పర్యావరణ రక్షణతోటే సుస్థిరాభివృద్ధి

5 Jun, 2018 02:08 IST|Sakshi

రాబందులను చూపితే లక్షల రూపాయలు నగదు బహుమతి అంటూ బడి పిల్లల పాఠ్యపుస్తకాల్లో ముద్రించుకున్నాం. సీతాకోకచిలుకలు, అరుదైన పక్షి జంతుజాతులు అంతరిస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిజి గాడు, బట్టమేక పిట్టలను బొమ్మలుగా చూపించాల్సిన స్థితి ఏర్పడింది. మరోవైపు ఏటికేడు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. కరువులు సుపరిచితమైన పశువులకు మేత, రైతుకు తిండి కరువై బ్రతుకే బరువై వలసలు నిత్యకృత్యమయ్యాయి. తినేతిండి, తాగేనీరు, పీల్చేగాలి కలుషితంగా మారాయి. పెరిగిన విజ్ఞానం, సాంకేతికతలతో ప్లాస్టిక్‌ వ్యర్థాలు మాత్రమేగాక ఎలక్ట్రానిక్‌ ఇ వ్యర్థాలు సవాలుగా మారాయి. 

భూమిపై ఉండే 17,70,000 జీవజాతులలో మనిషి దురాశ విశ్వరూపందాల్చి భావితరాలనూ కబ ళించేలా వుంది. మనిషి సృష్టిస్తున్న పర్యావరణ విధ్వంసం ఇలాగే కొనసాగితే 2030–2050 మధ్య ప్రపంచంలో ఏటా కనీసం 2,50,000 మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చ రిస్తోంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ కోణాల మధ్య సమతుల్యతతో జరిగే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి అంటాం. భవిష్యత్‌ తరాల సంక్షేమం దెబ్బతినకుండా ప్రస్తుత తరాల అవసరాలు తీర్చుకోవాలనే మౌలిక సూత్రం ఇందులో ప్రధానంగా ఉంటుంది. సమాజ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థలు మూడు పరస్పర ఆధారితాలుగా ఉంటాయని గ్రహిస్తే జీవనవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతలు దెబ్బతినవు. పర్యావరణాన్ని పక్కకు నెట్టి ఎలాగైనా ఆర్థికంగా ముందుకు వెళ్లాలనుకోవడమంటే కూర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కున్నట్లవుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది. సుస్థిరాభివృద్ధేనా? నిజాయితీగా ఆలోచించాలి.

ఒక ప్లాస్టిక్‌ కవరు మట్టిలో కలవటానికి 10 లక్షల ఏళ్లు పడుతుంది. ప్లాస్టిక్‌ను నిత్య జీవి తంలో విపరీతంగా వాడేస్తున్నాము. పెళ్ళిళ్ళు, వేడుకలలో వాడిపాడేస్తున్న ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు ఎంత ప్రమాదకరమో ఆలోచించటం లేదు. వాటి ద్వారా రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మనసుంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాల నియమావళి 2016 ప్రకారం ప్లాస్టిక్‌ కవర్లు 50 మైక్రాన్లకంటే ఎక్కువ మందం ఉన్నవే వాడాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి.
  
వస్తు వినియోగ సంస్కృతి మూలంగా ఇళ్ళలో విపరీతంగా వస్తువులను పోగేసుకుంటున్నాం. ప్రతి వస్తువు తయారయ్యే క్రమంలో ఇంధనం ఖర్చయి, కాలుష్యం పెరుగుతుందని గ్రహించాలి. వాహనాలు, పరిశ్రమలు, అధునాతన సౌకర్యాలనిచ్చే యంత్రాలు హరితగృహ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఫలితంగా భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇదే తీరులో ఉష్ణోగ్రతలు పెరిగితే ఈ శతాబ్దాంతానికి గరిష్టంగా 2.6 నుంచి 4.8 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉంది. అడవులను, సరస్సులను, నదులను, అడవి జంతువులతో పాటు సహజ పర్యావరణాన్ని కాపాడి అభివృద్ధి పరచటం, సమస్థ జీవులపట్ల కరుణ కలిగి వుండటం ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక విధి. మతం, రాజ్యాంగం, మానవత్వం ఏ కోణంలోనూ పర్యావరణ వ్యతిరేక చర్యలు క్షమార్హం కాదు. ప్రజల్లో ఈ రకమైన అవగాహన కల్పించాలి.

మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. ఇటువంటి వాతావరణాన్ని కోరుకోవడం ప్రతి జీవజాతి హక్కుగా కూడా ఉంటుంది. అది నేరవేరాలంటే పుడమి తల్లి అందాలు తరిగిపోకుండా చూసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనిషి అంతా నాదే అనే అత్యాశ వీడి, జీవించు జీవించనివ్వు అనే ఇతర జీవజాతుల విధానాన్ని మనిషి కూడా పాటించాలి.
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)
చింతలేని యాగంటీశ్వరప్ప, జాతీయ పర్యావరణ కన్వీనర్, జనవిజ్ఞాన వేదిక
మొబైల్‌ : 99598 06652 

మరిన్ని వార్తలు