గోప్యత వీడిన కొలీజియం

10 Oct, 2017 01:28 IST|Sakshi

పారదర్శకత, జవాబుదారీతనం కొరవడుతున్నాయన్న విమర్శలు ఎదుర్కొం టున్న కొలీజియం వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఇన్నాళ్లూ అనుసరిస్తూ వస్తున్న గోప్యతకు ముగింపు పలకాలని నిర్ణయించి, కొత్తగా నియ మించిన తొమ్మిదిమంది న్యాయమూర్తుల ఎంపికకు, కొందరిని నిరాకరించడానికి గల కారణాలను వెల్లడించింది. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించు కునే కొలీజియం వ్యవస్థ ఏర్పడి ఇరవై మూడేళ్లవుతోంది. ఇందులో ఏమాత్రం పారదర్శకత లేదని, ఎంపికవుతున్నవారికుంటున్న అర్హతలేమిటో, తిరస్కరణలకు గల కారణాలేమిటో తెలియడం లేదని పలువురు న్యాయకోవిదులు, ప్రజాస్వామిక వాదులు చాన్నాళ్లుగా విమర్శిస్తున్నారు.

ప్రభుత్వాలు సరేసరి... వాటి మాట చెల్లు బాటు కావడం లేదు గనుక సహజంగానే గుర్రుగా ఉంటున్నాయి. ఈ విధానాన్ని మార్చాలని గతంలో యూపీఏ ప్రభుత్వం కొంతవరకూ ప్రయత్నించింది. కానీ ఈలోగానే దాని పదవీకాలం ముగిసిపోయింది. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ విష యంలో చాలా పట్టుదలతో ప్రయత్నించింది. జాతీయ న్యాయ నియామకాల కమి షన్‌(ఎన్‌జేఏసీ) చట్టం అమల్లోకి తెచ్చింది. అందుకోసం 99వ రాజ్యాంగ సవర ణను కూడా తెచ్చింది. అయితే 2015 అక్టోబర్‌లో ఆ రెండింటినీ మెజారిటీ తీర్పుతో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

అనంతరకాలంలో న్యాయమూర్తుల నియామకాలు జరగకపోలేదుగానీ... అవి గతంలోవలే చురుగ్గా లేవు. ఈ విషయంలో కొలీజియం చేసిన అనేక సిఫార్సులు గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌ పడ్డాయి. వివిధ హైకోర్టుల్లో దాదాపు 400 న్యాయమూర్తుల పదవులు భర్తీకావాల్సి ఉంది. అపరిష్కృత కేసుల సంఖ్య పెరుగుతుండగా ఎన్నాళ్లిలా న్యాయమూర్తుల నియామకాలపై సాచివేత ధోరణి అనుసరిస్తారని గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ పలు సందర్భాల్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక సందర్భంలో ఆయన కంటతడి కూడా పెట్టారు. న్యాయవ్యవస్థతో ఘర్షణ తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఎన్నిచేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.

కొలీజియం వ్యవస్థపై దేశంలో మొదటినుంచీ భిన్నా భిప్రాయాలున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాల మాట చెల్లుబాటు కావడం ప్రారంభమైతే అది న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారితోపాటు పలు వురు న్యాయవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల ప్రమేయంలేని నియామకాల ద్వారా వచ్చిన న్యాయమూర్తులైతే నిష్పాక్షికంగా, తటస్థంగా వ్యవహరిస్తారని వాదించారు. ప్రభుత్వాల ప్రమేయం సంగతలా ఉంచి ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలూ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తుంటే ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే తనను తాను ఎందుకు మినహాయించుకోవాలని కొలీ జియం విమర్శకుల ప్రశ్న. ఎవరిదాకానో ఎందుకు... కొలీజియం వ్యవస్థకు ఆద్యు డైన జస్టిస్‌ జేఎస్‌ వర్మే అనంతరకాలంలో తన నేతృత్వంలోని ధర్మాసనం ఉద్దేశిం చింది ఒకటైతే, జరుగుతున్నది మరొకటని వ్యాఖ్యానించిన సంగతి మర్చి పోకూడదు.  

కొలీజియం లోపాలు వెలుగులోకి తెచ్చిన ఘనత జస్టిస్‌ చలమేశ్వర్‌కే దక్కు తుంది. ఎన్‌జేఏసీ చట్టాన్ని, రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ తీర్పునిచ్చినవారు జస్టిస్‌ చలమేశ్వర్‌. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తులుండే కొలీజియంలో ఆయన సభ్యులు కూడా. కొలీజియం తీరుతెన్నుల పట్ల అసంతృప్తి వ్యక్తంచేసి, దాని సమా వేశాలకు హాజరుకాబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన నిరుడు సెప్టెంబర్‌లో లేఖ రాశాక ఆ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొలీజియం పనితీరులో  పారదర్శకత కొరవడుతున్నదని, మినిట్స్‌ లేకపోవడంవల్ల భేటీలకు అర్ధం లేకుండా పోతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి ఆయన చెప్పే వరకూ న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల ప్రక్రియకు సంబంధించి రికార్డు ఉండదన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇటీవల కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయంత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేశాక కూడా కొలీజియంపై విమర్శ లొచ్చాయి. అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కావాల్సి ఉండగా ఆయన్ను ‘ప్రభుత్వ ప్రమేయం’తో  అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేశారని ఆరోపిస్తూ కర్ణా టక, గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బహుశా కొలీజియం నిర్ణయాలను, అందుకు గల కారణాలను బహిరంగపర్చాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఈ నిరసనల పర్యవసానంగానే భావించి ఉంటారు.
 
కేరళ హైకోర్టుకు ముగ్గుర్ని, మద్రాస్‌ హైకోర్టుకు ఆరుగురిని న్యాయ మూర్తులుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాలను, అందుకు అనుసరించిన విధా నాన్ని సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఎవరెవరిని ఎందుకు కాదన వలసివచ్చిందో కూడా వివరించింది. ఆ రెండు రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన సిఫార్సులపై ఆ న్యాయస్థానాల్లో పనిచేసి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తు లుగా ఉంటున్నవారి అభిప్రాయాలను కొలీజియం తెలుసుకున్నదని, వాటి ఆధా రంగా నిర్ణయానికొచ్చిందని తెలిపింది. అయితే తిరస్కృతులపై వచ్చిన ఫిర్యాదులే మిటి... కొందరిపై ఏ ప్రాతిపదికన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రతికూల అభి ప్రాయాన్ని వ్యక్తం చేశారు... జాబితాలోనివారిపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఇచ్చిన నివే దికల్లోని అంశాలేమిటన్న జోలికిపోలేదు. ఆమేరకు ఇది అసంపూర్ణమనే చెప్పాలి. మొత్తానికి కొలీజియం పనితీరులో పారదర్శకత తీసుకొచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించినందుకు స్వాగతించాలి. ఇది సాధ్యమయ్యేందుకు దోహదపడిన జస్టిస్‌ చలమేశ్వర్‌నూ, న్యాయవాదులనూ అభినందించాలి.

మరిన్ని వార్తలు