రోసెట్టా అపూర్వ విజయం

14 Nov, 2014 00:15 IST|Sakshi

మనిషి విజ్ఞాన శాస్త్ర ప్రయాణం మరో కీలక మలుపు తీసుకుంది. ఖగోళంలో మనకు అనంత దూరంలో తిరుగాడుతున్న తోకచుక్కను వెంటాడుతూ వెళ్లిన అంతరిక్ష నౌక రోసెట్టా... తనతో తీసుకెళ్లిన ప్రయోగ పరికరం ఫీలే ల్యాండర్‌ను దానిపై నిలపగలగడం మానవాళి సాధించిన ఒక అసాధారణ విజయం.

యూరోప్ అంతరిక్ష సంస్థ (ఈసా) ప్రయోగించిన రోసెట్టాకు రాత్రీ లేదు...పగలూ లేదు. విరామమూ, విశ్రాంతీ లేనేలేదు. దశాబ్దకాలంనుంచి నిరంతర ప్రయాణం. 650 కోట్ల కిలోమీటర్ల దూరమే లక్ష్యం. గంటకు 54,718 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రోసెట్టా... అంతరిక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు చెప్పినట్టల్లా విని ఈ లక్ష్యాన్ని సాధించింది. మధ్యలో 957 రోజులపాటు నిద్రాణ స్థితిలో ఉంచితే అలా ఉంటూ కూడా మునుముందుకు సాగింది.

2004లో దీన్ని ప్రయోగించినప్పుడు శాస్త్రవేత్తల్లో పెద్ద ఆశలేమీ లేవు. తెలియని తీరాల అంచులకు సాగనంపుతున్నామనీ, మధ్యలో అనుకోనిదేదైనా సంభవిస్తే ఈ ప్రయాణం అర్ధంతరంగా నిలిచిపోతుందన్న ఎరుక వారిలో ఉన్నది. అన్నీ సక్రమంగా పూర్తయ్యాక ఫీలే ల్యాండర్ తోకచుక్కపై దిగే అవకాశాలు సైతం 75 శాతంమాత్రమే ఉంటాయని లెక్కేశారు. కనుకనే ఈసా శాస్త్రవేత్తలు రెప్పవాల్చకుండా దాన్ని వీక్షించారు. ఎప్పటికప్పుడు తోకచుక్క గమనాన్ని చూసుకుంటూ, రోసెట్టా ఎంత వేగంతో వెళ్తే దాన్ని అందుకోగలదో అంచనా వేసుకుంటూ అవసరమైన ఆదేశాలు పంపారు.

రోసెట్టాకు కాంతివేగంతో ఒక సందేశం పంపితే అది దానికి చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. వెనువెంటనే తనకు అమర్చిన రాకెట్లను మండించుకుంటూ తన వేగాన్ని, దిశను నియంత్రించుకుంటుంది. 30 నిమిషాల తర్వాత అది ఏంచేయాలో నిర్దేశించడమనే సంక్లిష్ట ప్రక్రియను శాస్త్రవేత్తలు సజావుగా పూర్తిచేయగలగడం గొప్ప విషయమే. పదేళ్ల ఈ యజ్ఞం ఫలించింది. బుధవారం రోసెట్టా తనతో తీసుకెళ్లిన ఫీలే ల్యాండర్‌ను తోకచుక్కపైకి జారవిడిచింది. మరో ఏడుగంటల తర్వాత ఫీలే ల్యాండర్ తోకచుక్కను ముద్దాడి భూమ్మీది అంతరిక్ష కేంద్రానికి సచిత్ర సందేశాలను పంపింది.
 
1,400 కోట్ల సంవత్సరాలక్రితం అణువుల మహా విస్ఫోటం సంభవించి ఆవిర్భవించిన ఈ విశ్వంలో గ్రహాలు...వాటికి మళ్లీ ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు ఎన్నెన్నో! నిత్యం తిరుగాడే లక్షలాది గ్రహాలు, నక్షత్రాల్లోనుంచి వెలువడే ధూళి...కాలక్రమంలో మేఘాలుగా పరివర్తనం చెంది, అవి క్రమేపీ గడ్డకట్టుకుపోయి తోకచుక్కలుగా, శకలాలుగా మారి ఉంటాయన్నది శాస్త్రవేత్తల భావన. 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన భూమిపైకి ఇలా దారితప్పి దూసుకొచ్చిన తోకచుక్కేదో జీవరాశి ఆవిర్భావానికి పనికొచ్చే కర్బన మిశ్రమాలనూ, నీటినీ మోసుకొచ్చి ఉంటుందని వారి అంచనా. మన సౌర వ్యవస్థను పోలిన వ్యవస్థలు విశ్వంలో ఎన్నో ఉన్నాయని... వాటిల్లో ఎక్కడో ఇవే తరహా మార్పులు జరిగి జీవరాశితో అలరారే గ్రహం ఉండే అవకాశం లేకపోలేదని చెబుతారు.

