‘భూసేకరణ’పై కొత్త ఎత్తు

18 Jul, 2015 01:12 IST|Sakshi
‘భూసేకరణ’పై కొత్త ఎత్తు

ఉత్సాహం ఉండటంలో తప్పులేదుగానీ...అలా ఉత్సాహపడేవారికి దాని ప్రయోజనం, పరమార్థం విషయంలో స్పష్టత ఉండాలి. వాటిని సాధించడానికి అవసరమైన సాధనాసంపత్తులు తమకున్నాయో లేదో అవగాహన ఉండాలి. కేంద్రంలో అధికారంలోకొచ్చిన వెంటనే ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ చట్టంపై దృష్టి సారించింది. ఎక్కడలేని చురుకుదనాన్నీ ప్రదర్శించి దానికి సవరణలు చేయ డానికి పూనుకున్నది. నిరుడు డిసెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం దీనిపై చర్చించి ఆర్డినెన్స్ జారీచేసింది. కాలపరిమితి ముగిసిన రెండు సందర్భాల్లోనూ ఆర్డినెన్స్‌కు ప్రాణప్రతిష్ట చేసింది.

ఈమధ్యలో ఒకసారి లోక్‌సభలో ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కూడా పొందారు. రాజ్యసభలో సహ జంగా విపక్షానిదే మెజా రిటీ గనుక ఆ ప్రయత్నం అక్కడ వీగిపోయింది. ఆ బిల్లు ప్రస్తుతం సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. ఈలోగా కేంద్రం స్వరం మార్చింది. అభివృద్ధిలో దూసుకుపోద ల్చుకున్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా  ప్రస్తుత భూ సేకరణ చట్టం స్థానంలో మెరుగైన చట్టాన్ని తీసుకురాదల్చుకుంటే అందుకు తాము సహకరిస్తామని ప్రకటించింది. విపక్షాలనుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చినా వెనక్కి తగ్గకుండా  ఆర్డినెన్స్‌ల మీద ఆర్డినెన్స్‌లు జారీచేసిన ఎన్డీయే సర్కారు... ఇప్పుడు మధ్యలో కాడి పారేసి ‘మీలో ఎవరైనా చట్టాలు చేసుకుందామనుకుంటే చేసుకోండ’ని రాష్ట్రాలకు సూచిస్తున్నది. బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించడంలో విఫలమైతే ఇది తప్ప ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. అలాగని చాలామంది నుంచి సూచనలొస్తున్నాయని అంటున్నారు.

సాధారణంగా ఏ చట్టంపైన అయినా అభ్యంతరాలొచ్చినప్పుడూ, దాని అమలుకు ఆటంకాలెదురవుతున్నప్పుడూ, అది ఆశించిన ప్రయోజనాన్ని నెరవే ర్చడం లేదని రుజువవుతున్నప్పుడూ దాన్ని సవరించాలని ఏ ప్రభుత్వమైనా భావి స్తుంది. భూసేకరణ చట్టానికి అలాంటి అభ్యంతరాలో, ఆటంకాలో ఎదురైన దాఖ లాలు లేవు. దాని కారణంగా ఏ ప్రాజెక్టు అయినా ఆగిపోయినట్టు లేదా మొద లెట్టిన ప్రాజెక్టు నత్తనడకన సాగినట్టు ఎవరూ చెప్పలేదు. అసలు ఎన్డీయే ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఆర్నెల్లముందు యూపీఏ హయాంలో ఆ చట్టం వచ్చింది. ఎన్డీయే వచ్చాక ఆ చట్టంకింద భూసేకరణ చేసింది లేదు. ఆచరణకే రాని చట్టం గురించి ఫిర్యాదులుండటానికీ ఆస్కారం లేదు.

పారిశ్రామికాభివృద్ధికి ఈ చట్టం ఆటంకంగా మారిందని కేంద్రం అనడమే తప్ప దాన్ని సమర్థించే ఉదంతాలను చూపలేదు. మరి ఎందుకని ఆర్డినెన్స్ జారీలో అత్యుత్సాహం చూపినట్టు? పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు(పీపీపీ), రక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి అవసరాలకు భూములు సేకరించే సందర్భంలో భూ యజమానుల అనుమతి అవసరం లేదని ఆర్డినెన్స్‌లో ఎందుకు పేర్కొన్నట్టు? ఆయా ప్రాజెక్టుల సామాజిక ప్రభావ అంచనా(ఎన్‌ఐఏ) నిబంధనను ఎందుకు తొలగించినట్టు? ఎవరు అడిగారని ఈ సవరణలకు పూనుకున్నారు?

ఈ ఆర్డినెన్స్‌ల వ్యవహారాన్ని కాంగ్రెస్, వామపక్షాలు, మరికొన్ని ఇతర పార్టీలు మాత్రమే కాదు...ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్, పీడీపీ కూడా వ్యతిరేకిం చాయి. స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్‌వంటి సంఘ్ పరివార్ సంస్థలు సైతం ఆర్డినెన్స్ నిబంధనలు రైతు వ్యతిరేకమైనవని ఆరోపించాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయాలనూ తెలుసుకుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ అవసరమైందో వివరిస్తుంది. తన ప్రతిపాదనల్లోని లోపాలను పరిహరించడానికి సిద్ధపడుతుంది. కానీ ఏ దశలోనూ ఇలాంటి ప్రయత్నం జరగలేదు. లోక్‌సభలో బిల్లుపై చర్చ జరిగిన మాట వాస్తవమే అయినా చివరకు అధికార పక్షానికున్న సంఖ్యాబలమే దాన్ని గెలిపించింది. రాజ్యసభలో గెలవడం అసాధ్యమైన ఈ పరిస్థితుల్లో ఇతరత్రా వేదికలపై భూసేకరణ ఆర్డినెన్స్ గురించి చర్చించాలని కేంద్రం నిర్ణయించింది.

అందులో భాగంగానే మొన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ‘సహకార ఫెడరలిజం’లో భాగంగానే ఈ చర్చకు చోటిస్తున్నట్టు కేంద్రం చెప్పడం బాగానే ఉన్నా... వరసబెట్టి మూడుసార్లు ఆర్డినెన్స్ జారీచేసినప్పుడు అది ఎందుకు గుర్తుకురాలేదో వివరించలేదు. నిజానికి బీజేపీ వ్యవహరించిన ఇలాంటి తీరువల్లే కాంగ్రెస్‌కు ఎక్కడలేని బలమూ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 స్థానాలు మాత్రమే గెల్చుకుని ఎటూ పాలుబోని స్థితిలో పడిన ఆ పార్టీ చేతికి ఆయుధాన్నందించి దాన్ని నిత్యమూ వార్తల్లో ఉండేలా చేసిన ఘనత ఎన్డీయే సర్కారుకు దక్కుతుంది.

నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలంతా బహిష్కరించి పార్టీ రైతుల పక్షాన ఉన్నదని ప్రకటించడానికి దాన్నొక సందర్భంగా ఎంచుకున్నారు. భూసేకరణ చట్ట సవరణ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేస్తున్న సవాళ్లకు బీజేపీ నేతల వద్ద జవాబు లేదు. 56 అంగుళాల ఛాతి ఆర్నెల్లు తిరిగేసరికల్లా 5.6 అంగుళాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేస్తుంటే బీజేపీ ఆత్మరక్షణలో పడిన స్థితికి చేరుకుంది. లోక్‌సభలో 282 స్థానాలున్న పాలక పార్టీ కీలకమైన బీహార్ ఎన్నికల ముందు ఇలా బలహీనంగా కనబడటం మంచిది కాదని ఆ పార్టీ నేతలకే అనిపిస్తున్నది. అందువల్లే ఈ సవరణ బిల్లు సంగతిని పూర్తిగా పక్కనబెట్టి రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చునని జైట్లీ చెబుతున్నారు. సవ రణ బిల్లు ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంటు సంయుక్త సమావేశానికి సిద్ధమని దూకుడు ప్రదర్శించినవారు  ఇప్పుడిలా స్వరం మార్చడం వింతగొలుపుతుంది.

అయితే జైట్లీ ప్రతిపాదన చిక్కులతో కూడుకున్నది. భూ సేకరణ అంశం ఉమ్మడి జాబితాలోనిదే అయినా... ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర చట్టానికి విరుద్ధంగా రాష్ట్రాలు చట్టం చేయడం ఆచరణ సాధ్యమేనా? న్యాయస్థానాల్లో అవి నిలబడతాయా? భూసేకరణ చట్టం విషయంలో ఇన్నాళ్లూ అనుసరించిన వైఖరి సరైంది కాదనుకుంటే ఆ సంగతిని బహిరంగంగా ప్రకటించాలి. బీహార్ ఎన్నికల్లో నష్టపోతామన్న భయంతో ఇలాంటి ఎత్తులకు దిగడమంటే నైతికంగా బలహీనం కావడమేనని బీజేపీ తెలుసుకోవాలి. ఈ మాదిరి ఎత్తుగడలే కాంగ్రెస్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించాయని గ్రహించాలి.

>
మరిన్ని వార్తలు