పనామా పత్రాల సునామీ

6 Apr, 2016 00:39 IST|Sakshi
పనామా పత్రాల సునామీ

చీకటి ఖజానాల్లో నల్లడబ్బు గుట్టలు గుట్టలుగా పోగవుతున్న వైనం మరోసారి బద్దలైంది. మాటలే తప్ప చేతలకు సిద్ధపడని ప్రభుత్వాల నిర్వాకం చివరికెలా పరిణమిస్తున్నదో నిరూపిస్తూ కన్షార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజీ) సంస్థ జగదేక శ్రీమంతుల రహస్యాలను బయటపెట్టింది. వృత్తులు వేరైనా... పౌరసత్వం ఏ దేశానిదైనా...సంపాదనా మార్గం ఎలాంటిదైనా...చెప్పే సిద్ధాంతం ఏమైనా వీరందరి ప్రవృత్తీ ఒక్కటే- లెక్కలకెక్కని నిధుల్ని మూడో కంటికి తెలియ కుండా దాచుకోవడం! ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలను అనుసంధా నిస్తూ... కుడి ఎడమల అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలుండే ఓ చిన్న దేశం పనా మాలో కొలువుదీరిన మొస్సాక్ ఫోన్సెకా అనే సంస్థ ఇలాంటి శ్రీమంతుల దొంగ డబ్బుకు తోవలు పరుస్తోంది! ఏ దేశంలో, ఏ బ్యాంకులో దాచుకోవాలో... ఏ పేరు పెట్టుకుని ఖాతా తెరవాలో, ఏ పేరుతో బినామీ సంస్థ నెలకొల్పాలో ఇది సలహాలి స్తోంది.

డబ్బు దాచినచోట ప్రభుత్వాల విధానాలు మారబోతున్నాయని తెలిసిన మరుక్షణమే నల్ల కుబేరులను అప్రమత్తం చేసి వారి కనుసైగతో డబ్బును వేరే దేశాలకు బదలాయిస్తోంది. మందీ మార్బలం, అనేక నిఘా సంస్థల దన్ను ఉన్న ప్రభుత్వాలను అపహాస్యం చేస్తూ దశాబ్దాలుగా ఈ దొంగపనులన్నిటినీ సమర్ధవం తంగా నిర్వహిస్తున్న ఫోన్సెకాలో నిండా 500మంది సిబ్బంది కూడా లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నో దేశాల్లో ఈ సంస్థకు శాఖలున్నా, దీని కార్యకలా పాలపై కన్నేసి ఉంచుతున్నామని ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చెబుతున్నా పాత్రికేయుల పరిశోధనా బృందం దృష్టి పెట్టి వెలికి తీసేవరకూ ఈ చాటుమాటు వ్యవహారాలన్నీ గప్‌చుప్‌గా సాగిపోయాయి. దేశాధినేతలుగా ప్రభుత్వాల విధానా లను నిర్దేశిస్తూనే...కఠినమైన నిబంధనలు పెట్టినట్టు కనిపిస్తూనే ఆ నేతలే చాటు మాటుగా ఇలాంటి అక్రమార్కులతో కుమ్మక్కవుతున్నారు.
 
ఇప్పటికి వెల్లడైన పేర్లు చూస్తే ఎవరైనా గుండెలు బాదుకోవాల్సిందే. ప్రపం చాన్ని హడలెత్తిస్తున్న మాఫియా డాన్లు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు సరసనే దేశదేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, బ్రాండ్ అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తల పేర్లుండటం అందరినీ విస్మయపరుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, బ్రిటన్ ప్రధాని కామెరాన్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఐస్‌లాండ్ ప్రధాని డేవిడ్ గన్లాగ్సన్, సౌదీ అరేబియా రాజు, ఉక్రెయిన్, అర్జెంటీనా దేశాల అధ్యక్షులు ఈ ‘నల్ల’ మరకలంటినవారిలో ఉన్నారు. ఈ ఘరానా పెద్దల జాబితాలో మన దేశానికి చెందినవారూ చోటుదక్కించుకున్నారు! బాలీవుడ్ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్, డీఎల్‌ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్, ఇండియా బుల్స్ ప్రమోటర్ సమీర్ గెహ్లాట్, ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ తనయుడు తదితరులున్నారు. ఇప్పుడు వెల్లడైన పేర్లు చాలా తక్కువే. రాగలరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది గుట్టు రట్టవుతుందంటున్నారు. వివిధ రూపాల్లో ఉన్న మొస్సాక్ ఫోన్సెకాకు చెందిన కోటీ 15 లక్షల పత్రాలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. ఇదంతా 2.6 టెరాబైట్ల సమాచారం. ఇందులో ఛేదించాల్సిన అంశాలింకా చాలానే ఉన్నాయని చెబుతున్నారు.


