ప్రణబ్‌ హితవచనాలు

9 Jun, 2018 00:30 IST|Sakshi
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (ఫైల్‌ ఫోటో)

భిన్న సిద్ధాంతాల, అవగాహనల మధ్య చర్చ జరగడం ఎప్పుడూ స్వాగతించదగిందే. ప్రజా స్వామ్య వ్యవస్థ మనుగడకు అది ఎంతో అవసరం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరె స్సెస్‌) కార్యక్రమానికి రావాలంటూ ఆ సంస్థ నుంచి అందిన ఆహ్వానాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంగీకరించినప్పటినుంచి ఆ విషయంలో వ్యక్తమైన అభిప్రాయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయిదు పదుల సుదీర్ఘ రాజకీయ జీవితంలో స్వల్పకాలం మినహా మొత్తం కాంగ్రెస్‌తోనే కలిసి ప్రయాణించిన ప్రణబ్‌ ఆ ఆహ్వానాన్ని ఎలా మన్నిస్తారని ప్రశ్నిం చినవారు కొందరైతే... వెళ్తే తప్పేమిటన్నవారు మరికొందరు. వద్దని కోరినవారిలో కాంగ్రెస్‌ వాదులు మాత్రమే కాదు... కమ్యూనిస్టులు, ఉదారవాదులు కూడా ఉన్నారు. చిదంబరం వంటి కాంగ్రెస్‌ నాయకులు ‘వెళ్తే వెళ్లండిగానీ, వారి సిద్ధాంతంలోని లోపాలేమిటో చెప్పి రండి’ అని ప్రణబ్‌కు హితబోధ చేశారు.

మరికొందరు మాత్రం నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు. అధికారికంగా తన వైఖరేమిటో చెప్పని కాంగ్రెస్‌ చివరికొచ్చేసరికి మాత్రం అలా వెళ్లడం మహాపరాధం అన్నట్టు మాట్లాడింది. ‘మీనుంచి ఇలాంటిది ఆశించలేద’ంటూ సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. ఎందుకైనా మంచిదని ప్రణబ్‌ కుమార్తె, కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్టతో కూడా ప్రణబ్‌కు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించారు.  కానీ ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే ఆ పార్టీ గొంతు సవరించుకుని ప్రణబ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. 


ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగం గంభీరంగా సాగింది. రాష్ట్రపతిగా జాతినుద్దేశించి చేసిన ప్రసం గాల తరహాలోనే ఇది కూడా ఉంది. ఎవరికి వారు తమ తమ వైఖరులకు అనుగుణమైన అంశాలను  వెదుక్కోవడానికి వీలుగానే ఉంది. ఆయన భారతీయ సమాజ మూలాల గురించి మాట్లాడారు. శిఖరాలనూ, సాగరాలనూ, ఎడారులనూ దాటుకుని మన సంస్కృతి, విశ్వాసాలు ప్రపంచంలోని నలుమూలలకూ విస్తరించిన వైనాన్ని ప్రస్తావించారు. జాతి, జాతీయతలను భౌగోళిక హద్దులు, భాష, మతం, తెగ వగైరా పరిమితులకు లోబడి చూడరాదని చెప్పారు. భారత జాతీయత కొందరికే పరిమితమైన భావన కాదని, దానికి దూకుడు లేదా విధ్వంసకర స్వభావాలు లేవని చెప్పిన మహాత్మా గాంధీతోపాటు... హిందూ, ముస్లిం, సిక్కు తదితర సమూ హాల సైద్ధాంతిక సమ్మేళనమే భారత జాతీయతగా నిర్వచించిన జవహర్‌లాల్‌ నెహ్రూనూ గుర్తు చేశారు.

బ్రిటిష్‌ వలసవాదులకు వ్యతిరేకంగా ఈ నేల నాలుగుచెరగులా వ్యాపించిన పోరాటాల సమష్టితత్వం వ్యక్తిగత, సైద్ధాంతిక, రాజకీయ పాయలకు అతీతంగా దేశభక్తిని ప్రేరేపించిందని వివరించారు. మన రాజ్యాంగం నుంచే మన జాతీయత ఆవిర్భవించిందని నొక్కిచెప్పారు. భిన్నాభిప్రాయాల మధ్య సంవాదం అవసరమని, అవి ఉండొద్దనుకోవడం సరికాదని హితవు పలికారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప అసహనం, ద్వేషం, హింస కూడదని తెలి పారు. సంగమం, సమీకరణం, సహజీవనాల సుదీర్ఘ ప్రక్రియ నుంచే ఈ జాతి రూపు దిద్దు కున్నదని వివరించారు. అయితే ‘భరతమాత మహోన్నత పుత్రుడి’గా ప్రణబ్‌ అభివర్ణించిన ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్‌ అభిప్రాయాల్లో చాలావాటికి ఇవి భిన్నమైనవి. ఉదాహరణకు ‘రాజ్యాంగ జాతీయత’ను ఆరెస్సెస్‌ అంగీకరించదు.

