బాల్యపు స్మృతుల ప్రతిరూపం-రెక్కలపిల్ల

19 Sep, 2019 21:09 IST|Sakshi

1980, 90, ఈ శతాబ్ది ఆరంభ దశకాల్లోని పిల్లలు ఎంతైనా అదృష్టవంతులని చెప్పాలి. వారి జీవితాల్లో ఆటలున్నాయి. పాటలున్నాయి. అందమైన స్నేహాలున్నాయి. ప్రకృతితో పెనవేసుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. బాల్యపు మధురిమలను అందంగా అమాయకంగా తమలోకి ఒంపుకున్న రోజులున్నాయి. బడిలోని విద్యతోపాటు సమాజంలో తోటి పిల్లలతో ఆడిపాడి- కులమత వివక్షలకు అతీతంగా పెనవేసుపోయి.. మనిషిలో సంకుచిత్వాన్ని నాటి బాల్యం ఎద్దేవా చేసింది. అమాయకంగా అందరినీ కలుపుకొనిపోయింది. మనుషులకు గీతల్లేవన్నది. మతాల్లేవన్నది. ధనిక-బీద భేదాల్లేవన్నది. దోస్తులతో గుంపులుకట్టి.. అప్పటి బచ్‌పనా తనవారి కోసం ఒక చిన్నసైజు గ్యాంగ్‌వారే చేసింది. మరీ అప్పటి పిల్లలు ఇప్పటి జనరేషన్‌లా ట్రెండీ కాదు. వారికి సెల్‌ఫోన్‌ తెలియదు. టీవీతో పరిచయం అంతంతమాత్రమే. స్కూలు అయిపోగానే ఇంటికి పరిమితమైపోయి.. ఐదంగుళాల తెరలోకి తల దూర్చి అదే లోకమనుకునే చెడ్డలవాటు అప్పటి పిల్లలకు తెలియదు. అందుకే స్కూలు అయిపోగానే అప్పటి పిల్లలు బ్యాగులు ఇంటిలో పడేసి.. స్వేచ్ఛాగా రెక్కలు విడిచిన పక్షుల్లా వీధుల్లోకి పరిగెత్తుకువచ్చేవారు. తోటి పక్షులతో కలిసి కిచకిచమంటూ అలా స్వేచ్ఛగా విహారానికి వెళ్లేవారు. ఆడేవారు. పాడేవారు. కథలు చెప్పుకునేవారు. అందులో దెయ్యాల కథలు, రాకుమారుల కథలు ఉండేవి. అమ్మలు-నాన్నలు, అమ్మలక్కలు చెప్పుకునే విషయాలుండేవి. ఆటలుండేవి. ఆటల్లో దెబ్బలుండేవి. ఆ ఆటల్లో తాకిన దెబ్బలు దాచుకొని.. దాచుకొని అమ్మకు తెలియకుండా ఇంట్లో నక్కి పండుకునే రోజులుండేవి. 

ఎంత విచిత్రమైనది బాల్యం. అదొక మాయాలమరాఠీ. ఎన్నో విచిత్రాలు చూపించి.. అమాంతం కరిగిపోయింది. మంత్రదండంలా, ఇంద్రజాలికుడిలా ఎన్నో అద్భుతాలను చూపించి మాయమైంది. స్వచ్ఛమైన అమాయకత్వం బాల్యం. లోకం తెలుసుకోవాలన్న తపన బాల్యం. నిరంతరం ఏదో కొత్త విషయం కోసం ఆరాటపడి ఏది తెల్సినా అదో వింతలా అబ్బురపడే సంచార సహజనైజం బాల్యం. అదొక వజ్రాలగని. తవ్వి చూడండి ఎన్నో అద్భుతమైన మణులు దొరుకుతాయి.  జీవితంలోకి మరెంతో వెలుగు వస్తోంది ఆ రంగురంగుల మణుల నుంచి..