మిగిలిన దేశాల మాటెలా ఉన్నా మన దేశానికి సంబంధించినంతవరకూ నల్ల కుబేరుల పేర్లు బయటపడటం ఇది మొదటిసారి కాదు. లీచెన్‌స్టీన్ బ్యాంకులో నల్లడబ్బు దాచుకున్న 26మంది భారతీయుల జాబితాను జర్మనీ ప్రభుత్వం 2008లో మన ప్రభుత్వానికి అందించింది. 2011లో ఫ్రాన్స్ 700మంది పేర్లున్న జాబితాను ఇచ్చింది. రెండేళ్లక్రితం మన ప్రభుత్వమే ఇద్దరు ముగ్గురు పేర్లను బయటపెట్టింది. వికీలీక్స్ సంస్థ సైతం కొందరి పేర్లు వెల్లడించింది. నిరుడు ఫిబ్రవరిలో జెనీవాలోని హెచ్ ఎస్‌బీసీ శాఖలో డబ్బులు దాచిన వేయిమందికిపైగా భారతీయుల జాబితా బయటికొచ్చింది. ఇలా అడపా దడపా అనేకమంది పేర్లు వెల్లడవుతున్నా ప్రభుత్వపరంగా తీసుకొంటున్న చర్యలేమిటో తెలియడం లేదు. 2009 ఎన్నికల సమయంలో బీజేపీ నల్లడబ్బు అంశాన్ని ప్రధానాస్త్రం చేసుకుంది.

తాము అధికారంలోకొస్తే అలాంటివారి భరతం పడతామని, ఆ డబ్బంతటినీ వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చింది. అప్పట్లో దాన్ని జనం పెద్దగా పట్టించుకో లేదు. కానీ అన్నా హజారే నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం పర్య వసానంగా అదే అంశం 2014లో ప్రజల్ని ఆకర్షించింది. నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ విజయపతాక ఎగరేయడానికి అది తోడ్పడింది. కానీ ఈ రెండేళ్లలోనూ ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా ఏమీ లేవు. మన ప్రభుత్వం సంగతలా ఉంచి అంతర్జాతీయంగా కూడా అవసరమైన పురోగతి లేదు. బ్యాంకుల గోప్యతకు కాలం చెల్లిందని, తమ వద్ద డబ్బులు దాచుకున్నవారి వివరాలను వెల్లడించాల్సిందేనని 2009లో లండన్‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు తీర్మానించింది. అనంతరకాలంలో అనేక దేశాలు తమ తమ చట్టాలను కఠినం చేశాయి. దానికి సమాంతరంగా పన్ను ఎగవేతదారులకూ, నల్లడబ్బు కూడబెట్టేవారికీ ప్రభుత్వాలు తరచు క్షమాభిక్ష పథకాలనూ, ఇతర వెసులుబాట్లనూ కల్పిస్తుంటాయి. కనుక పట్టుబడితే తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం అన్నిచోట్లా ఉంది. నల్లడబ్బు నానాటికీ పెరగడానికి ప్రధాన కారణం ఇదే.

మన దేశానికి సంబంధించినంతవరకూ 2004కు ముందున్న నిబంధనలు ఆ తర్వాత సరళం అయ్యాయి. ఏ ప్రయోజనం కోసమైనా మన పౌరులు విదేశాలకు డబ్బు బదిలీ చేయరాదన్న నిబంధన నీరుగారి 25,000 డాలర్ల వరకూ సరళీకృత చెల్లింపు పథకంకింద పంపవచ్చునన్న నిబంధన వచ్చిచేరింది. అలాగే విదేశాల్లో కంపెనీల ఏర్పాటు విషయంలోనూ నిబంధనలు సులభమయ్యాయి. ఫోన్సెకా ద్వారా ఉనికిలోకొచ్చిన 2,14,000 కంపెనీల్లో ఈ బాపతే అధికం. ఇప్పుడు పేర్లు వెల్లడయ్యాక ఏం చేసినా చట్టబద్ధంగానే చేశామని, తమదేమీ తప్పులేదని పలువురు చెబుతుండటానికి కారణం ఇదే. అందులో అవాస్తవమేమీ ఉండకపోవచ్చు. అయితే చట్టబద్ధమైనదంతా నైతికబద్ధం కాకపోవచ్చునని గుర్తించాలి. అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలనూ మింగేస్తున్న నల్లడబ్బును అదుపు చేయాలంటే అందుకు తావిస్తున్న నిబంధనలు మారి తీరాలి. ఈ పని చేయకుండా ఏం చెప్పినా వ్యర్ధమే.

మరిన్ని వార్తలు