ఈ గడ్డపై పురాతన కాలం నుంచే ఇది కొనసాగుతూ వస్తున్నదని చెబుతుంది. జాతీయతకు సంబంధించిన ఈ భిన్నమైన అభిప్రాయాల్లో తన వైఖరిలోని సహేతుకతను గురించి ప్రణబ్‌ స్పృశించలేదు. ఆయనే చెప్పి నట్టు ఇలా భిన్నాభిప్రాయాలుండటం, అవి వ్యక్తం కావడం, వాటిపై చర్చ జరగడం ఇప్పటి పరి స్థితుల్లో ఎంతో అవసరం. ఈ ప్రసంగంలో ఎక్కడా ప్రణబ్‌ వర్తమానంలో కనబడుతున్న విభిన్న ఆచరణల గురించి, అవి పోతున్న పోకడల గురించి, వాటి పర్యవసానంగా సంభవించిన విషాద ఉదంతాల గురించి, అందులోని మంచిచెడ్డల గురించి ప్రస్తావించలేదు. ప్రణబ్‌ ఆ పని చేసి ఉంటే బహుశా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కూడా ఆ వేదికపై నుంచే ఆ అంశాలపై తమ వైఖరేమిటో వివరించేవారు. 2007లో అప్పటి ఆరెస్సెస్‌ చీఫ్‌ కేఎస్‌ సుదర్శన్‌ ఆహ్వానంపై ఇలాంటి సమావేశానికే ప్రధాన అతిథిగా వెళ్లిన వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఏవై టిప్నిస్‌ ఆ సంస్థ ఆచరణపై, దాని సిద్ధాంతాలపై తన అభిప్రాయాలు చెప్పడం, అందుకు సుదర్శన్‌ సమాధానమివ్వడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే ప్రణబ్‌ నిష్కర్షగా తన అభి ప్రాయాలు చెప్పిన సందర్భాలున్నాయి. యూపీలోని దాద్రిలో గొడ్డు మాంసం తింటున్నారని అనుమానం వచ్చి ఒక కుటుంబంపై దాడిచేసి ఆ కుటుంబ పెద్దను కొట్టి చంపిన ఉదంతం జరిగినప్పుడు రాష్ట్రపతిగా ప్రణబ్‌ దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రంగా ఖండించారు. 


ప్రణబ్‌ ప్రసంగానికి ముందు మాట్లాడిన భాగవత్‌ తమ సంస్థ ఏ ఒక్క వర్గానికో పరిమి తమైనది కాదని చెప్పడంతోపాటు అందరినీ కలుపుకొని వెళ్తామని వివరించారు. ప్రజల మత విశ్వాసాలతో తమకు పని లేదని, అందరి సహకారంతో దేశాన్ని ‘విశ్వ గురు’గా నిలపడమే ధ్యేయమని తెలిపారు. ప్రణబ్‌ ఈ సమావేశానికి రావడంపై చెలరేగిన దుమారాన్ని ప్రస్తా వించి... ఈ కార్యక్రమం తర్వాత కూడా ప్రణబ్‌ ప్రణబ్‌గానే ఉంటారని, సంఘ్‌ సంఘ్‌గానే ఉంటుందని మోహన్‌ భాగవత్‌ చెప్పారు. అయితే మార్పునకు ఎవరూ అతీతం కాదు. పర స్పరం ప్రభావితం కానివేవీ ఉండవు. ఎల్లకాలమూ ఎవరికి వారుగానే ఉండటం సాధ్యమూ కాదు.

కొన్నేళ్లక్రితం ఆరెస్సెస్‌ నుంచి ఇలాంటి ఆహ్వానమే వచ్చి ఉంటే ప్రణబ్‌ అంగీ కరించేవారా? అసలు ఆరెస్సెస్‌ ఆయన్ను పిలిచేదా? హెడ్గేవార్‌ అభిప్రాయాలకూ, ఇప్పుడు మోహన్‌ భాగవత్‌ వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలకూ మధ్యనే ఎంతో వ్యత్యాసముంది. అయితే ఆరెస్సెస్‌ వేదికపై ప్రసంగించినంతమాత్రాన వారితో ప్రణబ్‌కు ఏకీభావమున్నదని అనుకో వడం లేదా ఆ సంస్థ ఈ సందర్భాన్ని తనకనుకూలంగా మలచుకుంటుందన్న వాదన సరికాదు. ఎవరేం చెప్పినా అంతిమంగా ఆచరణే అన్నిటికీ గీటురాయి. దాన్నిబట్టే ఎవరికైనా అభిప్రా యాలు ఏర్పడతాయి. ప్రణబ్‌ చెప్పారనో, ఆరెస్సెస్‌ చెప్పుకున్నదనో ఎవరూ దేనిపైనా నిర్ణ యానికి రారు. మొత్తానికి ప్రణబ్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపిందని చెప్పాలి. దేశ రాజకీయాలపై దీని ప్రభావం ముందూ, మునుపూ ఎలా ఉంటుందో చూడాలి.


 

మరిన్ని వార్తలు