ప్రచండ కొత్త అడుగులు

17 Sep, 2016 01:17 IST|Sakshi
ప్రచండ కొత్త అడుగులు

నేపాల్ నూతన ప్రధాని పుష్ప కమల్ దహల్(ప్రచండ) తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని నాలుగురోజుల పర్యటన కోసం గురువారం వచ్చారు. మనపట్ల నేపాల్ దృక్పథంలోనూ, ప్రత్యేకించి ప్రచండ అవగాహనలోనూ వచ్చిన మార్పును ఇది సూచిస్తుంది. భూకంపంతో దెబ్బతిన్న నేపాల్ పునర్నిర్మాణానికి మన దేశం 75 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న నిర్ణయంతోపాటు పలు కీలక ఒప్పందాలపై రెండు దేశాలూ శుక్రవారం సంతకాలు చేశాయి. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో సాన్నిహిత్యమున్న భారత్-నేపాల్ మధ్య ఇటీవలికాలంలో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ప్రచండకు ముందు 9 నెలల పాటు ప్రధానిగా ఉన్న ఖడ్గప్రసాద్ ఓలీ హయాంలో ఇవి ఎన్నడూలేని స్థాయికి దిగజారాయి.

తనపట్ల కొన్ని ‘విదేశీ శక్తులు’  ఏర్పర్చుకున్న అయిష్టత కారణంగానే పదవి కోల్పోయానని రాజీనామా చేసినప్పుడు పరోక్షంగా భారత్‌నుద్దేశించి ఓలీ ఆరోపించారు. నూతన రాజ్యాంగంపై మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి, వారి అభీష్టానికి అనుగుణంగా మార్పులు చేయాలని మన దేశం నేపాల్‌కు సూచించింది. ఈ సవరణలు జరిగాకే కొత్త రాజ్యాంగం అమలు కావాలని కూడా సలహా ఇచ్చింది. అయితే నేపాల్ దీన్ని పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత మైనారిటీ జాతుల ఉద్యమం ఉధృత మైంది. ఆందోళనకారులు సరిహద్దుల్లోని రహదార్లు దిగ్బంధించడం వల్ల నేపాల్‌కు ఇక్కడినుంచి వెళ్లే సరుకు రవాణా, ఇంధనం తదితర నిత్యావసరాలన్నీ నిలిచి పోయాయి. సాధారణ ప్రజానీకం చెప్పనలవికాని పాట్లుబడ్డారు. ఈ ఉద్యమం వెనక భారత్ హస్తమున్నదని నేపాల్ నాయకులు ఆరోపించారు. దీన్నుంచి బయట పడటం కోసం తన సరిహద్దుకు ఆవలివైపునున్న చైనాను ఆ దేశం ఆశ్రయించింది.

సహజంగానే ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకోవడానికి చైనా ప్రయత్నిం చింది. మైనారిటీ జాతుల ఆందోళన సమయంలో నేపాల్‌తో రవాణా బంధాన్ని ఏర్పరుచుకోవడమే కాదు... ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఒప్పం దం కుదుర్చుకుంది. చైనా ఓడరేవులను నేపాల్ వినియోగించుకునేందుకు, ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి, రహదారి నిర్మాణం చేప ట్టడానికి అంగీకారం కుదిరింది. ఈ విషయంలో ఒప్పందాలు ఖరారు చేసుకు నేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేపాల్ సందర్శించాలని కూడా అనుకు న్నారు. ఈలోగానే నేపాల్  రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడింది. ఓలీకి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఆ తీర్మానం ఎటూ ఆమోదం పొందక తప్పదని గ్రహించిన ఓలీ చర్చకు ముందే రాజీనామా చేశారు.
 
ఈ పరిణామాలన్నిటితో చైనా విస్తుపోయింది. ఓలీ అనంతరం ఆ పదవి లోకొచ్చిన ప్రచండ తొలి పర్యటనకు మన దేశాన్ని ఎంచుకోవడం దాన్ని మరింత కుంగదీసింది. ఫలితంగా జిన్‌పింగ్ వచ్చే నెలలో జరపాలనుకున్న నేపాల్ పర్యటన రద్దయిందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే అవి నిజం కాదని చెప్పినా ఇంతవరకూ ఆయన పర్యటన తేదీలైతే ఖరారు కాలేదు. మైనారిటీ జాతుల ఉద్యమంలో తన పాత్రేమీ లేదని, ఆ ఉద్యమ ప్రభావం పొరుగునున్న మన భూభా గంలోని ప్రాంతాలపై పడుతున్నందువల్లే వాటిని పరిష్కరించుకోమని సలహా ఇచ్చామని మన దేశం చెబుతూ వచ్చింది.
 
ఏదేమైనా ఒకప్పుడు భారత్ అనుకూలుడిగా ముద్రపడిన ఓలీ హయాంలో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న మాట వాస్తవం. నిజానికి 2008-09 మధ్య తొమ్మిది నెలలపాటు ప్రధానిగా పనిచేసినప్పుడు ప్రచండ సైతం చైనా వైపే మొగ్గు చూపారు. అప్పట్లో తన తొలి విదేశీ పర్యటనకు ఆయన చైనానే ఎంచు కున్నారు. ఆ దేశం కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉండటం, ప్రచండ మావోయిస్టు రాజకీయ నేపథ్యం ఇందుకు కారణం. పైగా భారత్ తమ దేశంపై పెద్దన్న తరహాలో పెత్తనం చేస్తున్నదన్న అభిప్రాయం నేపాల్ మావోయిస్టుల్లో బలంగా ఉండేది. తమను తీవ్రంగా అణిచేసిన రాజరికానికి మన దేశం గట్టి మద్దతుదారుగా నిలిచిందని వారు భావించేవారు. ముఖ్యంగా ఇరు దేశాలమధ్యా స్నేహసంబం దాలకు కీలక మలుపుగా భావించే 1950నాటి భారత్-నేపాల్ ఒప్పందం రద్దు కావాలని డిమాండ్ చేసేవారు. కానీ ఒక ఇంటర్వ్యూలో ప్రచండే చెప్పుకున్నట్టు ఈ ఏడెనిమిదేళ్లలో ‘ప్రధాన స్రవంతి’ రాజకీయాలు మావోయిస్టులకు బాగా వంట బట్టాయి.

దౌత్యరంగంలో మెలకువలు కూడా బాగా తెలిసొచ్చాయి. అందువల్లే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారత్, చైనాలు రెండింటికీ ‘సమాన ప్రతిపత్తి’ ఇస్తున్నట్టు కనబడటం కోసం రెండు దేశాలకూ ఉన్నత స్థాయి ప్రత్యేక దూతలను పంపారు. అయితే చైనాకు ఇది అంతగా రుచించినట్టు కనబడదు. ఇందువల్లే జిన్‌పింగ్ నేపాల్ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని దౌత్య నిపుణుల అంచనా. తాము చైనాకు దూరం కావాలనుకోవడం లేదని ప్రచండ దూతలు చెప్పినా ఓలీ హయాంలో కుదిరిన రవాణా ఒప్పందంలోగానీ, అప్పట్లో వచ్చిన ఇతర ప్రతిపాదనల విషయంలోగానీ ప్రచండ బాధ్యతలు స్వీకరించాక ఆశించినంత ప్రగతి కనబడలేదన్న అసంతృప్తి ఆ దేశానికుంది.
 
అంతమాత్రాన భారత్, నేపాల్ మధ్య వెనువెంటనే మునుపటి స్థాయిలో సంబంధాలు ఏర్పడతాయని చెప్పలేం. ఇటీవలికాలంలో ఇరు దేశాలమధ్యా అపో హలు తీవ్ర స్థాయికి చేరుకోవడమే ఇందుకు కారణం. నేపాలీ కాంగ్రెస్‌తో ప్రచండ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయన తొమ్మిదినెలలపాటు ప్రధాని పీఠంపై ఉంటారు. ఆ తర్వాత నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదూర్ దేవ్‌బా ఆ పదవిని స్వీకరిస్తారు. ఏదేమైనా చాన్నాళ్ల తర్వాత రెండు దేశాలూ దగ్గర కావడానికి చిత్త శుద్ధితో ప్రయత్నాలు ప్రారంభించాయి. మిగిలినవాటి మాటెలా ఉన్నా ప్రచండ తాజా పర్యటనతో రెండు దేశాలమధ్యా అలుముకున్న అపోహలు పటాపంచ లవుతాయని...అవి ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని ఆశించాలి.

మరిన్ని వార్తలు