ప్రియా వారియర్‌ (స్టూడెంట్‌) రాయని డైరీ

2 Sep, 2018 01:45 IST|Sakshi

మాధవ్‌ శింగరాజు

ప్రతి మనిషికీ లైఫ్‌లో ఏదో ఒక టైమ్‌లో  ఎవరో ఒకరి మోరల్‌ సపోర్ట్‌ అవసరమౌతుంది! సపోర్ట్‌ లేకపోయినా ధైర్యంగా బతికేయొచ్చు. మోరల్‌ సపోర్ట్‌ లేకపోతే.. బతికే ధైర్యమే ఉండదు. తిండికి అమ్మ సపోర్ట్, కాలేజ్‌కి నాన్న సపోర్ట్‌. అంతవరకు ఓకే. బయట ఏదైనా సమస్య వచ్చినప్పుడే.. ఇంట్లో అమ్మానాన్న ఇచ్చే సపోర్ట్‌ సరిపోదు. బయటి నుంచి మోరల్‌ సపోర్ట్‌ రావాలి. ఇంట్లో ఇంత తిని, కాలేజ్‌కి వెళ్లొచ్చి, మళ్లీ రాత్రికి ఇంత తింటే తిని, నిద్రొచ్చే వరకు వాట్సాప్‌ చూసుకుంటూ, తెల్లారే లేచి మళ్లీ కాలేజ్‌కి వెళ్లొస్తుంటే.. సమస్యలేం ఉండవు. ఇల్లు, కాలేజీ కాకుండా.. ఆడపిల్ల ఇంకో ప్లేస్‌లో కనిపిస్తేనే మోరల్‌ సపోర్ట్‌ కోసం చూడాల్సి వస్తుంది!

అలాగని ఇష్టమైన ప్లేస్‌లకు వెళ్లకుండా ఎలా?! సమాజం.. విలువల్ని పట్టుకుని వేలాడుతోందని, ఆడపిల్లలూ ఇంటిని పట్టుకుని వేలాడాలా?! కోర్టుకు రమ్మని సమన్లు వచ్చిన రోజు చూడాలి ఇంట్లో! ‘మన వంశంలో లేని పనులు ఎందుకంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎవరో కేసు వేశారు. పరువు పోయింది’ అన్నారు నాన్న. సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఎంప్లాయీ ఆయన. సోషల్‌ మీడియాలో నేను వైరల్‌ అయినందుకు ఆఫీస్‌లో అంతా ఆర్నెల్లుగా నాన్నకు కంగ్రాట్స్‌ చెబుతూనే ఉన్నారట. ‘నీకేమైనా సివిల్స్‌లో ర్యాంక్‌ వచ్చిందా తల్లీ.. వాళ్లలా కంగ్రాట్స్‌ చెబుతుంటే నేను థ్యాంక్స్‌ చెప్పడానికి!’ అన్నారు. ‘సివిల్స్‌లో ర్యాంక్‌ వస్తే వైరల్‌ అవుతారా.. నాన్నా..’ అనబోయాను.   ‘అయినా.. ఆ కన్ను గీటటం ఏంటే?’ అంది అమ్మ.. నా బుగ్గలు నొక్కేస్తూ. ఆ రోజు అమ్మ, నాన్న.. ఇద్దరూ నా గురించే చాలాసేపు మాట్లాడుకున్నారు. ‘సర్లే.. భయపడకు’ అన్నారు. అది నాకు ధైర్యం చెప్పినట్లు లేదు. వాళ్లకు వాళ్లు ధైర్యం చెప్పుకున్నట్లే ఉంది. నవ్వాను. ‘‘ఏంటే నవ్వుతున్నావ్‌?’’

అంది అమ్మ. ‘ఇంకెప్పుడూ కన్ను గీటనులే’ అని అమ్మకు కన్ను గీటాను. సపోర్ట్‌ ఇచ్చేవాళ్లు చుట్టూ చాలామందే ఉంటారు. మోరల్‌ సపోర్ట్‌ ఇచ్చేవాళ్లే.. కేరళలో ఒకరిద్దరు, ఢిల్లీలో ఇద్దరుముగ్గురు ఉంటారు. ఫస్ట్‌ నాకు మోరల్‌ సపోర్ట్‌ ఇచ్చింది రాహుల్‌ గాంధీ. ఇవ్వడం అంటే.. ఫోన్‌ చేసి ‘ఏం పర్లేదు ప్రియా’ అని చెప్పడం కాదు. సినిమా కోసం నేను చేసిన పనే, పార్లమెంటులో ఆయన చేశారు. కన్నుగీటారు. మనం చేసిన పనే మరొకరు చేస్తే అంతకుమించిన మోరల్‌ సపోర్ట్‌ ఏముంటుంది? నిన్న మళ్లీ ఢిల్లీ నుంచి సపోర్ట్‌ వచ్చింది. ఈసారి సుప్రీంకోర్టు నుంచి. ముగ్గురు జడ్జిలు నన్ను సపోర్ట్‌ చేశారు. ‘ఎవరో సినిమా తీస్తే, ఎవరో పాట పాడితే, ఎవరో అందులో యాక్ట్‌ చేస్తే.. వేరే పనేమీ లేనట్లు కేసు వెయ్యడమేనా?’ అని.. నాపై కేసు కొట్టేశారు. సుప్రీంకోర్టే కొట్టేశాక.. ఇక ఏ దేవుడి కోర్టు నన్ను దైవదూషణ కింద శిక్షిస్తుంది! ఈ నెలలో నా బర్త్‌డే. సుప్రీంకోర్టు నుంచి అడ్వాన్స్‌గా నాకు బర్త్‌డే విషెస్‌ వచ్చినంత ఆనందంగా ఉంది. ఈ నెలలోనే.. నేను కన్ను గీటిన సినిమా రిలీజ్‌ అవబోతోంది. ఈ నెలలోనే.. దుల్ఖర్‌తో నేను యాక్ట్‌ చేసిన సినిమా రిలీజ్‌ అవుతోంది. అవి కూడా నాకు బర్త్‌డే గిఫ్ట్‌లు. ఊహు.. బర్త్‌డే గిఫ్టులు కాదు.. బర్త్‌డే లే!

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు