‘ప్రసారభారతి’ తిరుగుబాటు

22 Feb, 2018 01:19 IST|Sakshi
ప్రసారభారతి

అప్పుడప్పుడు కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. దూరదర్శన్, ఆకాశవాణి సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే ప్రసారభారతి సంస్థ పాలకుల ఆదేశాలను ధిక్కరించిన వైనం అలాంటి ఊహకందని పరిణామమే. ప్రసారభారతి బోర్డులో ఒక సభ్యుడి నియామకంతోపాటు ఇద్దరు పాత్రికేయులను భారీ వేతనాలతో ఉద్యోగులుగా తీసుకోవాలంటూ తాజాగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలను ప్రసారభారతి బోర్డు తిరస్కరించింది. ఇలాంటి సిఫార్సులు ప్రసారభారతి చట్టాన్ని, దాని స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది.

అలాగే కాంట్రాక్టు సిబ్బందిని తొలగించాలన్న సూచనకు కూడా అంగీకరించలేదు. ప్రసారభారతి పుట్టి బుద్ధెరిగి ప్రభుత్వానికి ఇలా ఎదురుతిరిగిన సందర్భం లేదు. వాస్తవానికి ఆ సంస్థ ఏర్పాటు ఉద్దేశం పాలకుల అడుగులకు మడుగులొత్తాలని కాదు... అది స్వతంత్రంగా వ్యవహరించి దూరదర్శన్, ఆకాశ వాణిలను వృత్తిపరమైన ఉన్నత సంస్థలుగా తీర్చిదిద్దాలనే. కానీ ప్రసారభారతి తన ఆవిర్భావం వెనకున్న ఉద్దేశాన్ని మరిచింది.

అధికారంలో ఉన్నవారి అభీష్టాన్ని నెరవేరుస్తూ వచ్చింది. ఫలితంగా దూరదర్శన్, ఆకాశవాణి ఎప్పటిలాగే మిగిలి పోయాయి. మన దేశంలో ఉన్నతాశయాలతో ప్రారంభించిన సంస్థలు వాటికి చాలా దూరంగా ఉండిపోవడం కొత్తేమీ కాదు. పరిశ్రమల నిర్వహణ బాధ్యతలను ఆయా రంగాల్లో నిపుణులైనవారికి అప్పగించి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించాలని పబ్లిక్‌ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు.

కానీ ఆచరణలో అది విఫలమైంది. పరిశ్రమల నిర్వహణలో రాజకీయ జోక్యం పెరగడం, ఉన్నత పదవుల్లో అయినవారిని నియమించాలంటూ ఒత్తిళ్లు తీసుకురావడం పర్యవ సానంగా చాలా పబ్లిక్‌ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి చివరకు మూతబడిన ఉదంతాలున్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా స్వతంత్రంగా వ్యవహరించి అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతుల్ని గడించిన సంస్థలు కూడా లేకపోలేదు.

తాము అధికారంలోకొస్తే ఆకాశవాణి, దూరదర్శన్‌లకు ప్రభుత్వ అజ్మాయిషీ నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పని పార్టీ లేదు. అత్యవసర పరిస్థితి కాలంలో సెన్సార్‌షిప్‌ అమలు చేసి ఆకాశవాణి గొంతు నులిమిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన తర్వాత తమకు అధికారమిస్తే ఇలాంటి దుస్థితి కలగకుండా చూస్తామని జనతాపార్టీ తొలిసారి హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇతర పార్టీలు సైతం అలాంటి హామీలివ్వడం, అమలు చేయకపోవడం రివాజుగా మారింది.

కానీ బలహీనమైన ప్రభుత్వానికి నాయకత్వంవహించి, స్వల్పకాలం ప్రధానిగా పనిచేసిన చంద్రశేఖర్‌ ఆశ్చర్యకరంగా 1990లో ఈ ప్రసారభారతి బిల్లుకు మోక్షం కలిగించి అది చట్టరూపం ధరించడానికి కారకులయ్యారు. ఆ తర్వాత వచ్చిన పీవీ ప్రభుత్వం ఆ చట్టాన్ని అటకెక్కించింది. 1995లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాకే కదలిక మొదలైంది. అయినా రెండేళ్లకాలం వృథాగా గడిచిపోయింది. చివరకు ఐకె గుజ్రాల్‌ ప్రధానిగా వచ్చాక 1997లో ప్రసారభారతి చట్టం అమల్లోకి వచ్చింది.

ప్రసారభారతి పనితీరు మొదటినుంచీ అంత సంతృప్తికరంగా ఏం లేదు. దాని పని అది చేసుకుంటే పెత్తనం చేయడానికి తమకేం మిగులుతుందని సమాచార మంత్రులుగా వచ్చినవారంతా భావించినట్టున్నారు. అందువల్లే ఆ సంస్థను తమ ఉక్కు పిడికిట్లో ఉంచుకున్నారు. దాదాపు 450 దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రసారభారతి దేశంలోనే అతి పెద్ద ప్రసార సేవల సంస్థ. వర్తమాన అవసరాలకు తగినట్టుగా ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చు కోవాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని అది ప్రయత్నించిన దాఖలాలు లేవు.

నిధుల కొరత దీనికి ప్రధాన కారణం అన్నది నిజమైనా... అందుకోసం ప్రభుత్వంతో అవసరమైతే తలపడాలని ఎవరూ అనుకోలేదు. ప్రసారభారతి సారథులుగా నియమితులయ్యేవారు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సన్నిహితులైనవారే ఉంటారు. ఆ మొహమాటం కొద్దీ వారు నోరెత్తరు. ఏ నియామకం చేయాలన్నా ప్రభుత్వామోదం కోసం ఎదురుచూడాల్సిందే. ఎవరైనా చొరవ తీసుకుని నిపుణులైనవారిని డైరెక్టర్‌ జనరళ్లుగా లేక బ్యూరో చీఫ్‌లుగా నియమిస్తే సమాచార మంత్రిగా ఉండేవారికి ఆగ్రహం కలుగుతుంది. ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతున్నది ఇదే.

ప్రసారభారతి చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాల ఆస్తులు ప్రసారభారతి సంస్థకు బదిలీ కావాలి. అదే జరిగుంటే ఆ ఆస్తుల్ని ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి, ప్రభుత్వంపై ఆధారపడే స్థితిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉండేది. ప్రసారభారతి ఏర్పాటైనప్పుడు ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు 48,000మంది సిబ్బంది బదిలీకాగా, ప్రస్తుతం ఉన్నవారి సంఖ్య 32,000 మాత్రమే. వారిలో చాలా భాగం కాంట్రాక్టు కింద పనిచేస్తున్నవారే.  

ఆకాశవాణి, దూరదర్శన్‌లు ఎన్ని పరిమితుల్లో పనిచేసినా వృత్తిపరంగా ఉన్న తులైనవారిని అందించాయి. సృజనాత్మక రంగాల్లో లబ్ధప్రతిష్టులైనవారు ఆ సంస్థల్లో పనిచేశారు. వాటికి విశ్వసనీయత కలిగించారు. నిజానికి ప్రసారభారతి ఏర్పడ్డాక ఇవి రెండూ మరింత ఉన్నతంగా ఎదిగి ఉండాల్సింది. ప్రసారభారతిని బీబీసీ స్థాయిలో తీర్చిదిద్దాలని, ఆకాశవాణి, దూరదర్శన్‌లను అగ్రగామి సంస్థ లుగా రూపొందించాలని కలలుగన్నవారు లేకపోలేదు. కానీ వారు త్వరలోనే నీర సించిపోయారు. ఏమీ చేయలేక అచేతనంగా ఉండిపోయారు. కారణాలేమైనా ఇప్పుడు ప్రసారభారతి బోర్డు ప్రభుత్వ సిఫార్సులను, సూచనలను తిప్పికొట్టింది.

మొత్తం కాంట్రాక్టు సిబ్బందిని తొలగించాలని హుకుం జారీ చేయడం, అందుకు ఉపయోగించిన భాష తమకు సమ్మతం కాదని తెలిపింది. ఈ ఉదంతంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రసారభారతి స్వయంప్రతిపత్తిని గౌరవించాలి. ప్రభుత్వ కర్ర పెత్తనం వల్ల ప్రయోజనం కలగకపోగా ప్రసారభారతి, దాంతోపాటు ఆకాశ వాణి, దూరదర్శన్‌లు మరింతగా దెబ్బతింటాయని తెలుసుకోవాలి.

మరిన్ని వార్తలు