రాహుల్‌ దబాయింపు

28 Aug, 2018 00:26 IST|Sakshi

మూడున్నర దశాబ్దాలనాడు ఢిల్లీలో పట్టపగలు ముష్కర మూకలు చెలరేగి నిష్కారణంగా 3,000 మంది సిక్కు ప్రజలను ఊచకోత కోసిన ఉదంతంలో తమ పార్టీ ప్రమేయమేమీ లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లండన్‌లో మొన్న శుక్రవారం ప్రకటించి తేనెతుట్టె కదిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ఆగ్రహోదగ్రులైన కొన్ని గుంపులు ఢిల్లీ వీధుల్లో స్వైర విహారం చేసి చిన్నా పెద్దా, ఆడ మగ అన్న విచక్షణ లేకుండా ఓటర్ల జాబితాలతో ఇల్లిల్లూ గాలిస్తూ దొరికిన వారిని దొరికి నట్టు పొట్టనబెట్టుకున్నాయి. హత్య జరిగిననాటినుంచి వరసగా మూడురోజులపాటు హత్యలు, అత్యాచారాలు కొనసాగాయి. అన్నిచోట్లా ఒకేవిధంగా ఈ దాడులు సాగాయంటేనే వీటి వెనక ఉన్న కుట్రను అర్ధం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నవారి అండదండలు లేకుండా ఇంతటి ఉన్మాదం చెల రేగడం అసంభవం. ఆ ఘోరకలికి కాంగ్రెస్‌ పార్టీలో, అధికార పీఠంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తు న్నవారే బాధ్యులని ప్రజాతంత్ర హక్కుల ప్రజాసంఘం(పీయూడీఆర్‌) పేర్లతో సహా నివేదిక ఇచ్చింది.

అప్పట్లో గద్దెనెక్కిన రాజీవ్‌గాంధీని ఈ ఊచకోత గురించి మీడియా ప్రశ్నించిన ప్పుడు ‘వటవృక్షం కూలినప్పుడు భూమి కంపించటం సహజమే’నంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన కుమారుడు కాంగ్రెస్‌ పార్టీకి అసలు సంబంధమే లేదని దబాయిస్తున్నారు. గతంతో పోలిస్తే ఏ విషయంపైన అయినా అవగాహన చేసుకుని మాట్లాడగలుగుతున్నారని, ప్రధాన ప్రత్యర్థి బీజేపీని ఇరకాటంలో పెడుతున్నారని ఈమధ్య కాలంలో రాహుల్‌కు పేరొచ్చింది. కానీ ఆ వంకన చరిత్రను వక్రీకరిస్తే, మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటే చెల్లదు. ఒక పక్క నరేంద్రమోదీ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు 2002లో జరిగిన గుజరాత్‌ నరమేథం గురించి తరచు విమర్శించే పార్టీ తన తప్పిదాలను మాత్రం కప్పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న తీరు విడ్డూరం కలిగిస్తుంది.  రాహుల్‌ బుకాయింపు తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నష్టనివారణ చర్యలు మొదలెట్టింది. ఆ విషాద ఉదంతాన్ని తాము ఇప్పటికి వేయిసార్లు ఖండించామని చెబుతోంది. ఆ ఉదంతం అత్యంత దురదృష్టకరమైనదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటించడాన్ని గుర్తు చేస్తోంది. సోనియాగాంధీ సైతం దానిపై విచారం వ్యక్తం చేశారని అంటున్నది.

కానీ సిక్కులకు ఇవి కాదు కావాల్సింది. తమవారిని అమానుషంగా పొట్టనబెట్టుకున్న ఉన్మాదులను కఠినంగా శిక్షించటం. ఆ పని ఇన్ని దశాబ్దాల్లో ఎందుకు జరగలేదు? అది జరగకపోగా నరమేథం సాగించినవారిని పార్టీ ఇంకా నెత్తిన పెట్టుకోవడానికి కారణమేమిటి? సిక్కుల ఊచకోతలో ప్రమేయం ఉన్నట్టు ఆరో పణలొచ్చిన కాంగ్రెస్‌ నాయకులు జగదీష్‌ టైట్లర్, సజ్జన్‌కుమార్‌లను 2009 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ప్రకటించినప్పుడు సిక్కుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో కాంగ్రెస్‌ వెనక్కి తగ్గింది. ఈ మాదిరి ఆరోపణలే వచ్చిన కమల్‌నాథ్‌ను 2016లో పంజాబ్‌ వ్యవహా రాల ఇంచార్జిగా నియమించినప్పుడు ఇలాగే జరిగింది. చివరకు ఆ నిర్ణయాన్ని కూడా ఉపసంహ రించుకుంది. వాటి సంగతలా ఉంచి  వందలాది కేసులు ఈనాటికీ అనిశ్చితిలోనే ఉన్నాయి. చాలా కేసుల విచారణ ఇంకా సెషన్స్‌ కోర్టు పరిధి దాటలేదు. దర్యాప్తు సంస్థల చేతగానితనం వల్ల సాక్ష్యా« దారాలన్నీ గల్లంతవుతున్నాయి. కొన్ని కేసుల్లో సాధారణ నిందితులకు శిక్షపడినా సూత్రధారులకు ఏమీ కాలేదు. వాటిపై అప్పీళ్లు దాఖలు చేయటం, మళ్లీ పై కోర్టులో విచారణలూ... ఇవన్నీ ఎడ తెగకుండా సాగుతున్నాయి. 

ఉన్మాద మూకల దాడిలో తమ ఆప్తుల్ని కోల్పోయి, ఆస్తులు ధ్వంసమై రోజుల తరబడి పస్తు లతో కాలం వెళ్లదీసి, ఈనాటికీ జీవితాలు కుదుటపడని బాధితులు వేలాదిమంది ఉన్నారు. ఈ ఊచకోత ఉదంతాలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి 2000 సంవత్సరంలో వాజపేయి ప్రభుత్వం నానావతి కమిషన్‌ ఏర్పాటు చేసింది. 2005లో యూపీఏ ప్రభుత్వ హయాంలో అది నివే దిక సమర్పించింది. దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌ కేవలం సిక్కులకు మాత్రమే కాదు... దేశానికి క్షమాపణ చెబుతున్నామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత మరో అయిదేళ్లు అంగుళం కూడా కదలిక లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక 2014 డిసెం బర్‌లో జీపీ మాథుర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను నియ మించి ఏ కేసు ఏ స్థాయిలో ఉందో చూస్తే తప్ప ఇవి తేలడం సాధ్యం కాదని ఆ కమిటీ తేల్చింది. ఆ తర్వాత సిట్‌ ఏర్పాటైంది. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేకపోయింది. చాలా కేసుల్లో రికా ర్డులు వెతకడమే పెద్ద సవాలుగా మారింది. చాలా కేసుల దర్యాప్తు ఇక ముగించటమే శ్రేయస్కర మని సిట్‌ తెలిపింది. దానిపై సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ థింగ్రా ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి ఆ కేసుల గురించి ఏం చేయవచ్చునో చెప్పమని కోరింది.

ఇలా పట్టప గలు నడివీధుల్లో సాగిన దురంతంలో దోషులెవరో అతీ గతీ తేలకపోవడానికి కారణం ఎవరు? దోషులెవరైనా శిక్ష పడాల్సిందేనని, చట్టపరమైన ప్రక్రియ సాగుతున్నదని రాహుల్‌ దబాయిస్తే సరిపోదు. దశాబ్దాలైనా అవి తేలకపోవటంలో తమ ప్రభుత్వాల నిర్వాకం ఎంతో, పార్టీగా తమ బాధ్యత ఏమేరకు ఉందో చెప్పాలి. చిత్రమేమంటే బీజేపీ సైతం ఢిల్లీ ఊచకోతపై రాజకీయంగా విమర్శలు గుప్పించటమే తప్ప దాని నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకున్నది లేదు. సిట్‌ పనితీరు గురించి వచ్చిన విమర్శలే ఇందుకు నిదర్శనం. అందరూ కలిసి బాధిత సిక్కు కుటుంబా లకు అన్యాయం చేశారు. కాలం గాయాలు మాన్పుతుందంటారు. కానీ సిక్కు హృదయాలకు తగిలిన గాయాలు చల్లారేవి కాదు. అవి నిత్యం జ్వలిస్తూనే ఉంటాయి. దోషులకు శిక్ష పడటం ఒక్కటే వారికి కావలిసింది. ఉత్తుత్తి హామీలు, ఓదార్పు మాటలు, ఖండనలు వారిని ఏమార్చలేవు. ఏళ్లు గడిచాయి గనుక ఏం చెప్పినా చెల్లుతుందనుకోవటం కుదరదు. ఆ సంగతి రాహుల్‌ గుర్తుంచు కోవాలి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైతు ఉసురు తీసిందెవరు?

గవర్నర్ల పంచాయతీ

మతిమాలిన దాడులు

మాటలకందని విషాదం

కాగ్‌ నివేదిక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

రొమాంటిక్‌   ఎన్‌ఆర్‌ఐ

మా ఆనందానికి కారణం అభిమానులే

అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి

గ్యాంగ్‌స్టర్‌ లవ్‌