‘అరచేతి’ని అడ్డుపెట్టి..

10 Dec, 2015 05:55 IST|Sakshi
‘అరచేతి’ని అడ్డుపెట్టి..

పార్లమెంటు సజావుగా సాగడం కోసం పాత తగువుల్ని పరిష్కరించుకుంటూ వస్తున్న ఎన్‌డీఏ సర్కారుకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా ‘నేషనల్ హెరాల్డ్’ వివాదం పార్లమెంటును కుదిపేస్తున్నది. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు పర్యవసానంగా ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ సహా ఆరుగురికి కింది కోర్టు నిరుడు జూన్‌లో సమన్లు జారీచేసింది. సమన్ల రద్దుపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చి కింది కోర్టులో హాజరై వాదనలు వినిపించాల్సిందేనని మంగళవారం తీర్పునిచ్చాక  కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ దాడి మొదలుపెట్టింది. అందులో భాగంగా వరసగా రెండు రోజులు పార్లమెంటు ఉభయసభలూ స్తంభించిపోయాయి.

‘నేను ఇందిరాగాంధీ కోడల్ని. ఎవరికీ, దేనికీ భయపడన’ని సమావేశాల ప్రారంభానికి ముందు సోనియాగాంధీ ప్రకటించి యుద్ధభేరి మోగించారు. ఇందులోని సందేశాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలిచ్చారు. ఈ నిరసన ఎందుకో చెప్పాలంటూ అధ్యక్ష స్థానాల్లో ఉన్నవారు అడిగినా అటువైపు నుంచి జవాబు లేదు.  

‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక చరిత్ర ఉన్నతమైనది. జవహర్‌లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించిన ఈ పత్రిక కొన్నాళ్లకే కాంగ్రెస్‌కు అధికార పత్రిక అయింది. సంపాదకీయ వ్యాఖ్యలు రాయడం మొదలుకొని విలేకరి వరకూ నెహ్రూ చాలా బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన ఆ పత్రిక స్వాతంత్య్రానంతరం కూడా తన సొంత గొంతును కాపాడుకుంది. ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేనప్పుడు విమర్శించడానికి అది వెనకాడలేదు. అనేకసార్లు మూతపడుతూ, తిరిగి ప్రారంభమవుతూ ఆ పత్రిక సాగించిన ప్రయాణం చివరకు 2008లో ఆగిపోయింది.

ఆ పత్రిక ప్రచురణకర్తలైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) అధీనంలో రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లించాల్సిన అప్పు రూ. 90 కోట్ల వరకూ ఉంది. ఈ అప్పు తీర్చడం కోసం అనుసరించిన విధానమే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. రూ. 50 లక్షల పెట్టుబడితో 2010లో పుట్టుకొచ్చిన యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్)లో సోనియా, రాహుల్‌గాంధీలకు 76 శాతం వాటా ఉండటం...తన అప్పు వసూలు చేసే బాధ్యతను కాంగ్రెస్ ఆ సంస్థకు కట్టబెట్టడం...ఆ పేరిట ఏజేఎల్‌లోని 99 శాతం వాటా వైఐఎల్‌కు వెళ్లడంలాంటి పరిణామాలు ఎవరికైనా అనుమానాలు కలిగిస్తాయి.

ఎందుకంటే ఈ మొత్తం లావాదేవీల్లో రూ. 90 కోట్ల అప్పు తీర్చే పేరుమీద రూ. 2,000 కోట్ల ఆస్తులు వైఐఎల్‌కు బదిలీ అయ్యాయి. ‘అందరికీ శాస్త్రం చెప్పే బల్లి’ తీరున గాంధీ కుటుంబం ఇంత అనుమానాస్పద రీతిలో వ్యవహారాన్ని ఎందుకు నడిపినట్టు? నెహ్రూ అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలతో ఆ పత్రికను పునఃప్రారంభించడం కోసమే ఇదంతా చేస్తున్నారు కాబోలని మొదట్లో చాలామంది భావించారు. సుమన్ దూబే వంటి సీనియర్ పాత్రికేయుడు ఇందులో భాగస్వామి కావడం వారికా అభిప్రాయాన్ని కలిగించింది. కానీ అలాంటిదేమీ లేదని రాహుల్‌గాంధీ 2011లోనే చెప్పేశారు. మరి ఎవరిని ఉద్ధరించడానికి...ఏ ప్రయోజనాలు సాధించడానికి ఇదంతా సాగించినట్టు? ఈ ప్రశ్నలకు ఇంతవరకూ జవాబు లేదు.

ఎవరిపైన ఆరోపణలు చేయడానికైనా, ఫిర్యాదులు దాఖలు చేయడానికైనా వెనకాడని సుబ్రహ్మణ్యస్వామి ఇంత అనుమానాస్పద వ్యవహారాన్ని చూసీచూడనట్టు వదిలేస్తారని అనుకోలేం. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఆయన ఎవరో చెబితే కేసులు పెట్టే రకం కూడా కాదు. అయితే కొన్ని ‘సాంకేతిక కారణాలు’ చూపి ఈ కేసును మూసేయాలని మొన్న ఆగస్టులో  నిర్ణయించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) నెలరోజుల్లోనే మనసు మార్చుకుని దీన్ని ఎందుకు తిరగదోడింది? సంస్థకు కొత్త డెరైక్టర్ రావడానికీ... పాత నిర్ణయం మారడానికీ సంబంధం ఉందా? ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ అనుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే సీబీఐలో అయినా, ఈడీలో అయినా వ్యవహారాలు ఎలా కదులుతాయో అందరికన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ తెలుసు.

పదేళ్లు అధికారం చలాయించినప్పుడు ఆ సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలోనూ, ఇబ్బందులకు గురిచేయడంలోనూ ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన అపకీర్తి తక్కువేమీ కాదు. వేధింపుల్లో ఇంత అనుభవం గడించిన నేతలు ఇప్పుడు తమదాకా వచ్చేసరికి భూమ్యాకాశాలు ఏకం చేయడమెందుకో ఆ పార్టీ సంజాయిషీ ఇవ్వాలి. పార్లమెంటును ప్రశ్నించే వేదికగా ఉపయోగించుకోకుండా స్తంభింపజేయడం ఎందుకో దేశ ప్రజలకు వివరించాలి.

పార్లమెంటు వెలుపల రాహుల్‌గాంధీ మాట్లాడిన సందర్భంలో కేంద్రం న్యాయవ్యవస్థను బెదిరిస్తున్నదని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణను కాస్త వివరిస్తే, అలా అనడంలోని ఉద్దేశాన్ని చెబితే జనం సంతోషిస్తారు. కేసు ప్రస్తుతానికి న్యాయస్థానం పరిశీలనలో ఉంది. నిందితుల్లో నేర ఉద్దేశం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని న్యాయమూర్తి భావించారు. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయంలో తమ వాదనను వినిపించాల్సిన వేదిక న్యాయస్థానం.

ఈ కేసులో దురుద్దేశాలో, గూడార్థాలో ఉన్నాయనుకుంటే పార్లమెంటు లోపలా, వెలుపలా కూడా వాటిని దేశ ప్రజలకు వివరించవచ్చు. తమ నిర్దోషిత్వాన్ని లోకానికి చాటవచ్చు. సభలో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అంతేతప్ప పార్లమెంటును స్తంభింపజేయడం, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలు మరుగున పడేలా విలువైన సమయాన్ని వృథాపుచ్చడంవంటివి ఆ పార్టీ ప్రతిష్టను పెంచవు.

మరిన్ని వార్తలు