మౌలిక రంగంపై దృష్టి

2 Jan, 2020 01:39 IST|Sakshi

ఆర్థిక మాంద్యం ముసురుకొని సాధారణ పౌరులకు ఊపిరాడని వేళ కేంద్ర ప్రభుత్వం మంగళ వారం చేసిన ప్రకటన కాస్తంత ఊరటనిస్తుంది. వచ్చే అయిదేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో 102 లక్షల కోట్లమేర పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించడం ఆ ప్రకటన సారాంశం. ఇంధనం, రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, టెలికాం, ఇరిగేషన్, పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యం, హౌసింగ్, రవాణా, పౌర సదుపా  యాలు వంటి సామాజిక రంగ ప్రాజెక్టుల్లో కూడా ఈ పెట్టుబడులుంటాయి. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 39 శాతం చొప్పున, మిగిలిన 22 శాతం మేర ప్రైవేటు సంస్థలు పెట్టు బడులు పెట్టవలసివుంది. గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మన జీడీపీ 4.5 శాతం మాత్రమే ఉన్నదని, ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుందని వెల్లడైంది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి మాత్రమే కాదు... వరసగా ఆరో ఏడాది నమోదైన క్షీణత. నిరుడు ఫిబ్రవరి మొదలుకొని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తోంది.

అది రెపో రేటు తగ్గించినా అందుకు తగ్గట్టుగా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించలేదు. కనుకనే ఆశించిన స్థాయిలో పెట్టుబడులు పెరగలేదు. కేవలం ఇదొక్కటే కారణమని కూడా చెప్పలేం. ఇప్పుడున్న వాతావరణంలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకూ సురక్షితమో తేల్చుకోలేని స్థితిలో తయారీ రంగ దిగ్గజా లున్నాయన్నది కూడా వాస్తవం. అనుకున్నంతగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఉన్న అవకాశాలు కూడా నానాటికీ కుంచించుకుపోవడం పర్యవసానంగా వినిమయం క్షీణ దశలోవుంది. కనుకనే ఆర్థిక రంగం పతనావస్థలోనే తప్ప పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న దాఖలా కనబడటం లేదు. 2017–18లో నిరుద్యోగిత 6.1 శాతంగా వున్నదని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వెల్లడించగా, సగటు వినిమయం 2011–12, 2017–18 మధ్య కాలంలో గణనీయంగా తగ్గిందని జాతీయ గణాంక విభాగం చెబుతోంది. తయారీ రంగం తొలి త్రైమాసికంలో 0.6 శాతంవుంటే అదిప్పుడు –1.0 శాతానికి పడిపోయింది. 2017–18 తొలి త్రైమాసికంలో కూడా ఇంచుమించు ఇదే స్థితి వుంది. అప్పట్లో అది –1.7 శాతంగా నమోదై అందరినీ కలవరపెట్టింది.

తాము అధికారంలోకొస్తే వృద్ధి రేటు మరింత పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుం టామని, సమ్మిళితవృద్ధి సాధిస్తామని బీజేపీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే జరిగిందంతా అందుకు విరుద్ధం. ఆర్థికరంగం ఎదుర్కొంటున్న కష్టాలు ఒక్క మన దేశానికే పరిమితం కాదన్నది నిజమే. ప్రపంచమంతటా కొంత హెచ్చుతగ్గులతో అదే స్థితివుంది. కానీ 2016లో చలామణిలోవున్న కరెన్సీలో 86 శాతం వాటావున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పర్యవసానంగా ఆ కష్టాలు మన దేశానికి మరింత ఎక్కువయ్యాయన్నది వాస్తవం. ఆ నిర్ణయం తర్వాత చిన్నతరహా పరిశ్రమలు పెద్దయెత్తున మూతబడ్డాయి. లక్షలమంది కార్మికుల ఉపాధి దెబ్బతింది. ఆ త్రైమాసికంలో సైతం మన జీడీపీ 7 శాతంగా నమోదైంది. కానీ ఉన్నకొద్దీ అది మరింత కుంగటం మొద లైంది.

ఇప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  గత ఆరేళ్లలో మౌలిక సదుపాయాల రంగంపై మొత్తం రూ. 51 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అంటే సగటున ఏటా 8.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్టు లెక్క. తాజాగా వచ్చే అయిదేళ్లలో రూ. 102 లక్షల కోట్లు వ్యయం చేస్తామని ఆమె ప్రకటించారు. అంటే ఏడాదికి సగటున 20 లక్షల కోట్లకు మించి వ్యయం చేయాల్సివుంటుంది. రూ. 8.5 లక్షల కోట్ల నుంచి ఒక్కసారిగా ఈ స్థాయికి ఎగబాకటం సిద్ధపడటం సాధ్యమేనా? ఇందులో కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు రంగం కూడా వుంటాయని చెప్పడం బాగానే వున్నా ఒకేసారి రూ. 20 లక్షల కోట్ల మేరకు పెంచడం కుదు రుతుందా? ఆ మేరకు ఆదాయ వనరులు పెరగాలంటే అందుకు తగ్గ అవకాశాలున్నాయా? ఒక పక్క ఆర్థిక మాంద్యం పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆదాయ వనరుల్ని ఎక్కడనుంచి పెంచుకోవాలి? వాటి సంగతలావుంచి వేర్వేరు ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం వార్షిక వ్యయం...కేంద్ర ప్రభుత్వం వాటాతో పోలిస్తే చాలా ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సగటున రూ. 3.3 లక్షల కోట్లు వ్యయం చేస్తుంటే కేంద్రం చేసేది రూ. 2.38 లక్షల కోట్లు. తాజా నిర్ణయం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు చెరో 39 శాతం మేర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యయం చేయాలంటే ఇప్పుడు పెడుతున్న వ్యయాన్ని అవి ఎన్ని రెట్లు పెంచుకోవాలో సులభంగానే బోధపడుతుంది. ఆ స్థాయిలో నిధుల సమీకరణ సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్న. ఇక ఈ ప్రాజెక్టులకు ప్రైవేటు రంగం సంపూర్ణ సహకారం ఇవ్వదల్చుకుంటే అది 22 శాతం వ్యయం చేయాల్సివుంటుంది.

వ్యాపారవేత్తలెవరైనా తమకు లాభాలొచ్చే అవకాశం వుందా లేదా అనేది గీటురాయిగా తీసుకుంటారు తప్ప, ప్రభుత్వం కోరిందన్న కారణంతో పెట్టుబడులు పెట్టలేరు. ప్రజల వినిమయం పెరుగుతుందన్న విశ్వాసం వున్నప్పుడే, తమ ఉత్పత్తులు అమ్ముడవుతాయన్న నమ్మకం కుదిరినప్పుడే వారు ఉత్సాహంగా మదుపు చేస్తారు. అంతేకాదు... ఏ దేశంలోనైనా రాజకీయ సుస్థిరత వున్నప్పుడు, సామాజికంగా శాంతియుత వాతావరణం నెలకొన్నప్పుడు, ప్రభుత్వాలు ఆర్థిక రంగానికి సంబంధించి సాహసోపేతమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంసిద్ధంగా వున్నప్పుడు మాత్రమే పెట్టుబడులు పుష్కలంగా వస్తాయి. ఇప్పుడు మౌలిక సదు పాయాల రంగంలో భారీయెత్తున పెట్టుబడులు పెట్టడానికి చేసిన పథక రచన విజయవంతంగా అమలు కావాలంటే ఇతరత్రా అంశాలన్నీ పటిష్టంగా వుండాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటున్నదన్న విశ్వాసం అందరిలోనూ కలగాలి. అది ఏమేరకు ఏర్పడుతుందో చూడాల్సివుంది.

మరిన్ని వార్తలు