విషపు రాతలు!

7 May, 2014 01:14 IST|Sakshi

సంపాదకీయం
 
 వయసు ముదిరాక దానంతటదే వచ్చేది వృద్ధాప్యం. పెద్దరికం రావాలంటే మాత్రం పరిణతిచెందాలి. యుక్తాయుక్త విచక్షణ తెలియాలి. జ్ఞానం తలకెక్కాలి. పరిధులను, పరిమితులను అర్ధం చేసుకోగలగాలి. లేనట్టయితే ‘ద్వితీయ బాల్యం’ కాస్తా పిల్లచేష్టలతో నిండిపోతుంది. సర్వులచేతా ఛీకొట్టించుకునే దుస్థితి ఏర్పడుతుంది. తన చావు జగత్ప్రళయంగా సంభావించుకుంటూ అందుమూలంగా ఏర్పడిన అభద్రతతో నిత్యమూ కుంగిపోతూ ఉన్న రామోజీరావు వర్తమాన అవస్థ అటువంటిదే. మరికొన్ని గంటల్లో సీమాంధ్ర ప్రాంతంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. 16వ తేదీన జరిగే లెక్కింపు సీమాంధ్రకు సంబంధించినంతవరకూ కేవల లాంఛనమే.  
 
 వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న అశేష ప్రజాదరణముందు కూటములు, కుమ్మక్కులు, కుట్రలు నిలవబోవని తిరుగులేకుండా తేలిపోయింది. చేయించుకున్న సర్వేలు చూసినా, ఎవరెవరో చేస్తున్న సర్వేలను గమనించినా వైఎస్సార్ కాంగ్రెస్ ఘనమైన మెజారిటీతో విజయకేతనం ఎగరేయబోతున్న జాడలు కనబడుతున్నాయి. అందుకే రామోజీ గంగవైలెత్తుతున్నారు. కనీసమైన విలువలైనా పాటించకుండా పేట్రేగిపోతున్నారు. తన పత్రిక ‘ఈనాడు’లో పేజీలకొద్దీ అబద్ధాలను పరుస్తున్నారు. విషపు రాతలతో ఊరేగుతున్నారు. పత్రిక చేతిలో ఉండ టాన్ని ప్రివిలే జ్‌గా, గిట్టనివారిని అప్రదిష్టపాలు చేయడానికి లభించిన లెసైన్స్‌గా రామోజీ భావిస్తున్నారు. అది తన జన్మహక్కనుకుంటున్నారు. అబద్ధాల్లో పుట్టి అబద్ధాలనే పుక్కిటపట్టి మూడున్నర దశాబ్దాలుగా రాష్ట్రంలో పాత్రికేయం పేరిట ఆయన సాగిస్తున్న ఈ బాపతు అరాచకం ఎన్నికలు సమీపిస్తున్న ఈవేళ మరింత వికృతరూపం తీసుకుంది.
 
 విశ్వసనీయత బొత్తిగాలేని నాయకుణ్ణి పెంచి చూపించడానికి, అతగాడివల్లే సీమాంధ్ర భవిష్యత్తు సముజ్వలంగా ప్రకాశిస్తుందని చెప్పడానికి గత రె ండు నెలలుగా రామోజీ నానా తంటాలూ పడుతున్నారు. చంద్రబాబని పేరున్నంతమాత్రాన ఇంద్రుడు, చంద్రుడని పొగిడితే జనం నమ్మేస్తారనుకుంటే అది సాధ్యంకాలేదు. ఆయనగారి తొమ్మిదేళ్ల పాలనాకాలంలోని చీడపీడల్ని పదేళ్లయినా ప్రజానీకం మర్చిపోలేకపోతున్నారు మరి! ఇక లాభంలేదని ఎవరెవరినో తీసుకొచ్చి ఆయనతో జట్టుకట్టించారు. అవకాశవాదాన్ని ఆశావాదంగా ఏమార్చి ఆకాశానికెత్తుదామనుకుంటే అదీ సాధ్యపడలేదు. వీటన్నిటి పర్యవసానంగా తనలో నిలువెల్లా పేరుకుపోయినా అసంతృప్తినీ, నిస్సహాయతనూ అక్షరాలుగా మలిచి జనంపైకి వదులుతున్నారు.
 
 పాత్రికేయ విలువలకు రామోజీ ఏనాడో తిలోదకాలిచ్చేశారు. మనిషికుండాల్సిన కనీస లక్షణాలను కూడా ఆయన మరిచిపోయారు. వార్ధక్యంలో చూపు మసకబారడం సహజం. లోచూపు సైతం లోపిస్తే మాత్రం మిగిలేది ఛీత్కారాలే. చనిపోయినవారు సమాధానం చెప్పుకోలేరని తెలిసికూడా దివంగత నేత వైఎస్‌పై గత కొన్ని రోజులుగా తన పత్రికలో రామోజీ తీవ్రమైన అభాండాలు వేస్తున్నారు. ఆయన హయాంలో జరిగిన ప్రతి పనికీ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ తన రాతలనే మహాప్రసా దంగా స్వీకరించి చార్జిషీట్లన్నీ నింపితే...మళ్లీ ఆ చార్జిషీట్లనే అరువు తెచ్చుకుని మరోసారి తన పేజీల్లో పరుస్తున్న రామోజీ వికృత చేష్ట వింతగొలుపుతున్నది. ఈ ‘రీ సైక్లింగ్’ ఆయన నిస్సహాయతకే... ఆయన నిలబెట్టాలని విఫలయత్నంచేస్తున్న సైకిల్ పార్టీ దురవస్థకే అద్దంపడు తున్నది. వారి ఉమ్మడి దివాలాకోరుతనాన్ని పట్టిచూపుతున్నది.
 
  సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్నవేళ జరుగుతున్న ఈ ఎన్నికల్లో బాబును తిరుగులేని నాయకుడిగా చూపాలని రామోజీ వేస్తున్న పిల్లిమొగ్గలు వినోదం కలిగిస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే విదేశీ పెట్టుబడులు మరిచిపోవాల్సిందేనట! అవినీతి ఆరోపణలే అందుకు కారణమట!! నిజానికి కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఆదినుంచీ బాబే. తనపై పుంఖానుపుంఖాలుగా వస్తున్న అవినీతి ఆరోపణలపై ఏ తరహా విచారణలూ జరగకుండా స్టేలు తెచ్చుకుని కాలక్షేపం చేస్తూ...అందుకు ప్రతిఫలంగా ఆపత్స మయాల్లో ఇక్కడా, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను ఆదుకుని ఒడ్డెక్కించిందీ బాబు కాదా? తాను తటస్థమైన పత్రికాధిపతే అయితే...తనకెలాంటి రహస్య రాజకీయ ప్రయోజనాలూ లేకపోతే...‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించాల’ని చెప్పే తన మాటలపై తనకు విశ్వాసముంటే వీటన్నిటినీ రామోజీ బయటపెట్టరెందుకని? సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వం కేంద్రంతో సానుకూలంగా వ్యవహరించాలని మరో కథనం. లేకుంటే సాయం అందదట... అభివృద్ధి నిలిచిపోతుందట!
 
 ఈ రాతలకు ఒక పరిమితన్నదే లేదు. హస్తినలో కొలువుదీరిన నేతలకు ఇష్టులైనవారినే ఇక్కడా ఎంచుకోవాలని బ్లాక్‌మెయిలింగ్! అనుభవ మున్న పాలకుడుం టేనే సజావుగా నడుస్తుందని మరో పాచిక. విభజన ప్రక్రియ సాగుతున్న సమయంలో తాను విభజనకు అనుకూలమనో, వ్యతిరేకమనో స్పష్టంగా చెప్పని అశక్తుడు బాబును ఇవాళ సమర్ధత కలిగిన నాయకుడిగా చూపేందుకు రామోజీ ఆపసోపాలు పడు తున్నారు. సంక్షోభ సమయాల్లో తటస్థతను నటించే భీరువు నాయకుడెలా అవుతాడన్న ఇంగితజ్ఞానం రామోజీకి లేకపోయినా, ఆ ఎరుక సీమాంధ్ర ప్రజలకు పుష్కలంగా ఉన్నది. అందువల్లే బాబును, ఆయనతో జతకట్టి వచ్చినవారందరినీ టోకున తిరస్కరించేందుకు వారు సంసిద్ధులై ఉన్నారు. ఆ సంకల్పాన్ని నీరుగార్చడం రామోజీ తరంకాదు.

 


 

మరిన్ని వార్తలు