దౌత్యంలో నూతనాధ్యాయం

20 Nov, 2014 00:59 IST|Sakshi

 ప్రపంచమే కుగ్రామమై... ప్రతి దేశమూ తన ప్రత్యేకతలేమిటో చెప్పుకుని, తనతో చెలిమి చేస్తే వచ్చే ప్రయోజనాలేమిటో ఏకరువుపెట్టి అందరినీ ఆకర్షించి పైపైకి ఎదగాలని భావిస్తున్న తరుణమిది. ఇలాంటి సమయంలో ఏ దేశాధినేత అయినా పాలనలో సమర్థత చూపినంత మాత్రాన సరిపోదు. అంతకుమించి ఎదుటివారిని అవలీలగా ఒప్పించగల సేల్స్‌మాన్ లక్షణం కూడా అవసరం. ప్రధాని నరేంద్ర మోదీలో ఈ లక్షణం పుష్కలంగా ఉన్నదని ఇప్పటికే నిరూపణ అయింది. విదేశీ పర్యటనల్లో మోదీ ఆయా దేశాధినేతలనూ, అక్కడి పరిశ్రమల అధిపతులనూ కలవడంతోపాటు ‘మేకిన్ ఇండియా’ నినాదంతో ఎన్నారై మదుపుదారులను, ఇతరేతర రంగాల్లో స్థిరపడినవారిని ఉత్తేజపరుస్తున్నారు. సుస్థిర ప్రభుత్వానికి సారథ్యంవహిస్తున్న నేతగా, దేశాన్ని కొత్త పుంతలు తొక్కించగల సమర్థుడిగా పరిగణించినందువల్ల కావొచ్చు...ప్రపంచ దేశాలు మోదీని ఆకర్షించడం కంటే, ఆయనే వారిని ఆకర్షించగలుగుతున్నారు. భూటాన్ మొదలుకొని జపాన్, బ్రెజిల్, అమెరికాల్లో గతంలో రుజువైనదే ఇప్పుడు మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ పర్యటనల్లోనూ ప్రస్ఫుటమైంది. ఈసారి మయన్మార్‌లో తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలోనూ, ఆస్ట్రేలియాలో జీ-20 దేశాల సమావేశంలోనూ ఆయన పాల్గొని వివిధ దేశాల అధినేతలను కలిశారు. ఆస్ట్రేలియా, ఫిజీ పార్లమెంటులను ఉద్దేశించి ప్రసంగించారు.
 
  భారత్, ఆస్ట్రేలియాల సాన్నిహిత్యానికి గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఆ విషయంలో అనుకున్నంత పురోగతి లేదు. ప్రధానిగా రాజీవ్‌గాంధీ ఆ దేశం పర్యటించి 28 ఏళ్లయ్యాక మోదీ అక్కడికెళ్లారంటే మనవైపు నిర్లక్ష్యం ఎంత ఉన్నదో అర్థమవుతుంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి పరస్పర అనుమానాలు... అక్కడ ఉద్యోగావకాశాలకూ, ఉన్నత చదువులకూ వెళ్లిన మన యువకులపై అయిదేళ్లక్రితం జరిగిన జాతి వివక్ష దాడులూ సంబంధాల విస్తృతికి అవరోధమ య్యాయి. అంతేకాదు... ఆస్ట్రేలియాలో గతంలో ఉన్న జూలియా గిలార్డ్స్ ప్రభుత్వమైనా, మన దేశంలో అప్పట్లో ఉన్న యూపీఏ సర్కారైనా బలహీన ప్రభుత్వాలు కావడం... భారత్‌తో సాన్నిహిత్యానికి ప్రయత్నిస్తే చైనాకు అనవసర అనుమానాలు కలుగుతాయని గిలార్డ్స్ ప్రభుత్వం భావించడం కూడా సంబంధాల మెరుగుదలకు ఆటంకమయ్యాయి. వాస్తవానికి హిందూ మహా సముద్రం, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో చైనా క్రమేపీ తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్న దశలో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యం మన వ్యూహాత్మక ప్రయోజనాలకు చాలా ముఖ్యం. కొత్త నాయకత్వం అధికారంలోకొచ్చాక అటు ఆస్ట్రేలియా సైతం ఈ అవసరాన్ని గుర్తించింది. కనుకే మొన్న సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ భారత పర్యటనకు రావడమే కాక, గతంలోని భయాలను దూరం పెట్టి మన దేశంతో పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక మైలురాయి. వ్యవసాయం, బొగ్గు, మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీరంగం వంటి అంశాల్లో ఆస్ట్రేలియాకు మన దేశంలో ఎన్నో అవకాశాలున్నాయి. అలాగే, సేవారంగం, భద్రతా సహకారం, వాణిజ్యం వంటి విషయాల్లో ఆస్ట్రేలియా మనకు ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం మనకున్న ద్వైపాక్షిక వాణిజ్యం విలువ మొత్తంగా 1,500 కోట్ల డాలర్లు మించి లేదు. 2015 నాటికి ఈ వాణిజ్యాన్ని 4,000 కోట్ల డాలర్లకు పెంపొందించుకోవాలని రెండేళ్లక్రితం ఉభయ దేశాలూ భావించినా ఆ దిశగా ఇంతవరకూ ముందడుగు పడలేదు. ఒకపక్క ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న ఆస్ట్రేలియా-చైనాల వాణిజ్యం ఇప్పటికే 15,000 కోట్ల డాలర్లకు చేరుకోగా ఇటీవలే ఆ రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడికను సైతం కుదుర్చుకున్నాయి. ఇలాంటి దశలో మనలో ఎంత చురుకుదనం ఉండాలో అర్థమవుతుంది.
 
 మన సంబంధాలు గత కొన్నేళ్లుగా అంతంతమాత్రంగానే ఉన్న ఫిజీ గడ్డపై కూడా మోదీ అడుగుపెట్టారు. 1981లో ఇందిరాగాంధీ పర్యటించిన తర్వాత మన ప్రధాని ఒకరు అక్కడికి వెళ్లడం ఇదే మొదటిసారి. దేశ జనాభాలో భారత సంతతి ప్రజలు దాదాపు 38 శాతంగా ఉండేవారు. తరచుగా జరిగే సైనిక తిరుగుబాట్లు, అస్థిరత కారణంగా వేరే ప్రాంతాలకు వలసపోవడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. 338 చిన్న చిన్న దీవుల సముదాయమే కావొచ్చుగానీ పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఫిజీ పాత్ర కీలకమైనది. ఆ దేశంతో రక్షణ, భద్రతా రంగాల్లో సహకార ఒడంబడికతోపాటు వివిధ ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులను, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే మూడు ఒప్పందాలు ఖరారయ్యాయి. మోదీ ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటన సందర్భంగా మయ న్మార్‌లో జరిగిన తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశం, ఆస్ట్రేలియాలో జరిగిన జీ-20 దేశాల సమావేశాల్లో మన స్వరం గట్టిగానే వినబడింది. ముఖ్యంగా జీ-20 దేశాల సదస్సులో ఆర్థిక వ్యవస్థలకూ, భద్రతకూ ముప్పుగా పరిణమించిన నల్ల ధనాన్ని అరికట్టడానికి పరస్పర సహకారం అవసరమన్న మోదీ సూచనకు వివిధ దేశాలనుంచి మద్దతు లభించింది. మొత్తానికి తన పదిరోజుల పర్యటనలో మోదీ దౌత్యంలో కొత్త అధ్యాయాన్ని రచించారు. భారత్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్నేహసంబంధాలను నెలకొల్పుకోవడంలోనూ, విస్తరించుకోవడం లోనూ చాలా ఆసక్తితో ఉన్నదని చాటి చెప్పారు. అలాగే తనది చురుగ్గా... సృజనాత్మకంగా పనిచేసే ప్రభుత్వమన్న భరోసాను ప్రవాస భారతీయుల్లో కల్పించారు. ఇందుకు కొనసాగింపుగా క్షేత్రస్థాయిలో కూడా గుణాత్మకమైన మార్పులు కనిపిస్తే మోదీ కలగంటున్నట్టు భారత్‌కు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి.
 
 

మరిన్ని వార్తలు