కోటాపై మళ్లీ దుమారం

21 Aug, 2019 00:38 IST|Sakshi

ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ మళ్లీ ‘కోటా’ తుట్టె కదిలించారు. రిజర్వేషన్లపై సమాజంలో సామరస్యపూర్వకమైన చర్చ జరగాలంటూ ప్రతిపాదించారు. దీని పై వెంటనే చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగడంతో ఆరెస్సెస్‌ వివరణ ఇచ్చింది. సంక్లిష్టమైన అంశాలను సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవాలన్నదే ఆయన ఉద్దేశమని చెప్పింది. వివిధ వర్గాలకు ఇప్పుడిస్తున్న రిజర్వేషన్లను తాము సంపూర్ణంగా సమర్థిస్తున్నామని ప్రకటించింది. నాలుగేళ్లక్రితం కూడా మోహన్‌ భాగవత్‌ ఇటువంటి వివాదాన్నే రేపారు. ఎవరికి రిజర్వేషన్లు అవసరమో, ఎంతకాలం అవసరమో తేల్చడానికి ఒక ‘రాజకీయేతర సంఘాన్ని’ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పట్లో బీజేపీ నేతలు ఆయన అభిప్రాయాలతో తమకు ఏకీభావం లేదని ఆదరాబాదరాగా ప్రకటించగా, ఆయన చేసిన వ్యాఖ్యల ఉద్దేశం వేరని ఆరెస్సెస్‌ వివరించింది. ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.  

రిజర్వేషన్ల విషయంలో దాని అనుకూలురు, వ్యతిరేకులమధ్య చర్చ జరుగుతున్నదని, అది సామరస్యపూర్వకంగా లేదని భాగవత్‌కు ఎందుకు అనిపించిందో తెలియదు. నిజానికి ఈ అంశంపై గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా చర్చలేదు. పోటాపోటీ ఉద్యమాలు, వాగ్యుద్ధాలు జరగటం లేదు. పైపెచ్చు ఒకప్పుడు రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలే ఇప్పుడు తమకూ ఆ మాదిరి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాయి. గుజరాత్‌లో ఒకప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన పటేళ్లు తమకు కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడ్డెక్కారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆధిపత్య కులాలవారు తమకు కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతుండటం వర్తమాన పరిస్థితి. అలాగే బీసీ కులాల జాబితాల్లో ఉన్న కొన్ని కులాలు తమను షెడ్యూల్‌ కులాలుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తుంటే, కొందరు తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నారు.

రిజర్వేషన్లను వర్గీకరించాలని, ఆ ఫలాలు తమకు కూడా దక్కేందుకు చర్యలు తీసుకోవాలని అట్టడుగు కులాల్లో బాగా దిగువన ఉండిపోయిన కొన్ని కులాలు కోరుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు రిజర్వేషన్లు ఆశిస్తున్నవారే ఎక్కువ. అందుకోసం పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు సాగుతున్నాయి. ఇలా కొత్తగా వస్తున్న డిమాండ్లను గమనించి కొన్ని రాష్ట్రాలు కోటాకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని తొలగించాలని కేంద్రాన్ని గతంలో కోరాయి. ఈ ఏడాది మొదట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరల్‌ కేటగిరీలోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా కల్పిస్తూ జీవో విడుదల చేసింది. పర్యవసానంగా రిజర్వేషన్ల శాతం సుప్రీంకోర్టు విధించిన పరిమితిని దాటింది. ఈ విషయంలో దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16శాతం రిజర్వేషన్‌ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొన్న జూన్‌లో బొంబాయి హైకోర్టు ఆమోదిస్తూనే స్వల్పంగా సవరించింది. పర్యవసానంగా అక్కడి కోటా 65శాతానికి చేరింది. 

మన దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలవారు సామాజికంగా నిరాదరణకు లోనవుతున్నారని, అటువంటి వర్గాలను ఆదుకోవడానికి, ఉద్ధరించడానికి తగిన చర్యలు అవసరమని బ్రిటిష్‌ పాలన సమయంలోనే గుర్తించారు. అప్పట్లోనే కొన్ని అట్టడుగు కులాలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. శతాబ్దాల అసమానతలు సృష్టించిన అంతరాలను తగ్గించడానికి ఇది తప్పనిసరనుకున్నారు. స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆ విధంగానే భావించారు. కనుకనే షెడ్యూల్‌ కులాలకు, షెడ్యూల్‌ తెగలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. నిజానికి అప్పట్లోనే సామాజికంగా వెనకబడి ఉన్న కులాలకు కూడా ఈ సదుపాయం కల్పించి ఉంటే వేరుగా ఉండేది.

కానీ అది జరగడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. 1979లో జనతా పార్టీ ప్రభుత్వం కుల వివక్ష కారణంగా వెనకబాటుతనానికి గురవుతున్న కులాలను గుర్తించేందుకు మండల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. అది చాలా చురుగ్గా పనిచేసి ఆ మరుసటి ఏడాదికల్లా సమగ్రమైన నివేదిక సమర్పించింది. దాదాపు మరో పదేళ్ళకు గానీ  మండల్‌ కమిషన్‌ నివేదికకు మోక్షం కలగలేదు. 1989లో అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం ఆ నివేదిక దుమ్ము దులిపి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆందోళనలు సాగాయి. కొన్ని చోట్ల హింస చెలరేగింది. అలా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని 2008లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చిత్రమేమంటే అప్పట్లో ఆందోళన చేసిన కులాలే దాదాపు అన్నిచోట్లా తమకూ కోటా కల్పించాలని కోరుతున్నాయి. ఏతావాతా రిజర్వేషన్ల విషయంలో వ్యక్తులుగా ఎవరికెలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చుగానీ... వాటిని రద్దు చేయాలని కోరే కులాలు, సంస్థలూ, పార్టీలూ ఇప్పుడు దాదాపు లేవు. కనుకనే మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

సామరస్యపూర్వక చర్చ జరగాలనే ముందు సంస్థగా రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరేమిటో భాగవత్‌ చెప్పివుంటే సరిపోయేది. ఆయన అస్పష్టంగా ఏదో ఒకటి అనడం, అనంతరం దానిపై దుమారం రేగడం, ఆ తర్వాత సంస్థ తరఫున ఒక వివరణ రావడం సహజంగానే సంశయాలను రేకెత్తిస్తుంది. విపక్షాల సంగతలా ఉంచి, బీజేపీ మిత్రపక్షం రిపబ్లికన్‌ పార్టీ అధినేత, కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే సైతం రిజర్వేషన్లపై చర్చ వృథా అంటున్నారు. రిజర్వేషన్లు అవసరమా, కాదా అనే అంశం చర్చనీయాంశమే కాదంటున్నారు. రిజర్వేషన్ల ఆలోచనకు మూలమైన కుల వివక్ష, అసమానతలు మన దేశంలో పూర్తిగా అంతరించాయా లేదా అన్న అంశంపై చర్చ జరగాలి. అప్పుడు ఈ రిజర్వేషన్లను కొనసాగించాలో లేదో  నిర్ణయించుకోవడం పెద్ద కష్టం కాదు. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు