‘బ్లాక్‌’ హోల్‌!

1 Sep, 2017 00:39 IST|Sakshi
‘బ్లాక్‌’ హోల్‌!

నల్లడబ్బుపై సంధించిన బ్రహ్మాస్త్రంగా ఊరూ వాడా హోరెత్తించిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చివరకు కొండను తవ్వి కూడా ఎలుకను పట్టలేని చందాన ముగిసింది. ముహూర్తం కుదరలేదో, నిజం వెల్లడించడానికి ధైర్యం కూడదీసుకోవడంలో జాప్యమైందో...మొత్తానికి రద్దయిన నోట్లలో 99 శాతం ఖజానాకు చేరాయని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) చాలా ఆలస్యంగా బుధవారం బయట పెట్టింది. చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ. 15.44 లక్షల కోట్లయితే అందులో 15.28 లక్షల కోట్లు డిపాజిట్‌ అయ్యాయని వివరించింది. ఏతావాతా 99 శాతం నోట్లు ఖజానాకు తిరిగొచ్చినట్టయింది. రూ. 1,000 నోట్లలో కేవలం 1.4 శాతం మాత్రమే తిరిగి రాలేదని వివరాలిచ్చినా... రూ. 500 నోట్ల లెక్కల్ని మాత్రం చెప్ప లేదు. ఆర్బీఐ దానికెంత సమయం తీసుకుంటుందో తెలియదు. నిరుడు నవంబర్‌ 8 రాత్రి పొద్దుపోయాక జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు దాని పర్యవసానాల తీవ్రత దేశ పౌరులెవరికీ అర్ధం కాలేదు.

కానీ తెల్లారాక, ఆ నోట్లు తీసుకుని దుకాణాల వద్దకెళ్లాక అంతా తేటతెల్లమయింది. రోజులు గడుస్తున్నకొద్దీ వారి యాతనలు పెరుగుతూ పోయాయి. ‘మనిషికి ఉంటే పుష్టి...పశువుకు తింటే పుష్టి’ అని నానుడి. మన పర్స్‌ నిండుగా ఉన్నదని, మన బీరువా పచ్చనోట్లతో కళకళల్లా డుతున్నదని, మన బ్యాంకు ఖాతా డబ్బు చేసిందని సంబరపడి తృప్తిగా జీవించే వారు మొదలు కొని తెల్లారి లేచి రూపాయి సంపాదించడం ఎలా అని మథనపడే సామాన్యుల వరకూ...అందరికందరూ బేజారెత్తిపోయారు. పిల్లల పెళ్లి కోసమో, చదువు కోసమో, ఆపదలో ఉన్న ఇంటి పెద్దకు ఆపరేషన్‌ చేయిద్దామనో దాచుకున్న సొమ్మును డ్రా చేసుకోవడానికి వెళ్తే వీల్లేదని బ్యాంకు అధికారులు చెప్పినప్పుడు జనం చిగురుటాకుల్లా వణికిపోయారు. దయదల్చమని వారి కాళ్లావేళ్లా పడ్డారు. అయినా ఫలితం దక్కలేదు. మూతపడిన ఏటీఎంలు తెరుచుకోవడానికి, పరిమి తంగానైనా అవి డబ్బు రాల్చడానికి చాన్నాళ్లే పట్టింది. రాత్రింబగళ్లు ఏటీఎంల ముందు క్యూ కట్టి సొమ్మసిల్లినవారూ, సొమ్ము నిండుకుని ఉసూరని తిరిగిపోయిన వారూ మాత్రమే కాదు...103మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఈ కడగండ్లన్నీ ఎదుర్కొన్నాక, తొమ్మిది నెలలు గడిచిపోయాక ఇప్పుడు ఆర్బీఐ చెబుతున్న కబుర్లు వింటే ఎంతటి వారికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుం టుంది. నిజానికి కరెన్సీ లెక్క పెట్టడానికి ఇంత సుదీర్ఘ సమయం తీసుకోనవసరం లేదు. ఆ డబ్బంతా ఒక్కచోట ఒక్కరోజులో జమ అయిందేమీ కాదు. ప్రతి రోజూ, ప్రతి బ్యాంకు శాఖలోనూ లెక్క చూసుకునే కరెన్సీ తీసుకుంటారు. ఒకటికి పది సార్లు సరిచూసుకుంటారు. వసూళ్ల వివరాలు ఎప్పటికప్పుడు తాము చేరేయాల్సిన వారికి చేరేస్తూనే ఉంటారు. అలా ఎవరికి వారు అందజేసిన వివరాలన్నీ క్రమం తప్పకుండా ఆర్బీఐకి చేరతాయి. గడువు ముగిసిన వెనువెంటనే అది ప్రభుత్వానికి వివరాలివ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రజలకు వెల్లడించేందుకైనా ఒకటి రెండు రోజులకు మించి వ్యవధి తీసుకోవడం అనవసరం.

ఈ మాత్రం పనికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఎందుకింత సమయం తీసుకోవాల్సివచ్చిందో ఎవరికీ బోధపడని విషయం. పైగా ఈ పెద్దనోట్ల రద్దు గణాంకాలను రిజర్వ్‌బ్యాంక్‌ 224 పేజీల వార్షిక నివేదికలో ఎక్కడో మారుమూల 195వ పేజీలో ఎందుకు దాచిపెట్టవలసి వచ్చిందో అనూహ్యం. దేశవ్యాప్తంగా ఉన్న 4,000 ఖజానాల్లో నిక్షిప్తమై ఉన్న కరెన్సీ నోట్ల లెక్కలను సరిచూసుకున్నాక  ఈ గణాంకాలు మారొచ్చునని చివరిలో ఒక ముక్తాయింపు ఇచ్చారు. అంటే...ఇంత ఆలస్యమైనా ‘సరిచూసుకోవడం’ ప్రక్రియ ఇంకా ముగియలేదన్నమాట! వాటి సంగతెలా ఉన్నా వెనక్కురాని కరెన్సీ రూ. 16,000 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ చెబుతోంది.

పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వం ఘనమైన అంచనాలు వేసుకుంది. కరెన్సీ వ్యవస్థలో రూ. 3 లక్షల కోట్ల మేర నల్లడబ్బు ఉన్నదని భావించింది. దీన్నం తటినీ బ్యాంకుల ముందుకు తెచ్చి లెక్క చెప్పలేక నల్ల డబ్బున్నవారు వదులు కుంటారనుకుంది. కానీ అలాంటివారి  రోజువారీ విలాసాలకేమీ ఇబ్బంది కలగ లేదు. ఈతిబాధలు పడినవారంతా సామాన్యులే. రెక్కాడితేగానీ డొక్కాడని బడుగు జీవులే. నరేంద్ర మోదీ ఈ నోట్ల రద్దు వ్యవహారాన్ని అవినీతికీ, నల్లడబ్బుకూ, నకిలీ నోట్లకూ, ఉగ్రవాదానికీ వ్యతిరేకంగా ప్రారంభించిన ‘మహా యజ్ఞం’గా అభివర్ణిం చారు. దీన్ని పేదలకూ, శ్రీమంతులకూ మధ్య...నిజాయితీపరులకూ, అవినీతి పరులకూ మధ్య సాగుతున్న మహా సంగ్రామమని మోతెక్కించారు. పక్షం రోజులు గడిచాక ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి జవాబిస్తూ అప్పటి అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ పెద్ద నోట్ల రద్దు ఆంతర్యం దాదాపు రూ. 5 లక్షల కోట్ల నల్ల డబ్బును అంతమొందించి, సమస్యాత్మక ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ–కశ్మీర్‌లలో ప్రశాంతతను తీసుకురావడమని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చెప్పారు. మరి జరిగిందేమిటి? చలామణిలో ఉన్న డబ్బులో నల్ల డబ్బు దాదాపుగా లేదని తేలిపోయింది. పోనీ వెనక్కొచ్చిన డబ్బులో అంతవరకూ లెక్క చూపనిది ఉన్నదే అనుకున్నా దాని శాతం చాలా తక్కువ.

ఏతావాతా జరిగిందేమంటే పౌరు లకు బ్యాంకుల్లో దాచుకోక తప్పనిస్థితి కల్పించడం, అలా దాచుకున్నందుకు, అవస రమైనప్పుడల్లా వెనక్కి తీసుకుంటున్నందుకు చార్జీల వడ్డించడం. డిజిటల్‌ లావా దేవీల శాతం పెరగడం... ఆ లావాదేవీలకు జనంనుంచి గోళ్లూడగొట్టి కప్పం వసూలు చేయడం! చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేసిన ఉదంతాలు ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ లేవు. ఇక్కడి ఫలితం చూశాక ఇక ఉండబోదు. కిందపడ్డా నాదే పైచేయి అన్నట్టు ఇంకా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ ఏవో లక్ష్యాలు సాధించామని సంబరపడమంటున్నారు. ఈ చర్య పర్యవసానంగా పారిశ్రామిక ప్రగతి కుంటుబడిందని, ఉపాధి కల్పన మందగించిందని, వృద్ధిరేటు అంతంతమాత్రమని కనబడుతున్నా సంబరాలెలా సాధ్యమో ఆయనే చెప్పాలి. దానికి బదులు అనుకున్నదేమిటో, అయిందేమిటో నిజాయితీగా అంగీకరించాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు