ప్రమాదాలకు చెక్‌!

7 Aug, 2019 02:15 IST|Sakshi

రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా, భద్రంగా మళ్లీ ఇంటికి చేరేందుకు ఉద్దేశించిన మోటారు వాహనాల చట్టం(సవరణ) బిల్లు ఎన్నెన్నో స్పీడ్‌ బ్రేకర్లను దాటుకుని ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. ఇది చట్టమైతే నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తోటి పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వాహనచోదకులకు కఠిన శిక్షలు, జరిమానాలు విధించేందుకు వీలవుతుంది. అలాగే వాహన ఉత్పత్తిదారులకు, రోడ్లు నిర్మించేవారికి కూడా వర్తించే నిబంధనలు దీన్లో పొందు పరిచారు. మన దేశంలో గతంతో పోలిస్తే రవాణా సౌకర్యాల విస్తృతి పెరిగింది. కళ్లు చెదిరే రీతిలో ఆరు లేన్లు, ఎనిమిది లేన్ల రహదారుల్ని నిర్మిస్తున్నారు. వాటిని చూడముచ్చటగా తీర్చి దిద్దుతు న్నారు. వాహనాలన్నీ పెను వేగంతో పరుగులెడుతున్నాయి.

కానీ జనం ప్రాణాలే గాల్లో దీపాలవు తున్నాయి. ఏటా సగటున లక్షన్నరమంది పౌరులు దుర్మరణం పాలవుతున్నారు. మన దేశంలో ఉగ్రవాద ఉదంతాల్లో కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువమంది చనిపోతున్నారు. కానీ కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ వరసగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించాయి. వాటిని నియంత్రించడం తమ పని కాదన్నట్టు ప్రవర్తించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనించి 2014లో సుప్రీంకోర్టే చొరవ తీసుకుని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎస్‌. రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతను, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తతను తన నివేదికలో నిశి తంగా ఎత్తిచూపింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీలో, కాలం చెల్లిన వాహనాలను నియంత్రించడంలో, ఇతర భద్రతా నిబంధనలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వాలన్నీ ప్రేక్షకపాత్ర వహిస్తు న్నాయని ఆ కమిటీ సోదాహరణంగా చెప్పింది. కానీ చివరకు ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడానికి ఇన్నేళ్లు పట్టింది. 

రోడ్డు ప్రమాదాల సంఖ్య 2016తో పోలిస్తే కొంతమేరకు తగ్గాయి. అయినా ప్రపంచ దేశాల న్నిటితో పోలిస్తే ఇప్పటికీ రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే అధికం. వాస్తవానికి ఈ విషయంలో చైనా 2006 వరకూ అగ్రస్థానంలో ఉండేది. కానీ ఆ స్థానాన్ని  మన దేశం ఆక్రమించింది. నిరుడు దేశవ్యాప్తంగా 4,61,000 ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో 1,49,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4,65,000 కాగా, ఈ ప్రమాదాల బారినపడి మొత్తం 1,48,000మంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్‌ అగ్ర స్థానంలో ఉంటే, ఆ తర్వాత స్థానం గుజరాత్‌ది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లు తదనంతర స్థానాల్లో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో 2017తో పోలిస్తే మృతుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. రోడ్డు ప్రమా దాలను అరికట్టడంలో, ప్రమాదాల్లో గాయపడినవారిని సకాలంలో ఆదుకుని ప్రాణనష్టాన్ని నివా రించడంలో తమిళనాడు కృషి ప్రస్తావించదగింది. ఆ రాష్ట్రంలో ప్రమాదాలు 25 శాతం తగ్గాయి. ఆ మేరకు మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ద్విచక్రవాహనాల వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జాతీయ, రాష్ట్ర రహదారుల కంటే ఇతర రహదారులపైనే అధికంగా చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా నగరాల్లో రోడ్లు విశాలంగా, మెరుగ్గా ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో ఎంతో కొంత మెరుగు. కానీ జిల్లా స్థాయిల్లో అవి అత్యంత అధ్వాన్న స్థితిలో ఉంటాయి. కనుకనే ప్రమాదాల్లో 45 శాతం ఆ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి.  

ప్రమాదాలు జరగడం దురదృష్టంగా, తలరాతగా సరిపెట్టుకునే ధోరణి వల్ల కావొచ్చు... ప్రభు త్వాలపై ఒత్తిళ్లు తగినంతగా ఒత్తిళ్లు రావడం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహావేశాలు పెల్లు బుకుతాయి. కారకులైనవారిపై తక్షణ చర్యలుండాలన్న డిమాండ్లు వినబడతాయి. కానీ రహదారుల నిర్మాణంలో, వాటిని మరమ్మతు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్న తీరు మాత్రం సరిగా చర్చకు రాదు. కనుక రోడ్లు ఎప్పటికీ అధ్వాన్నంగానే ఉంటున్నాయి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సక్రమంగా లేనిచోట, ఇరుకిరుగ్గా, గోతులతో ఉండే రహదారుల వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతున్నా యని భద్రతా నిపుణులు చెబుతున్నారు. రోడ్ల నిర్మాణంలో లోపం ఉంటే సంబంధిత కాంట్రాక్టర్‌ను బాధ్యుణ్ణి చేయడం తాజా సవరణ బిల్లు విశిష్టత. అలాగే వాహన చోదకులను క్రమశిక్షణలో ఉంచ డానికి అవసరమైన నిబంధనలున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి విధించే కనీస జరి మానాను రూ. 100 నుంచి రూ. 500కు పెంచారు. ఇది గరిష్టంగా రూ. 10,000. లైసెన్స్‌ లేకుండా బండి నడిపేవారికి విధించే పెనాల్టీని రూ. 500 నుంచి రూ. 5,000 చేయడం కూడా మెచ్చదగ్గ అంశం.

ఇప్పుడున్న చట్టం ప్రకారం తాగి వాహనాలు నడిపేవారికి విధించే జరిమానా రూ. 2,000 కాగా ఇకపై అది రూ. 10,000. ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారికి ఇకపై రూ. 5,000 వడ్డన తప్పదు. ఇవిగాక అనేక రకాల ఇతర ఉల్లంఘనలకు కూడా శిక్షలు, జరిమానాలు ఎక్కువే ఉన్నాయి. అలాగే కొన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించినవారు సామాజిక సేవ చేయడం తప్పనిసరవు తుంది. ఇది కొత్త ప్రయోగం. ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల అనేకులు సొంత వాహనాల వినియోగంవైపు మొగ్గుచూపుతున్నారు. దీన్ని ప్రభుత్వం గుర్తించిందనే చెప్పాలి. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాల్ని మెరుగుపర్చడానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఏటా దాదాపు రూ. 3,80,000 కోట్ల మేర నష్టం కలగజేస్తున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఇన్ని దశాబ్దాల తర్వాత ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. ఇది చట్టమయ్యాక ఆచరణలో ఎదురయ్యే సమ స్యలేమైనా ఉంటే వెనువెంటనే సవరణలు తీసుకొచ్చేందుకు కూడా వెనకాడ కూడదు. అలాగైతేనే పౌరుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా