వెలుగునీడల ‘గణతంత్రం’

26 Jan, 2019 00:27 IST|Sakshi

దేశంలో గణతంత్ర వ్యవస్థ ఆవిర్భవించి నేటికి డబ్భైయ్యేళ్లవుతోంది. బ్రిటిష్‌ వలసపాలకులపై సాగిన అహింసాయుత సమరానికి నేతృత్వంవహించి పరదాస్య శృంఖలాలు తెగిపడేందుకు దోహదపడిన మహాత్ముడి 150వ జయంతి కూడా ఈ ఏడాదే రాబోతోంది. భారతావని సమై క్యంగా, సమష్టిగా సాధించుకున్న స్వరాజ్యాన్ని సురాజ్య స్థాపన దిశగా తీసుకెళ్లడానికి ఉద్దేశించిన భారత రాజ్యాంగం ఏర్పడి ఏడు పదులవుతున్న ఈ సందర్భంలో సమీక్షించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూల స్తంభాలుగా రూపొందిన ఆ రాజ్యాంగం మన గణతంత్ర వ్యవస్థ ప్రగతి పథ ప్రస్థానానికి ఎంతవరకూ తోడ్పడిందో...సామాజిక అసమానతలను, పెత్తందారీ పోకడలను ఏమేరకు తరిమికొట్టగలిగామో... ఆకలి, అనారోగ్యాలను ఎంతవరకూ నిర్మూలించగలిగామో... మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో సాధించినదెంతో చర్చించాల్సిన సందర్భమిది. మిగిలినవాటి మాటెలా ఉన్నా ప్రజాస్వామ్యం పేరు చెప్పి మన దేశంలో క్రమం తప్పకుండా జరుగుతున్నవి ఎన్నికలు మాత్రమే. ఇతరాలన్నీ సామాన్యులకు దేవతావస్త్రాలుగానే మిగిలిపోతున్నాయి.  

గణతంత్ర వ్యవస్థ ఆవిర్భావంనాటికే మన దేశం ఎన్నో క్లేశాలను చవిచూసింది. ప్రజల్ని మతం పేరిట విభజించాలని చూశారు. లేనిపోని వదంతులు సృష్టించి పరస్పర అవిశ్వాసాన్ని, అపనమ్మ కాన్ని నాటేందుకు ప్రయత్నించారు. ఈ దేశం సమైక్యంగా ముందుకెళ్లగలదా... అసలు మనుగడ సాగించగలదా అని ప్రపంచవ్యాప్తంగా పలువురు సందేహపడే స్థాయిలో ఇదంతా కొనసాగింది. అంతటి ఉద్రిక్త పరిస్థితుల్లోనే మన రాజ్యాంగ నిర్ణాయక సభ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలో చర్చోపచర్చలు సాగించి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించింది. జాతికి దిశానిర్దేశం చేసింది. వలసపాలకులు ఈ దేశాన్ని వదిలిపోతూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. తమ ప్రమేయంలేని ఈ దేశం పరస్పర ఘర్షణల్లో అతి త్వరలో విచ్ఛిన్న మైపోతుందని జోస్యం చెప్పారు. భారతీయులకు పాలన చేతగాదన్నారు. గణతంత్ర వ్యవస్థ స్థాపన కలగానే మిగులుతుందని, ఏర్పడినా అది ఎంతోకాలం మనుగడ సాగించలేదని లెక్కలేశారు. కానీ వారివన్నీ అక్కసు మాటలేనని మనం రుజువు చేయగలిగాం. సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. కానీ వాటినే చూసి మురుస్తూ వైఫల్యాలను గమనించకపోతే అది ఆత్మవంచన అవుతుంది.

ఒకప్పుడు తిండిగింజలకు కటకటలాడిన దేశం ఇప్పుడు స్వయంసమృద్ధి సాధించడం మాత్రమే కాదు.. భారీయెత్తున ఎగుమతులు చేస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం సాధించిన పురోగతి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ప్రాణాంతక వ్యాధుల్ని చెప్పుకోదగ్గ రీతిలో అదుపు చేయగలిగాం. మన దేశం చెప్పుకోదగ్గ ఆర్థిక శక్తిగా ఎదిగింది. కానీ ఎన్నో రంగాల్లో మన వైఫల్యాలు సిగ్గుపడేలా చేస్తున్నాయి. ప్రజాజీవన రంగంలో నైతిక విలువలు అడుగంటుతున్న తీరు అన్ని స్థాయిల్లోనూ ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సినవారే దోహదపడుతున్న వైనం దిగ్భ్రాం తిగొలుపుతోంది. కాసుల లాలసతో, పదవీవ్యామోహంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అధికార పార్టీ పంచన చేరడానికి ఏమాత్రం తటపటాయించని చవకబారు రాజకీయ నేతల హవా ఇప్పుడు నడుస్తోంది. ఇలాంటివారి వల్ల మన చట్టసభలు చట్టుబండలవుతున్నాయి. జవాబుదారీతనం కొరవ డుతోంది. చట్టసభల తీరుతెన్నులిలా ఉంటే వాటి వెలుపల అరాచకం రాజ్యమేలుతోంది.

గణతంత్ర దినోత్సవానికి రెండురోజుల ముందు హరియాణాలోని రోహ్‌తక్‌ సమీపంలో నౌషాద్‌ మహమ్మద్‌ అనే 24 ఏళ్ల యువకుణ్ణి గోరక్షక ముఠా కరెంటు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టి హింసిస్తే... అదే మని ప్రశ్నించినవారు లేరు. రెండు గంటల తర్వాత ఆ ప్రాంతాని కొచ్చిన పోలీసులు అతణ్ణి ఆసు పత్రికి తీసుకెళ్లకపోగా పోలీస్‌స్టేషన్‌లో గొలుసులతో బంధించారు. ఉపాధి అవకాశాల లేమి యువ తను ఇలా సంఘవిద్రోహశక్తులుగా మారడానికి పురిగొల్పుతోంది. మన వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 7.4 శాతం ఉండొచ్చునని ఐక్యరాజ్య సమితి నివేదిక రెండురోజుల క్రితం అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) కూడా దాన్ని 7.5 వరకూ ఉండొచ్చు నని లెక్కేసింది. కానీ విచారించదగ్గ విషయమేమంటే వృద్ధిరేటుకు అనుగుణంగా మన దేశంలో ఉద్యోగిత పెరగడం లేదు. ‘సమ్మిళిత వృద్ధి’ దరిదాపుల్లో కనబడటం లేదు. 

యువతలో నైపుణ్యాన్ని పెంచుతామని గత యూపీఏ ప్రభుత్వం చెప్పింది. 50 కోట్లమందిని నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రారంభించిన కార్యక్రమాలను ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా కొనసాగించింది. అయిదారేళ్లు గడిచాక చూస్తే ఏముంది... నిపుణులు పెరిగారుగానీ, వారికి ఉద్యో గాల్లేవు. యువత ఉద్యోగాల వేట సాగించడం కాదు... తామే ఉద్యోగాలను సృష్టించాలంటూ ఆ తర్వాత ఊదరగొట్టారు. కానీ అందుకు అనువైన పథకాల అమలూ సక్రమంగా లేదు. సాగు గిట్టు బాటు కాక, నానాటికీ రుణాల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అంతంతమాత్రమే. అయిదేళ్ల లోపు పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం ఉపశమనం కలిగించేదే. కానీ ఏడాదిలోపు శిశు మరణాలను, పసికందుల మరణాలను అరికట్టడంలో చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించలేకపోతున్నాం. ఆర్థిక వ్యత్యా సాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి. అసమ అభివృద్ధి మన సమర్థతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికీ నాణ్యమైన విద్య అత్యధికులకు అందుబాటులో లేదు. ఫలితంగా పేదరికమే కోట్లాది కుటుంబాల శాశ్వతంగా చిరునామాగా మారింది. అన్ని రంగాల్లోనూ మాఫియాలదే పైచేయి అవుతోంది. అవి నీతి ఊడలు దిగింది. ఈ దుస్థితి మారాలంటే, మన రాజ్యాంగ నిర్మాతల కలలు ఫలించాలంటే ఆత్మవిమర్శ అవసరం. దిద్దుబాట్లు కీలకం. అందుకు ఈ గణతంత్ర దినోత్సవం ఒక సందర్భం కావాలని ఆశిద్దాం. 

మరిన్ని వార్తలు