ చులకనవుతారని... ఆయన విశ్వసనీయత దెబ్బతింటుందని రాహుల్‌ అప్పుడుగానీ, ఇప్పుడుగానీ గ్రహించలేదు. వాస్తవానికి తాము తీసుకున్న నిర్ణయం పర్యవసానంగా తమ ప్రతిష్ట ఎంతగా దెబ్బతిన్నదో కాంగ్రెస్‌ పెద్దలు గ్రహించకపోలేదు. దాన్నుంచి బయటపడటానికి వారు అప్పటికే మార్గాలు వెతుక్కుంటున్నారు. అందులో ‘రాహుల్‌ దాడి’ ఒక మార్గం అయితే కావొచ్చుగానీ... అది సరైన దోవ ఎంతమాత్రమూ కాదు. అసలు నిర్ణయాధికారం మన్మోహన్‌ వద్దలేదని యూపీఏ తొలి దశ పాలనా కాలంలోనే విమర్శలు మొదలయ్యాయి. 
 
ఇప్పుడు రాహుల్‌ జోక్యం దాన్ని బహిరంగంగా నిరూపించింది. అంతేకాదు... విధాన రూపకల్పనƒ విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా గానీ... కాంగ్రెస్‌కూ, ప్రభుత్వానికీ మధ్యగానీ ఏమాత్రం సమన్వయం లేదని నిరూపణ అయింది. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని అమెరికానుంచి వచ్చాక మన్మోహన్‌ ప్రకటించారు. రాజీనామా డిమాండ్‌ చేసినవారికి కూడా ఈ విషయంలో ఆయనపై పెద్దగా ఆశలేమీ లేదు. కానీ, సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్‌ తిరస్కరించినా దాని అభీష్టానికి భిన్నంగా ఆర్డినెన్‌‌స తీసుకురాబోయిన వారు ఒకే ఒక్క వ్యక్తి అభిప్రాయం ముందు ఎలా తలవంచారన్న ప్రశ్న ఎప్పటికీ సమసిపోదు. అందుకు ఇప్పుడు కాకపోతే రేపైనా మన్మోహన్‌ సంజాయిషీ ఇచ్చుకోకతప్పదు.
మరిన్ని వార్తలు