పుతిన్‌ కొత్త ఎత్తు!

18 Jan, 2020 00:23 IST|Sakshi

అధికార పీఠాన్ని శాశ్వతం చేసుకోవడం ఎలాగో తెలిసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈసారి మరో కొత్త ఎత్తుగడతో వచ్చినట్టు కనబడుతోంది. దేశ స్థితిగతులపై ఏటా ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగంలో ఆయన  రాజకీయ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెనువెంటనే ప్రధాని మెద్వదేవ్‌ నాయకత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేసింది. మరో 24 గంటల్లో మెద్వదేవ్‌ స్థానంలో మిఖాయిల్‌ మిషుస్తిన్‌ను నియమించబోతున్నట్టు పుతిన్‌ ప్రకటించారు. మెద్వదేవ్‌ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. 90వ దశకం చివరి నుంచి వారిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఏలుబడిలోని సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలాక 2000 సంవత్సరంలో తొలిసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించినప్పటినుంచీ దేశంలో పుతిన్‌ మాటే శాసనంగా సాగుతోంది. మధ్యలో రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన వాటిని అవలీలగా అధిగమించారు. తనకు ప్రత్యర్థి లేకుండా చేసుకున్నారు. దిగువ సభ డ్యూమా ఎన్నికల్లోగానీ, అధ్యక్ష ఎన్నికల్లోగానీ బ్యాలెట్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రత్యర్థులను బెదిరించారని, అక్రమ కేసులతో వేధిస్తున్నారని తరచు ఆరోపణలొచ్చినా ఆయనకేమీ కాలేదు.

ఆయనపై దేశంలో అసంతృప్తి ఏర్పడిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జనం రోడ్లెక్కిన సందర్భాలున్నాయి. అయితే ఎన్నికలొచ్చేసరికి ఓట్ల శాతం కాస్త అటో ఇటో కావొచ్చుగానీ విజేత మాత్రం ఎప్పుడూ ఆయనే. ఆలస్యంగా ప్రజాస్వామ్య పంథాలోకి ప్రవేశించిన రష్యా పుతిన్‌ ఇష్టారాజ్యంగా మారిందనడంలో ఆశ్చర్యం లేదు. నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరగాలని, ఒక వ్యక్తి వరసగా రెండు దఫాలు మించి ఎన్నిక కారాదని రాజ్యాంగ నిబంధనలున్నాయి. కానీ వాటిని అధిగమించేందుకు 2008లో పుతిన్‌ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయి, వెనువెంటనే అప్పటివరకూ ప్రధానిగా వున్న మెద్వదేవ్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టి తాను ప్రధానిగా వున్నారు. నాలుగేళ్లపాటు ఎలాగోలా కాలం గడిపి, గడువు తీరగానే తిరిగి అధ్యక్ష పీఠం ఎక్కారు. హోదా రీత్యా ప్రధాని స్థానం అధ్యక్షుడి తర్వాతే అయినా, తెర వెనక తానే శాసించారు. ఆ తర్వాత తిరిగి అధ్యక్షుడు కావాలనుకున్నదే తడవుగా అధ్యక్ష పదవీకాల పరిమితిని కాస్తా రాజ్యాంగ సవరణ ద్వారా ఆరేళ్లకు మార్చారు. ఏతావాతా 2024 వరకూ దేశాధ్యక్ష పీఠం పుతిన్‌దే. అయితే తన సన్నిహితుడు మెద్వదేవ్‌కు ఎందుకు ఉద్వాసన పలకవలసి వచ్చిందన్నది కీలక ప్రశ్న.

