ఉపాధికి ఎసరుతెచ్చే పథకం!

3 Nov, 2014 01:49 IST|Sakshi

పల్లెసీమల్లో కోట్లాదిమంది నిరుద్యోగ నిరుపేద కూలీలకు పట్టెడన్నం పెట్టడంతో పాటు శాశ్వత ప్రయోజనకర ఆస్తుల్ని నిర్మించడం కోసమంటూ తొమ్మిదేళ్లక్రితం అమల్లోకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఏ)అటకెక్కే ఛాయలు కనిపిస్తున్నాయి. పనిచేసే హక్కునూ, జీవనభద్రతనూ కలగజేసే ఉద్దేశంతో 2006లో ఈ పథకానికి పురుడు పోసి, చట్టబద్ధతనుకూడా కల్పించిన యూపీఏ సర్కారే... క్రమేపీ దాని ఊపిరి తీసే ప్రయత్నం చేయగా, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఆ బాటలోనే వెళ్లదల్చుకున్నట్టు స్పష్టమవుతున్నది.

దేశవ్యాప్తంగా ఇప్పుడు 650 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని ఇకపై వెనకబడిన 200 జిల్లాలకే పరిమితం చేసేందుకు పథకరచన సిద్ధమైందన్న కథనాలు ఇటీవలికాలంలో వెలువ డుతున్నాయి. దానికితోడు వేతనం, ఆస్తుల నిర్మాణ సామగ్రి నిష్పత్తిని ఇప్పుడున్న 60:40నుంచి 51:49కి మార్చదల్చుకున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి ఆలోచన మంచిదికాదని...పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చేయ త్నాలు చేయడంవల్ల పల్లెసీమలు మళ్లీ ఆకలితో నకనకలాడతాయని ప్రముఖ ఆర్థిక వేత్తలు కేంద్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో ఇప్పటికే హెచ్చరించారు.

ఉపాథి హామీ పథకం సాధించిన విజయాలు సామాన్యమైనవి కాదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఏడాదికి వంద రోజులపాటు ఉపాధిని పొందగ లిగారు. ఉన్న ఊరునూ, అయినవారినీ విడిచిపెట్టి పొట్టచేతబట్టుకుని ఎక్కడె క్కడికో వలసపోవలసివచ్చే దిక్కుమాలిన రోజులుపోయి ఉన్నచోటనే వారికి పని దొరికింది. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించింది. కరువు రోజుల్లో, పనులే లేని సీజన్‌లో ఆసరాగా నిలిచింది. లబ్ధిదారుల్లో సగంకంటే ఎక్కువమంది దళిత కులాలకు చెందినవారుగనుక ఆ వర్గాలకు ఎంతో ప్రయోజ నకరంగా మారింది. పథకం అమలు మొదలయ్యాక శ్రామికులకు డిమాండు పెరిగి బయటి పనుల్లో వారి వేతనాలు రెట్టింపయ్యాయి.

రోజుకు రూ. 120 వచ్చేచోట రూ. 250 వరకూ రావడం మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి అమలుచేసిన సామాజిక భద్రతా పథకమని ఎందరో కీర్తించారు. ప్రపంచబ్యాంకు సైతం దీన్ని మెచ్చుకుంది. పథకానికయ్యే వ్యయంలో కేంద్రానిది 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతంకాగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఈ పథకం వాటా 0.3 శాతం. అయితేనేం ఇది ఏటా 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా మూడు నెలలపాటు భరోసా కల్పించింది. శ్రమదోపిడీనుంచి వారిని కాపాడింది. పథకం కింద చేసే పనుల్లో వేతనాల వాటా ఖచ్చితంగా 60 శాతం ఉండాలన్న నిబంధనవల్ల శ్రామికులకుఎంతగానో మేలు కలిగింది. బెంగళూరు ఐఐఎం 2009లో అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ప్రభావంపై సర్వే చేసినప్పుడు అక్కడ వలసలు గణనీయంగా తగ్గాయని వెల్లడైంది.