అలా బాల్యాన్ని తవ్వితీసి.. అందులోని రంగురంగు మణులను, అద్భుతాలను, చెణుకులను, అల్లరిని, ఆటపాటలను, అమ్మనాన్న, స్నేహితులు, చుట్టు ఉన్న సమాజాన్ని అప్పటి కళ్లతో అంతేగా అమాయకంగా, అంతే స్వచ్ఛంగా అందిస్తే అది రెక్కలపిల్ల పుస్తకమవుతుంది. 56 కథలు, 260 పేజీలు.. ఓ అమాయకపు బాల్యం. ఏ కల్మషమెరుగని పసితనం స్వచ్ఛమైన రెక్కలు తొడిగే ఆకాశమంతా విహరిస్తే.. ఈ రెక్కలపిల్ల అవుతుందేమో. బాల్యం రెక్కలు తొడుగుతూ తొలి అడుగులు వేస్తున్న దశలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి మధ్య ఓ చిన్నారి తన దోస్తులతో ఒక గ్యాంగ్‌లా ఏర్పడి చేసిన విన్యాసాలు, మనషుల పట్ల ప్రేమతో కూడిన బాల్యపు స్మృతులు, చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకుంటూ.. దానిపట్ల స్పందించే తీరు.. దాని ప్రశ్నలు..  అన్నింటికీ మించి స్వచ్చమైన అమాయకత్వం..  ఇది రెక్కలపిల్లలోని కథల వరుస. 

ఈ పుస్తకంలోని అన్ని కథల్లోనూ బాల్యపు ఫ్లేవర్‌ ఉంటుంది. అన్ని చదివింపజేస్తాయి. చాలావరకు కథలు కథనాత్మకంగా ఉండి చివరివరకూ ఏం జరుగుతుందా? అన్నంత ఆసక్తి రేపుతాయి. గడుసుతనం, పెంకితనం, అనుకుంటే ఏదైనా చేసే బాల్యపు మొండితనం ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథల్లో చాలాచోట్ల ప్రశ్నలు చిత్రంగా ఉంటాయి. బాల్యపు ప్రశ్నలు. అమాయకపు ప్రశ్నలు. వాటికి లభించే సమాధానాలు కూడా చిత్రమైనవే అనిపిస్తాయి. పున్నాగ పూలు, వీరబాబు, పడవ ప్రయాణం, వాన కోసం తపస్సు, యాది-జారుడుబండ, ఓ స్త్రీ రేపు రా, జ్వాలాతోరణం కథలు నాకు బాగా నచ్చాయి. యాదగిరి-చిల్లర, రంగ-కలువపూలు, ఓకులు-బెచ్చాలు, అవ్వా-దీపావళి కూడా మంచి కథలు. పిల్లలు అన్ని మతాలను, దేవుళ్లను సమానంగా చూస్తారనడానికి ఇందులో హిందు, ముస్లిం, క్రైస్తవ నేపథ్యాలతో ఉన్న కథలు చాటుతాయి. ఓ స్త్రీ రేపు రా కథలో తన ఇంటి మీద రాయకుండా, తన ఫ్రెండ్‌ పద్మ ఇంటి మీద రాసి ఉన్న `ఓ స్త్రీ రేపు రా` అన్నది చెరిపేయడం.. దానివెనుక ఉన్న కారణం, జ్వాలాతోరణం కథలో గుడ్డివాడిగా చెప్పి అడుక్కుంటున్న తాతతో జ్వాలాతోరణం కింద నడిపించడం వంటి ట్విస్టులు, లారీ- ఇల్లు కథలో తండ్రికి ఇంటికి రాకపోతే.. రాత్రిపూట ఒంటరిగా బజారు వరకు ధైర్యంగా వెళ్లిరావడం వంటివి కొసమెరుపులు ఆహ్లాదపరుస్తాయి. మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపడానికి, ఆనాటి మధురాతిమధురమైన స్నేహపు స్మృతులను నెమరువేసుకోవడానికి ఈ పుస్తకాన్ని ఓసారి చదివితీరాల్సిందే. 

- శ్రీకాంత్‌ కాంటేకర్‌

‘రెక్కలపిల్ల’ కథల పుస్తకం. కవయిత్రి, రచయిత్రి శ్రీసుధ మోదుగు రెండో పుస్తకమిది. ఆమె ఇంతకుముందు రాసిన ‘అమోహం’ కవితాసంపుటి పాఠకుల మన్ననను పొందింది. రచయిత్రి ప్రస్తుతం జమైకాలో నివాసముంటున్నారు. వైద్యరంగంలో స్థిరపడ్డారు.

మరిన్ని వార్తలు