మెద్వదేవ్‌ అవినీతి గురించి పుంఖానుపుంఖాలుగా వెలువడిన కథనాలను పుతిన్‌ పట్టించుకోవడం వల్లే ఈ చర్య తీసుకున్నారని కొందరి అంచనా. రష్యాలో ఇలాంటి ఆరోపణలు రావడం కొత్త కాదు. ప్రత్యేకించి మెద్వదేవ్‌పై ఆరోపణలు ఎప్పటినుంచో వున్నాయి. సమర్థవంతమైన పాలన అందించలేకపోవడం వల్లనే ఆయనపై వేటు పడిందని మరికొందరు చెప్పే మాట. కానీ పుతిన్‌ తీసుకున్న చర్యలు కేవలం మెద్వదేవ్‌ను మార్చడానికి మాత్రమే ఉద్దేశించినవి కాదు. రాజ్యాంగంలో భారీయెత్తున మార్పులు తీసుకొస్తున్నట్టు తన ప్రసంగంలో పుతిన్‌ చెప్పారు. అధ్యక్షుడి అధికారాలు తగ్గించడం, ప్రజలెన్నుకునే ప్రతినిధుల సభ డ్యూమాకు పెద్దపీట వేయడం అందులో ప్రధానమైనవి. ఇకపై న్యాయమూర్తుల నియామకంలోనూ, భద్రతా వ్యవహారాల అధిపతుల నియామకంలోనూ డ్యూమాకే అధికారం వుంటుంది. ప్రధాని, ఇతర మంత్రుల నియామకం అధికారం కూడా డ్యూమాదే.

ప్రస్తుతం ఆ అధికారం అధ్యక్షుడికి వుంది. భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు అంతకు ముందు 25 ఏళ్లపాటు దేశంలో నివసించి వుండాలట. విదేశీ పాస్‌పోర్టు లేదా రెసిడెన్స్‌ పర్మిట్‌ ఉండకూడదట. రెండోసారి కూడా వరసగా రెండు దఫాలు అధ్యక్షుడిగా వుండటం పూర్తయింది కనుక తాను ఎటూ తప్పుకోవాల్సివస్తుంది. ఆ రాజ్యాంగ నిబంధనను ఏదోవిధంగా మార్చి, మళ్లీ అధికారంలో కొనసాగుతారని అందరూ అనుకుంటున్న తరుణంలో అధ్యక్షుడి అధికారాలు తగ్గించబోతున్నట్టు, డ్యూమా ప్రాధాన్యం పెంచనున్నట్టు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఆర్థికంగా దేశం గడ్డు స్థితిలోవుంది. 2014లో క్రిమియాపై దండెత్తి దాన్ని ఆక్రమించుకున్నాక అమెరికా, యూరప్‌ దేశాలు విధించిన ఆంక్షలతో అది సమస్యలు ఎదుర్కొంటున్నది. దీని ప్రభావం పుతిన్‌ పైనా పడింది. ఆయన రేటింగ్‌ తగ్గిందన్న వార్తలొస్తున్నాయి. జాతీయ ప్రాజెక్టుల పథకం కింద ఆయన గతంలో అనేక వాగ్దానాలు చేశారు. అయితే వాటికి తగినన్ని నిధులు సమకూర్చడంలో మెద్వదేవ్‌ ప్రభుత్వం విఫలమైంది. అందువల్ల జనం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకునే పబ్లిక్‌ రంగ సంస్థల సిబ్బంది వేతనాలు పెంచుతామని, బడుల్లో పిల్లలకు ఉచితంగా భోజనం పెడతామని, శిశు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పుతిన్‌ హామీ ఇచ్చారు. అయితే ఇవన్నీ అమలు కావాలంటే దాదాపు 8,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. మరి ఇంత మొత్తాన్ని పుతిన్‌ ఎలా సమకూర్చదల్చుకున్నారో చూడాల్సివుంది. మరోపక్క అంతర్జాతీయ చట్టాలు రష్యా రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోతే అవి వర్తించబోవని పుతిన్‌ చెప్పడం మున్ముందు ఆ దేశం తీరుతెన్నులు మారబోతున్నాయన్న అభిప్రాయం కలగజేస్తోంది. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం 2024 తర్వాత మరోసారి అధ్యక్షుడు కావడం పుతిన్‌కు అసాధ్యం. కనుక భవిష్యత్తు అధ్యక్షుడికి తన స్థాయి అధికారాలు లేకుండా ఆయన జాగ్రత్త పడుతున్నట్టు కనబడుతోంది. అయితే విధాన నిర్ణయాల్లో భాగస్వామి కాకుండా, అసలు అధికారంలోనే లేకుండా రాజ్యాన్ని పుతిన్‌ ఏవిధంగా శాసించదల్చుకున్నారో తెలియాలంటే మరింత సమయం పడుతుంది. అన్నిటినీ ఒకేసారి చెప్పడం పుతిన్‌కు అలవాటులేదు. అందుకు ఎన్ని వాయిదాలు తీసుకుంటారన్నదే ప్రశ్న. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా