మోదీ మేల్కొలుపు

1 Oct, 2019 00:15 IST|Sakshi

ప్రపంచ దేశాల అత్యున్నత వేదిక ఐక్యరాజ్యసమితిలో శుక్రవారంనాడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం, ఆ తర్వాత పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఉపన్యాసం గమనించాక ఉపఖండంలో ఉద్రిక్తతలు ఎందుకున్నాయో, ఈ స్థితికి కారకులెవరో అన్ని దేశాలకూ అర్థమై ఉంటుంది. మోదీ 20 నిమిషాలు చేసిన ప్రసంగంలో అభివృద్ధి దిశగా మన దేశం చేస్తున్న కృషి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మొదలుకొని భూగోళంపై వాతావరణ మార్పులు కలగ జేస్తున్న ప్రభావం వరకూ ఎన్నో అంశాలను స్పృశించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచానికి కలగబోయే ముప్పేమిటో హెచ్చరించారు. 

దాన్ని కూకటివేళ్లతో పెకిలించటానికి అన్ని దేశాలూ సమష్టిగా కదలవలసిన అవసరం గురించి నొక్కిచెప్పారు. అందుకు భిన్నంగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగంలో నెత్తురుటేర్లు, అణుయుద్ధం తదితరాలన్నీ ఉన్నాయి. ఇలా ఆద్యంతమూ బెది రింపులతో కాలక్షేపం చేశాక ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్లామోఫోబియా’ వ్యాపించిందని వాపోయారు. ఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలుస్తున్నవారు తమ విధ్వంసకార్యకలాపాలకూ, విచ్ఛిన్నకర చర్యలకూ మతం ముసుగేసుకునే ప్రయత్నం చేయడం వల్లనే ఈ స్థితి తలెత్తింది. అయితే ఇస్లాం ధర్మాన్ని, సకల మానవాళి శ్రేయస్సు కోసం అది ప్రబోధిస్తున్న విలువలను చాటి చెబుతున్న అనేకమంది మతాచార్యులు అలాంటి దురభిప్రాయాలను చాలావరకూ చెరిపేయగలిగారు. ఇప్పుడు ఉగ్రవాదులనూ, వారికి మద్దతుపలుకుతున్నవారిని ఉన్మాదులుగానే అందరూ పరిగ ణిస్తున్నారు. 
(చదవండి : కలిసికట్టుగా ఉగ్ర పోరు)

పాకిస్తాన్‌ మన దేశంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేయా ల్సిందిపోయి మొదటినుంచీ బెదిరింపులకూ, దుస్సాహసాలకూ దిగుతోంది. సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలకు సిద్ధపడటానికి బదులుగా మిలిటెంట్లకు పాక్‌ భూభాగంలో ఆయుధ శిక్షణనిచ్చి సరిహద్దులు దాటించి కశ్మీర్‌లో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. సుశిక్షితమైన సైన్యం, పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్న భారత్‌ ఇలాంటి చేష్టలకు బెదిరి, తమ దారికొస్తుందని ఆ దేశం ఎలా అనుకుంటున్నదో ఎవరికీ బోధపడదు. 

అసలు భారత్‌తో ఎలా వ్యవహరించాలన్న అంశంలో పాకిస్తాన్‌కు ఒక వైఖరి ఉన్నట్టు కనబడదు. అక్కడి ప్రజా ప్రభు త్వాలు ఒకటి తలిస్తే, పాక్‌ సైన్యం మరో విధంగా ప్రవర్తిస్తుంది. అన్ని దేశాల తరహాలో అక్కడ కూడా ప్రభుత్వం చెప్పుచేతల్లో సైన్యం ఉంటే ఈ స్థితి తలెత్తదు. కానీ ఇందుకు భిన్నంగా పాక్‌ సైన్యం పాలకుల్ని నియంత్రిస్తుంది. చర్చలు జరపాలని ఇరు దేశాలూ నిర్ణయించిన ప్రతిసారీ పాక్‌ సైన్యం కవ్వింపు చర్యలకు దిగడం, సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని పౌరులపై గుళ్లవర్షం కురిపిం చడం రివాజుగా మారింది. కొన్నిసార్లు ఉగ్రవాద చర్యలకు ఉసిగొల్పడం కూడా కనబడు తుంటుంది. 

ఇలాంటి చేష్టలవల్ల పలుమార్లు ఇరు దేశాల మధ్యా జరగవలసిన చర్చలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. కొన్ని నెలలు గడిచాక తిరిగి ప్రభుత్వాలు రెండూ చర్చల తేదీలు ఖరారు చేసుకుంటే తిరిగి అదే పునరావృతమయ్యేది. గతంలో పనిచేసిన భుట్టో, నవాజ్‌ షరీఫ్, బేనజీర్‌ వంటివారు తమ వ్యక్తిత్వాలను నిలుపుకొనేందుకూ, సైన్యం అభిప్రాయాలకు భిన్నమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంతో కొంత ప్రయత్నించేవారు. అందుకు భుట్టో, ఆయన కుమార్తె మూల్యం చెల్లించారు. నవాజ్‌ షరీఫ్‌ అర్థంతరంగా పదవి కోల్పోయి, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలై జైల్లో ఉన్నారు. 

ఆయన కుటుంబసభ్యులకూ కారాగారవాసం తప్పలేదు. ఇమ్రాన్‌ఖాన్‌ పూర్తిగా సైన్యం చెప్పినట్టు ఆడుతున్నారని, ఏ నిర్ణయం సొంతంగా తీసుకోవడంలేదని పాక్‌ మీడియానే తరచు ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఏముంటుందని కూడా ఇమ్రాన్‌ ఆలోచించలేకపోయారు. కశ్మీర్‌లో విధించిన ఆంక్షల గురించి, దాని ప్రతిపత్తి మార్చడం గురించి ఇక్కడి పార్టీలు, నాయకులు ఆందోళన చేస్తున్నారు. విమర్శిస్తున్నారు. ఒత్తిళ్లు తెస్తున్నారు. అది భారత్‌ ఆంతరంగిక వ్యవహారం. 

పాకిస్తాన్‌కు సంబంధం లేని అంశం. తమకేమి కావాలో, ఎవరిని డిమాండ్‌ చేయాలో, ఎలా సాధించుకోవాలో కశ్మీర్‌ ప్రజలు నిర్ణయించుకుంటారు. అక్కడి ఉద్రిక్తతలను సాకుగా తీసుకుని ఏదో ఒక అలజడి సృష్టించి లబ్ధిపొందుదామనుకోవడం పాక్‌ తెలివితక్కువతనం. కశ్మీర్‌ పౌరుల గురించి గుండెలు బాదుకున్న ఇమ్రాన్‌ తీరును ఆ తర్వాత ప్రసంగించిన అమెరికా ప్రతినిధి ఎండగట్టారు. కశ్మీర్‌ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్న పాకిస్తాన్‌ చైనాలోని వీగర్‌లో లక్షలాదిమంది ముస్లిం జనాభా వేదనను ఎందుకు పట్టించుకోదని నిలదీశారు. దీనికి ఇమ్రాన్‌ దగ్గర జవాబేముంటుంది? అక్కడి వరకూ పోనక్కరలేదు...తన భూభాగంలోని బలూచిస్తాన్‌లో సైన్యం ఆగడాల గురించి, అక్కడ అమలవుతున్న ఆంక్షల గురించి నిలదీస్తే పాకిస్తాన్‌ సమాధానం ఇవ్వగలదా?

భారత్‌ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచాభివృద్ధిలో భాగమేనన్న సందేశం ప్రధాని మోదీ బలంగా ఇవ్వగలిగారు. అదే సమయంలో భారత్‌పై ఎక్కుపెట్టిన ఉగ్రవాద చర్యలు ప్రపంచ భద్రతకు కూడా ముప్పు తెస్తాయన్న సంకేతమిచ్చారు. ఎక్కడా పాకిస్తాన్‌ పేరెత్తకుండా ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదన్న మోదీ మాటల్లో నిజముంది. 

‘ఉగ్రవాదంపై యుద్ధం’ చేస్తామన్న అమెరికా కూడా ఈ విషయంలో చొరవ ప్రదర్శించడం లేదు. ఏది ఉగ్రవాదమో, ఎవరు ఉగ్రవాదులో నిర్ధారించే నిర్వచనాలు ఖరారైతే తన ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయం ఆ దేశానికుంది. తప్పించుకు తిరిగే ఇలాంటి ధోరణి పరోక్షంగా ఉగ్రవాదానికి ఊతమిస్తుంది. ఏదేమైనా మన దేశం సాధ్యమైనంత త్వరగా కశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించి, అక్కడ అమలు చేస్తున్న ఆంక్షల్ని ఎత్తేయగలిగితే పాకిస్తాన్‌ తప్పుడు ప్రచారానికి తగిన జవాబిచ్చినట్టవుతుంది. ఆ దిశగా కేంద్రం అడుగులేయాలి.

మరిన్ని వార్తలు