నరేంద్ర మోదీ రాయని డైరీ

4 Oct, 2015 00:01 IST|Sakshi
నరేంద్ర మోదీ రాయని డైరీ

నిన్న రాత్రి డైరీ రాస్తుంటే అమిత్ భాయ్ వచ్చి కూర్చున్నాడు. ఎంతకీ కదలడు. ఏమీ మాట్లాడడు. చూపుడు వేలు, మధ్యవేలు కలిపి నోటికి ఆన్చుకుని, కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ ఉన్నాడు. నేనూ చూసి చూసి, డైరీ మూసి.. ‘చాయ్ తెప్పించనా’ అని అడిగాను. వద్దనలేదు. కావాలనలేదు. కామ్‌గా ఉండిపోయాడు.

ఇంకేదో అడిగాను. నో ఎక్స్‌ప్రెషన్! నోరు తెరిచి, పెద్దగా సౌండ్ చేస్తూ రాని ఆవలింత కూడా ఒకటి ఆవలించాను. తనూ ఆవలించాడు కానీ వెళ్లిపోతానని మాత్రం పైకి లేవలేదు! డైరీ రాస్తున్నప్పుడు మధ్య మధ్యలో మంచి మంచి పంచ్‌లైన్లు పడుతుంటాయి. అవెక్కడ మర్చిపోతానోనని నా భయం.

మొన్నరాత్రి ఇలాగే డైరీ రాస్తుంటే గొప్ప పంచ్ పడింది. నోట్ చేసుకుని మర్నాడు బిహార్ ర్యాలీలో ప్రయోగించాను.  చప్పట్లే చప్పట్లు. నితీశ్‌కి, లాలూకీ చెమటలు పట్టి ఉండాలి. బిహార్‌లో ఇంకా పది ర్యాలీలు ఉన్నాయి. ర్యాలీకో పంచ్ పడినా చాలు... మహా కూటమి మహా ఓటమి అవుతుంది. అరె! మళ్లీ పంచ్ పడింది!

రోజూ రాత్రి ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. నిన్న అమిత్ భాయ్ వల్ల డైరీ ఆగిపోతే, మొన్న జైట్లీజీ వల్ల డైరీ ఆగిపోయింది. అందుకే ముందు రోజు డైరీని మర్నాడు ఉదయం రాయవలసి వస్తోంది.

ఈరోజు రాత్రి కూడా డైరీ రాయడం కుదరకపోవచ్చు. సాయంత్రం జర్మనీ నుంచి మిస్ మెర్కెల్ వస్తున్నారు. ఆవిణ్ణి రిసీవ్ చేసుకోవాలి. ఆవిడతో కలిసి ఫొటోలు దిగాలి. ఈసారి నోబెల్ పీస్ ఆవిడకే రావచ్చంటున్నారు కాబట్టి రెండుమూడు ఎక్స్‌ట్రా పోజ్‌లు కూడా తీసుకోవాలి. మెర్కెల్ ఇప్పటికే మేక్ ఇన్ ఇండియాకి, స్కిల్ ఇండియాకి, క్లీన్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ‘హగ్ ఇండియా’ అని ఒక కాన్సెప్ట్ పెట్టి ఆమె చేత లాంచ్ చేయిస్తే ఎలా ఉంటుంది?! ఆవిడ హగ్ ఇవ్వకపోయినా పర్వాలేదు... హగ్‌కి సపోర్ట్ ఇస్తే చాలు.

‘మనం కాన్సెప్టులు తగ్గించి,  కొంతకాలం కామ్‌గా పనిచేసుకుపోవాలేమో మోదీజీ’ అంటాడు అమిత్ భాయ్. ఆ మాట చెప్పడానికే రాత్రి అతడు వచ్చింది. ‘మాటకు ఒకటే అర్థం ఉంటుంది మోదీజీ. మౌనానికి అనేక అర్థాలుంటాయి. శాన్‌జోస్‌లో చూశారు కదా. అక్కడ మీరు మాట్లాడిన మాటల మీద కన్నా, మాటల మధ్య మీరిచ్చిన పాజ్‌ల మీదే ఎక్కువ డిబేట్ నడుస్తోంది. దాన్ని నడవనివ్వాలి’ అన్నాడు అమిత్ భాయ్. జైట్లీజీ పూర్తిగా విరుద్ధం. టాకెటివ్‌గా లేకపోతే రాహుల్‌కి మనకు పెద్ద తేడా ఉండదు అంటాడు. మాటా? మౌనమా? ఏది కరెక్ట్? వెంకయ్యనాయుడిని అడగాలి. ఎప్పుడు ఏది వర్కవుట్ అవుతుందో ఆయనకు బాగా తెలుసు.

- మాధవ్ శింగరాజు

మరిన్ని వార్తలు