ఈ తోకచుక్కలూ, గ్రహశకలాలూ విశ్వావిర్భావంనుంచీ ఎక్కడికో, ఎటో తెలియకుండా పరిభ్రమిస్తూనే ఉన్నాయి. అంతేకాదు... ఇవి తమలో ఆనాటి జ్ఞాపకాలను మూలకాల రూపంలో అత్యంత జాగ్రత్తగా పదిలపరుచుకున్నాయి. నిర్దిష్టమైన కక్ష్యలో ఇవి తిరుగాడుతున్నట్టే కనబడుతున్నా ఎప్పుడో హఠాత్తుగా ఇవి దారితప్పడమూ, ఉపద్రవాలు తీసుకురావడమూ తథ్యం. ఇలాంటి ఉపద్రవాలను నివారించాలంటే వీటికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం అవసరమని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అనుకుంటున్నారు.

ఒక్క తోకచుక్కను పట్టుకున్నా, అందులోని పదార్థాలేమిటో, దాని పోకడలేమిటో తెలుసుకోగలిగినా ఈ విశ్వానికి సంబంధించి మన అవగాహన మరింత విస్తృతమవుతుందని...అదే సమయంలో భూమికి ఎదురుకాగల ఉపద్రవాలను నిరోధించడంలో పనికొస్తుందని శాస్త్రవేత్తలు ఆశించారు. శక్తిమంతమైన టెలిస్కోపులతో తోకచుక్కలూ, గ్రహశకలాల ఆచూకీని రాబట్టడం...వాటి వేగాన్ని, కక్ష్యను లెక్కేసి తెలుసుకోవడం నిత్యం సాగే పనే. ఇందులో కొత్తగా తారసపడినవేమైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు కూపీ లాగుతారు. అలా తొలిసారి 1969లో అప్పటి సోవియెట్ యూనియన్‌కు చెందిన ఇద్దరు ఔత్సాహికులు 67పీ తోకచుక్కను కనుక్కున్నారు. ఆ ఇద్దరి పేర్లే ఈ తోకచుక్కకు పెట్టారు.
 
ఈ సుదీర్ఘ ప్రయాణంలో రోసెట్టా ఎన్నిటినో దాటింది. మధ్యలో అంగారకుడి పక్కనుంచి దూసుకెళ్లింది. స్టీన్స్, టుటేషియా వంటి భారీ గ్రహశకలాల బారిన పడకుండా ఒడుపుగా తప్పించుకున్నది. మొన్న సెప్టెంబర్‌లో తోకచుక్కకు 50 కిలోమీటర్ల దూరంలో ఉండగా తన సెల్ఫీని సైతం తీసుకుని పంపింది. మినీ బస్సు సైజులో ఉండే రోసెట్టా మరో ఏడాదిపాటు తోకచుక్క కక్ష్యలోనే తిరుగుతూ తనకు అమర్చిన 21 పరికరాల సాయంతో దాన్ని జల్లెడపడుతుంది. సూర్యుడికి సమీపంగా వెళ్తున్నప్పుడు తోకచుక్కలో స్పందనలెలా ఉన్నాయో చూసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది.

ఫీలే ల్యాండర్‌లోని ఏడు కెమెరాలు 360 డిగ్రీల్లో తోకచుక్క ఛాయాచిత్రాలు తీసి పంపుతాయి. తోకచుక్కలో ఉండగలదనుకుంటున్న నీరు, మంచులో నిక్షిప్తమై ఉన్న సేంద్రీయ పదార్థాలేమిటో విశ్లేషించి సమాచారం అందిస్తుంది. సృష్టి, స్థితులకు కారణమైన తోకచుక్కలు, గ్రహశకలాలే ఎప్పుడో ఒకప్పుడు లయ కారకాలు కూడా కావొచ్చు.

అందుకు అంగారక, గురుగ్రహాలను తరచు ఢీకొట్టే తోకచుక్కలు, గ్రహశకలాలే రుజువు. విజ్ఞానశాస్త్ర సాయంతో దీన్ని సులభంగా ఎదుర్కొనగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు రోసెట్టా సాధించిన విజయం ఆ దిశగా వేసిన తొలి అడుగు. అంతరిక్షంనుంచి పొంచివున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఇలాంటి అడుగులు మరిన్ని పడవలసి ఉంటుంది. ఈ క్రమానికి శ్రీకారం చుట్టిన ఈసా శాస్త్రవేత్తలు అభినందనీయులు.
 

మరిన్ని వార్తలు