ప్రయోగాలపై కొత్త చట్టం

6 Jul, 2015 00:23 IST|Sakshi

నిరుపేదల, నిరక్షరాస్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఔషధ ప్రయోగాలకు సంబంధించి ఎట్టకేలకు సమగ్రమైన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకురానున్నదన్న వార్త అనేకమందికి ఊరట కలిగిస్తుంది. ఈ ప్రయోగాల విష యంలో నిర్దిష్టమైన నిబంధనలు లేకపోవడంవల్ల ఆచరణలో ఎన్నో సమస్యలు తలె త్తుతున్నాయి. ప్రయోగాలు వికటించినప్పుడు ఫిర్యాదులొస్తే తప్ప అసలు అలాం టివి నిర్వహిస్తున్నారన్న సంగతి ప్రభుత్వాలకు తెలియడంలేదు. ఆ ప్రయోగాల్లో మరణాలు సంభవించినప్పుడు లేదా దుష్ఫలితాలు ఏర్పడినప్పుడు మీడియాలో వెల్లడవుతాయి. బ్రిటిష్ వలసపాలకుల కాలంలో రూపొందిన డ్రగ్స్ అండ్ కాస్మొ టిక్స్ చట్టం  నిబంధనలు ఔషధ ప్రయోగాలకు సహకరించడంలేదన్న ఉద్దేశంతో 2005లో దాన్ని సవరించారు.

ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మసీ సంస్థలు మన దేశంలో ప్రయోగాలకు క్యూ కట్టాయి. ఈ సవరణకు ముందూ తర్వాతా ఔషధ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు బేఖాతరవుతూనే ఉన్నాయి. మూడేళ్లక్రితం సుప్రీంకోర్టులో ఈ తరహా ఘటనలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయ్యాకగానీ ఇందులోని తీవ్రత బయటి ప్రపంచానికి అర్థం కాలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2005-12 మధ్య 475 ప్రయోగాల పర్యవ సానంగా 2,644మంది మరణించగా...11,972మందిలో తీవ్ర దుష్ర్పభావాలు కనబడ్డాయి. ఈ ఉదంతాలపై విచారణ జరిగాక అందులో 80 మరణాలు ఔషధ ప్రయోగాలకు సంబంధించినవని తేల్చారు. ఇక రోగులు తీవ్ర దుష్ర్పభావాలకు లోనైన కేసుల్లో దాదాపు 500 కేసులు ప్రయోగాలతో ముడిపడి ఉన్నాయని నిర్ధారిం చారు.

అయితే, ఈ కేసులన్నిటిలోనూ విచారణ సవ్యంగా సాగిందని చెప్పలేం. కేన్సర్‌కు దారితీసే హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) నివారణకు రూపొం దించిన వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడటం కోసం 2010లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లలో 24,777మంది యువతులను ఎంచుకున్నప్పుడు ఇలాంటి సమస్యే తలెత్తిం ది. వ్యాక్సిన్‌ను తీసుకున్నవారిలో ఏడుగురు యువతులు మరణించారని తెలియ గానే ఆపేశారు. అనంతరం ఔషధ నియంత్రణ జనరల్ మరికొన్న మార్గదర్శ కాలను జారీచేశారు. అయినప్పటికీ సమస్య ఎప్పటిలానే ఉండటంవల్ల, కేంద్రం నుంచి సరైన స్పందన లేని కారణంగా 2012లో పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టులో పిల్ దాఖలుచేశాయి.
ఒకపక్క సుప్రీంకోర్టులో విచారణ సాగుతుండగానే 2013-14 మధ్య మరో 370మంది ఔషధ ప్రయోగాల తర్వాత చనిపోయారు. ఇందులో 21 చావులు మాత్రమే ప్రయోగాలతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

కనుక ఆ కేసుల్లో మాత్రమే సవరించిన నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహా రం దక్కింది. చిత్రమేమంటే ప్రయోగాలు వికటించినప్పుడు బాధిత కుటుంబా లకు నామమాత్రంగా ఆయా ఔషధ సంస్థలతో పరిహారం ఇప్పించడం తప్ప ఆ సంస్థలపై చర్య తీసుకొనేందుకు అవసరమైన చట్ట నిబంధనలు లేవు. ఈ లోపాలు ఔషధ సంస్థలకు వరాలుగా మారాయి. అసలు ఔషధ ప్రయోగాలకు సంబంధిం చిన నిబంధనలే సరిగా లేవనుకుంటే...వాటి ప్రమేయంలేని ప్రయోగాలు కూడా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మరోపక్క ఆ నిబంధనల విషయంలో ఏం చెబుతా రని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు చాన్నాళ్లపాటు కేంద్రంనుంచి సరైన జవాబు లేదు. రాష్ట్రాలను అడిగి చెబుతామని అనడం తప్ప ఆ విషయంలో ఎలాంటి ప్రగతీ లేదు.

ఒక దశలో సుప్రీంకోర్టు తీవ్ర అసహసనం వ్యక్తంచేసి తానే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి దాని సిఫార్సుల ఆధారంగా కొన్ని మార్గదర్శకాలను రూపొం దించి కొత్త చట్టం వచ్చేవరకూ ఆ మార్గదర్శకాలే అమల్లో ఉంటాయని ప్రకటిం చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెం టరీ స్థాయీ సంఘం నిరుడు సమర్పించిన నివేదిక భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖల తీరుతెన్నుల్ని తీవ్రంగా తప్పుబట్టింది.
ఔషధ ప్రయోగాల వెనక ఓ పెద్ద వ్యాపారం ఉంది. దాదాపు రూ. 3,500 కోట్ల ఈ వ్యాపారం ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతుంటుందని అంచనా. ఇందులో ప్రయోగాలకు సిద్ధపడేవారికి నామమాత్రంగా దక్కుతుంది. ఆ ప్రయోగాల నిర్వహణ బాధ్యత తీసుకునేవారికీ, దళారులకూ అధిక భాగం వెళ్తుంది. ఇక్కడి జనాభాలో జన్యు వైవిధ్యం ఉన్నదని ఔషధ సంస్థలు చెప్పే మాట నిజమే కావొచ్చు గానీ... పర్యవేక్షణ సరిగా లేకపోవడం, నిరక్షరాస్యత, పేదరికమే ప్రధానంగా వాటిని భారత్ వైపు నడిపిస్తున్నాయి.

గ్రామీణుల్ని, గ్రామీణ ప్రాంతాలనూ ప్రయో గాలకు ఎంచుకోవడంలోని ఆంతర్యం ఇదే. ఔషధ ప్రయోగాలకు సంసిద్ధులయ్యే వారికి వాటి వినియోగంవల్ల కలిగే ప్రభావాన్ని సరిగా వివరించకపోవడం, అనా రోగ్యం తలెత్తినప్పుడు పట్టించుకోకపోవడంవంటివి ఎన్నో సమస్యలు తెస్తున్నా యి. పాశ్చాత్య దేశాల్లో ఈ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తారు. అంతే కాదు...అక్కడ ప్రయోగాలకు సిద్ధపడేవారికిచ్చే మొత్తం చాలా ఎక్కువుంటుంది.
ఇప్పుడు తీసుకురాబోయే సవరణ బిల్లులో పకడ్బందీ నిబంధనలున్నాయం టున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ప్రయోగాలు జరపడంవల్ల రోగికి ఆరోగ్యపరంగా తీవ్ర సమస్య ఎదురైందని తేలితే ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. ప్రయోగాల నిర్వహణ తీరు సరిగా లేదని తేలినా, అది లోపభూయిష్టంగా ఉన్నదని రుజువైనా రూ. 3 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. అయితే, ఈ తరహా ప్రయోగాలకు అనుమతించాల్సిన యంత్రాంగమేదో, ఆ ప్రయోగాలను పర్యవేక్షించాల్సిన వారెవరో నిర్దిష్టంగా పేర్కొని...వారి విధి నిర్వహణ సక్రమంగా లేనప్పుడు అమలులోకొచ్చే చర్యలేమిటన్న విషయంలో కూడా స్పష్టత ఉండాలి.

బాధితులకివ్వాల్సిన పరిహారం గురించి కూడా నిర్దిష్టంగా ఉండాలి. అలాగే ప్రయోగాలు ఎక్కడో మారుమూల పల్లెలు, చిన్న పట్టణాల్లో కాక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే నగరాల్లోనే జరపాలన్న నిబంధన చేర్చాలి. అందువల్ల బాధితులకు సకాలంలో వైద్యసాయం అందడం తేలికవుతుంది. వీటితోపాటు రోగుల సంతకాలు తీసుకునే పత్రాలు ఇంగ్లిష్‌లో కాక స్థానిక భాషల్లో ఉండేలా చూడాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే కొత్త చట్టంవల్ల సత్ఫలితాలు కలుగుతాయి. విచక్షణారహితమైన ప్రయోగాలకు బ్రేకుపడుతుంది.
 

మరిన్ని వార్తలు