గ్రామ సభల ద్వారా గుర్తించిన పనుల్ని చేపట్టడంలో, అవతవకలు జరిగినచోట రికవరీలు చేయడంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముందుందని సర్వే తేల్చింది. ఈ పథకంవల్లనే యూపీఏ 2009లో వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత యూపీఏ సర్కారు దీని పీకనొక్కడం మొదలుపెట్టింది. దరిదాపుల్లో ఎన్నికలు లేవుగదానన్న భరోసాతో కేటాయింపులను కత్తిరించడం ప్రారంభించింది. బకాయిల చెల్లింపులో అలవిమాలిన జాప్యమూ మొదలైంది.

2013-14 ఆర్థిక సంవత్సరంలో పేద జనానికి ప్రభుత్వం రూ. 4,800 కోట్లు బకాయిపడిందని ఎన్‌ఆర్‌ఈజీఏ వెబ్‌సైట్ చెబుతున్నదంటే పరిస్థితి ఎక్కడికొచ్చిందో సులభంగానే అర్థమవుతుంది. అంతేగాదు...ఈ ఎనిమిదేళ్లలోనూ ఆ పథకానికి రూ. 33,000 కోట్ల మేర కేటాయింపులు తగ్గిపోయాయి. బకాయి పడితే శ్రామికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్న చట్ట నిబంధన తర్వాత కాలంలో ఎగిరిపోయింది. పనుల్లో యంత్రాల వినియోగం పెంచి శ్రామికుల పొట్టగొట్టడం మొదలైంది.

మరోపక్క అనేక రాష్ట్రాల్లో భారీయెత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. బినామీ కాంట్రాక్టర్లు వెలిశారు. చేపడుతున్న పనులేమిటో, అవి ఎంతవరకూ అవసరమో పర్యవేక్షించే యంత్రాంగం కుంటుబడింది. దీనికి కేటాయించిన నిధుల్ని కొన్ని ప్రభుత్వాలు దారిమళ్లించాయి. ఈ ఎనిమిదేళ్లలో పథకంపై వ్యయమైన రూ. 2.60 లక్షల కోట్లుకు దీటుగా సామాజిక ఆస్తుల సృష్టి జరిగిందా అన్న సందేహాలున్నాయి. కోట్ల రూపాయలు వ్యయమయ్యే పథకంలో అవినీతిపరులు ప్రవేశించడం, నిధులు స్వాహా చేయాలని చూడటం మామూలే.

పథకం అమలులో తగినంత జవాబుదారీతనం, పారదర్శకత ప్రవేశపెడితే ఇలాంటివి చోటుచేసుకునే అవకాశం ఉండదు. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా అనుత్పాదక పనులు చేపట్టిన పక్షంలో గట్టి చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరిస్తే మంచిదే. వ్యవసాయ పనులకు దాన్ని అనుసంధానించడం ఎలాగో ఆలోచించవచ్చు. సామాజిక ఆడిట్‌ను మరింత పకడ్బందీగా అమలుచేయొచ్చు. ఇంకేమి సంస్కరణలు చేస్తే అది మరింతగా మెరుగుపడుతుందో చర్చించవచ్చు. కానీ, ఎలుకలు జొరబడ్డాయని కొంపకు నిప్పెట్టుకున్నట్టు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చి మూలనపడేయాలని చూస్తున్నట్టు కనబడుతున్నది.

అసలు దీన్ని చట్టంగా చేయడమేమిటి, పథకంగా ఉంచితే నష్టమేమిటని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ప్రశ్నించారు. పథకం మొదలైననాటినుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాబల్య వర్గాలు సణుగుతూనే ఉన్నాయి. కేంద్రం ఆలోచనలు అలాంటి వర్గాల ప్రయోజనాలను నెరవేర్చేలా ఉన్నాయి. ఉపాధి హామీ పథకం చట్టరూపంలో ఉన్నది గనుక పార్లమెంటులో చర్చ తర్వాతే దానికి సవరణలు సాధ్యమవుతాయి. పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చడం చేయక దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడమెలాగో ప్రభుత్వం ఆలోచించాలి.

మరిన్ని వార్తలు