కొరియాల యుగళ గీతం!

28 Apr, 2018 01:00 IST|Sakshi
ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్, దక్షిణా కొరియా అధినేత మూన్‌ జే–ఇన్‌

ఊహకందని ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలుగు తాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్, దక్షిణా కొరియా అధినేత మూన్‌ జే–ఇన్‌ మధ్య శిఖరాగ్ర చర్చలకు అంగీకారం కుదిరిందని గత నెల 6న తొలిసారి ప్రకటన వెలువడినప్పుడు అందరూ అలాంటి సంభ్రమాశ్చర్యాలకే లోనయ్యారు. ఇది కలా నిజమా అనుకున్నారు. అసంభవం అనుకున్నది శుక్రవారం సాకార మైంది. ఇద్దరు అధినేతలూ శిఖరాగ్ర చర్చల్లో పాల్గొని రెండు కొరియాల మధ్యా యుద్ధం ఉండబోదని ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతలు, సమైక్యత వర్ధిల్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని ప్రతినబూనారు.

2016 జనవరితో మొదలుపెట్టి గత ఏడాది డిసెంబర్‌ వరకూ అడపా దడపా జరిపే అణ్వాయుధ పరీ క్షలతో, క్షిపణి పరీక్షలతో పొరుగునున్న దక్షిణ కొరియా, జపాన్‌లకూ... అగ్రరాజ్య మైన అమెరికాకు నిద్ర లేకుండా చేసిన కిమ్‌ ఇలాంటి శిఖరాగ్ర సమావేశానికొస్తా రని, ఇంతటి సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తారని ఎవరూ అనుకోలేదు. నిరు డంతా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కూ, కిమ్‌కూ మధ్య తీవ్ర స్థాయి వాగ్యుద్ధం కొనసాగింది. దాంతోపాటు ఉత్తర కొరియాపై ఆంక్షల తీవ్రత పెరిగింది. తమ దేశానికి ముప్పు కలిగించాలని చూస్తే కనీ వినీ ఎరుగని విధ్వంసం చవి చూడా ల్సివస్తుందని ట్రంప్‌ హెచ్చరిస్తే... మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి హ్వాసంగ్‌–12ను ప్రయోగించడం ద్వారా ఉత్తరకొరియా దానికి బదులిచ్చింది.

2,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆ క్షిపణి తమ గగనతలం మీదుగా వెళ్లిందని నిర్ధారించు కున్న జపాన్‌ ఒక్కసారిగా వణికిపోయింది. అమెరికాను సైతం ధ్వంసం చేయగల సత్తా తమకున్నదని కిమ్‌ హెచ్చరించారు. ట్రంప్‌ చేసే దూషణలకు ఎప్పటికప్పుడు అదే పరిభాషలో బదులిస్తూ బెదిరింపులకు తాను లొంగనుగాక లొంగనని ఆయన తేటతెల్లం చేశారు. తమది చిన్న దేశమైనా, అమెరికాతో పోలిస్తే సిరిసంపదలు అంతంతమాత్రమే అయినా ఆత్మగౌరవం పుష్కలంగా ఉన్నదని, దాన్ని కాపాడు కునేందుకు అవసరమైనన్ని అణు బాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయని కిమ్‌ గత రెండేళ్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా తెలియజెబుతూనే వచ్చారు. పర్యవసానంగా బెదిరింపుల పరిభాష మారింది.

ఉత్తర కొరియా సంపూర్ణంగా అణ్వాయుధ రహితం కావడం మినహా మరేదీ తమకు సమ్మతం కాదని, అందుకు సిద్ధపడే వరకూ ఆ దేశంతో ఎలాంటి చర్చలూ ఉండబోవని ప్రకటిస్తూ వచ్చిన అమెరికా వెనక్కి తగ్గింది. శాంతి చర్చలకు మార్గం సుగమమైంది. రాజకీయ సంకల్పం ఉంటే దేన్నయినా సాధించవచ్చునని ఉభయ కొరియాల మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలు రుజువు చేశాయి. ఈ పరిణామం పర్యవసానంగా ఇక శాంతి ఏర్పడటం ఖాయమేనని చెప్పలేం. ఎందుకంటే కొరియాల మధ్య ఉన్న శత్రుత్వం సాధారణమైంది కాదు. గత 68 ఏళ్లుగా ఆ రెండూ సాంకేతికంగా చూస్తే యుద్ధంలోనే ఉన్నాయి. 1950లో మొదలైన యుద్ధం మూడేళ్లు కొనసాగి ఇరు వైపులా దాదాపు 12 లక్షలమంది మరణించాక 1953లో యుద్ధ విరమణ సంధి కుదిరినా దాన్ని దక్షిణ కొరియా గుర్తించలేదు.

నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ చొరవతో కుదిరిన ఈ  సంధిపై అమెరికా, ఉత్తర కొరియా, చైనాలు మాత్రమే సంతకాలు చేశాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే అమెరికా దాన్ని ఉల్లం ఘించింది. ద్వీపకల్పంలోకి విధ్వంసకర ఆయుధాలను తరలించరాదన్న నిబం ధనను ఉల్లంఘించి దక్షిణ కొరియాలో అణ్వాయుధాలను మోహరించింది. ఒక పక్క అలా చేస్తూనే ఉత్తర కొరియా నిరాయుధంగా ఉండాలని ఆశించింది. ఆ దేశం ప్లుటోనియం ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నదన్న సమాచారం అందాక 1994లో నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ దాన్ని ఆపేందుకు చర్చలు జరిపారు. ఆ ప్లుటోనియంను అణు విద్యుత్‌ కోసం వినియోగించేందుకు అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఒప్పందం కుదిరింది.

దీర్ఘశ్రేణి క్షిపణుల ఉత్పత్తిని కూడా నిలిపేసేందుకు అంగీకారం కుదరబోతుండగా అమెరికాలో 2000 సంవత్సరంలో జార్జి బుష్‌ హయాం ప్రారంభమైంది. ఆయన బెదిరింపుల పర్వానికి తెరతీశారు. 1994నాటి ఒప్పందాన్ని అటకెక్కించారు. ఉత్తరకొరియా దొంగచాటుగా యురే నియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపిస్తూ ఆ దేశంపై ఆంక్షలను తీవ్రంచేశారు. ఇరాక్‌ దురాక్రమణలో అది నిండా మునిగి ఉండగా ఉత్తర కొరియా పూర్తి స్థాయి అణ్వాయుధ దేశంగా రూపుదిద్దుకుంది. ఇన్నేళ్లుగా దక్షిణ కొరియా అమెరికా, జపాన్‌లతో కలిసి పలుమార్లు సైనిక, నావికా దళ విన్యాసాలు నిర్వ హించింది. పలుమార్లు యుద్ధ సన్నాహాలు చేసింది. ఈ కాలమంతా చైనా ఉత్తర కొరియాకు అండగా నిలిచింది.  


అందువల్లనే చైనా ప్రమేయంలేని ఎలాంటి శాంతి ఒప్పందమైనా ఫలి తాన్నివ్వదు. ఈ శిఖరాగ్ర చర్చలను చైనా సహజంగానే స్వాగతించింది. దీనికి కొనసాగింపుగా జరిగే చర్చల్లో తన పాత్రేమిటో తేల్చి చెప్పాలని అది ఎదురుచూస్తోంది. గత నెలలో కిమ్‌ను తమ దేశానికి ఆహ్వానించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఇప్పటికే ఆ సంగతిని తేటతెల్లం చేశారు. 1953నాటి యుద్ధ విరమణ సంధిలో చైనా భాగస్వామి. దక్షిణ కొరియానుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, అక్కడ అణ్వాయుధాలను తొలగించేవరకూ ద్వీపకల్పంలో శాంతి సాధ్యం కాదని చైనా వాదిస్తోంది.

ఉభయ కొరియాల విలీనానికైనా, వాటి మధ్య కుదిరే శాంతి ఒప్పందానికైనా ఇదే షరతు కావాలని చెబుతోంది. లేకుంటే అది అంతిమంగా తన భద్రతకు ముప్పు కలిగిస్తుందని దానికి తెలుసు. వచ్చే జూన్‌లో ట్రంప్, కిమ్‌లు కూడా సమావేశం కాబోతున్నారు. కాలం చెల్లిన ఎత్తుగడలకు అమెరికా ఇకపై స్వస్తి చెప్పి కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే, ఈ ప్రాంతం నుంచి అణ్వాయుధాల తొల గింపునకూ, తన దళాల ఉపసంహరణకూ అంగీకరిస్తే ఒక సంక్లిష్ట సమస్య పరి ష్కారమవుతుంది. 65 ఏళ్లనాటి తన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి అమెరికాకు ఇదొక మంచి అవకాశం.
 

మరిన్ని వార్తలు