దుర్గాశక్తి... బహువచనం!

7 Aug, 2013 00:03 IST|Sakshi

సంపాదకీయం : చదువులో చురుగ్గా ఉన్నారని, నాయకత్వ లక్షణాలు దండిగా ఉన్నాయని, సమకాలీన సమస్యలపై అవగాహన ఉన్నదని, అవి అపరిష్కృతంగా మిగిలిపోతున్న వైనంపై ఆగ్రహం ఉన్నదని, అందుకోసం ఏదో చేయాలన్న తపన వారి అంతరాంతరాల్లో జ్వలిస్తున్నదని అనుకునే యువతీయువకులు సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని చాలా మంది సలహాలిస్తుంటారు. సవాళ్లను స్వీకరించే తత్వమూ, సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను వెదకగల సామర్ధ్యమూ, అంకితభావంతో పనిచేసే సంసిద్ధతా ఉండేవారివల్ల ఈ సమాజం మెరుగుపడుతుందని అందరూ నమ్ముతారు.
 
 సివిల్ సర్వీస్ అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించే జటిలమైన పరీక్షలకెళ్లేవారంతా ఈ లక్షణాలన్నీ తమకున్నాయని, ఇందులో కృతార్థులమై తమ సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి వచ్చే దురహంకారంతో తమ మాటే శాసనంగా చలామణీ కావాలని ఆశించే పాలకులున్నప్పుడు ఇలాంటి యువతరం కలలన్నీ కల్లలుగా మిగిలిపోతాయి. వివిధ రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో కొందరు ఐఏఎస్ అధికారులపై అధికారంలో ఉన్నవారు సాగిస్తున్న ధాష్టీకం చూస్తే కలిగే అభిప్రాయం ఇదే. ఇలాంటివారి ఏలుబడిలో ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యేవారికి రెండే ప్రత్యామ్నాయాలుం టున్నాయి-అలాంటి పాలకుల అభీష్టానికి తలవంచడం లేదా వారి ఆగ్రహానికి గురై ఎలాంటి ప్రాధాన్యతా లేని పోస్టుల్లో వృధాగా పొద్దుపుచ్చడం.
 
 ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా జిల్లా గౌతంబుద్ధ నగర్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగపాల్‌ని సస్పెండ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐఏఎస్‌ల పరిస్థితిని మరోసారి కళ్లకు కడుతోంది. యమునా నదిలో అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్న మాఫియా ముఠాలపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ ప్రాంతం నుంచి నెలకు కనిష్టంగా చూస్తే రూ.200 కోట్ల విలువైన ఇసుక తరలి పోతోందని ఒక అంచనా. ఇసుక తవ్వకాలవల్ల యమునా నది కోతకు గురై పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఎందరో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
 
  పర్యవసానంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పరిచింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తీరా దుర్గాశక్తి చర్యకు ఉపక్రమించేసరికి ఆమెను సస్పెండ్ చేసింది. గౌతంబుద్ధ నగర్‌లో ఒక మసీదు కోసం నిర్మించిన గోడను కూల్చేయడంవల్లా, ఆ చర్య మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందువల్లా ఆమెను సస్పెండ్ చేయాల్సివచ్చిందని అఖిలేష్ ఇస్తున్న సంజాయిషీ వాస్తవాలను ప్రతిబింబించదు. ఆ ఉదంతంతో సంబంధమున్న అధికారి పేరు జేవర్ అని తాజా సమాచారం వెల్లడిస్తున్నది. అఖిలేష్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ఐఏఎస్‌లను 800 సార్లు బదిలీ చేశారు. అంటే, సగటున నెలకు 50 బదిలీలన్నమాట. యూపీలో ఇది అఖిలేష్ పాలనతోనే ప్రారంభమైన ధోరణికాదు. అంతక్రితం పాలించినవారూ ఈ తరహాలోనే ప్రవర్తించారు.
 
 నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే ఐఏఎస్, ఐపీఎస్‌లపై కొంచెం హెచ్చుతగ్గుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల పాలకుల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రాకూ, రియల్‌ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కూ మధ్య సాగిన లావాదేవీలపై కూపీ లాగిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో బదిలీలతో ఎలా వేధించిందో ఈ దేశం చూసింది.  కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై పాత కేసును తిరగదోడారన్న నెపంతో  రాజస్థాన్ ప్రభుత్వం జైసల్మేర్ జిల్లా ఎస్‌పీని రెండురోజులక్రితం బదిలీచేసింది. ఆ బదిలీపై ఆ జిల్లా భగ్గుమంటోంది. జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్‌ది మరో కథ. ఢిల్లీలో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆమెను రెండు నెలలు తిరక్కుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది.
 
  ఇందుకు కారణం చాలా చిన్నది. ప్రణాళికా సంఘంతో చర్చలకోసం ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆమె ఖరీదైన భోజనం పెట్టించలేదని, ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేయలేదని ఆరోపణలు. మన రాష్ట్రం విషయానికే వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనాకాలంలో కీలకపదవుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను ఇప్పుడు ఎలా వేధిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. తగిన ఆధారాలున్న అధికారులపై చర్య తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే దర్యాప్తు పేరిట సీబీఐ తమను అవినీతిపరులుగా, ప్రజాధనాన్ని అపహరించినవారిగా మీడియాకు లీకులు ఇస్తున్న తీరు సమంజసంగా లేదని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యవర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. అక్రమ నిర్ణయాలనుకున్న ప్రాజెక్టులను కొనసాగిస్తూ, అందులో భాగస్వాములమైన తమను మాత్రం అక్రమాలకు పాల్పడ్డవారిగా చిత్రించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది.
 
 తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు, తమ భాగస్వామ్యపక్షాల ప్రభుత్వాలు ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇంతగా వేధిస్తుంటే ఏనాడూ నోరెత్తని సోనియాగాంధీ దుర్గాశక్తి విషయంలో ఎక్కడలేని ఆసక్తినీ ప్రదర్శించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని కోరడం మన నేతల ద్వంద్వ నీతికి నిదర్శనం. ఖేమ్కా విషయంలోనూ ఆమె ఇలాగే స్పందించివుంటే అందరూ హర్షించేవారు. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఈ సర్వీసులకు ఎంపికైన అధికారులు స్వతంత్రంగా, నిర్భయంగా వ్యవహరించ గలిగితేనే పటిష్టమైన దేశం నిర్మాణమవుతుందని అభిలషించారు. కానీ, అలాంటి అధికారులను పాలకులు వేధించే సంస్కృతి రాను రాను పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట పడకపోతే, నిజాయితీగా వ్యవహరించే అధికారులను ఆదరించకపోతే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుందని మన నేతలు గ్రహించడం అవసరం.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా