అటువైపు అడుగులు పడనీ...

31 Dec, 2019 00:47 IST|Sakshi

కాలమొక అవధులు లేని నిరంతర ప్రవాహం. గ్రహగతులు, రుతువులను బట్టి మనిషి గీసుకున్న విభజన రేఖలే దిన, వార, మాస, సంవత్సర కాలఖండికలు. కాలం ఒక మాయాజాలం, కొత్త గాయాలు చేసే అస్త్రమే కాదు, పాత గాయాలు మాన్పే ఔషధమనీ ప్రతీతి! ఏడాది ముగించుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ! దేశ పరిస్థితి ఎలా ఉంది? ఏయే దారుల వెంట ఈ ఏడాది కాలంలో అడుగులు ఎలా పడ్డాయి? సాధించిన ప్రగతి ఎంత, ఎదురైన వైఫల్యాలెన్ని... సమీక్షిం చుకునే సముచిత సందర్భమిది. జరిగిన మంచికైనా, చెడుకైనా సంకేతాలు విస్పష్టంగానే ఉన్నాయి. ఎవరు, ఏది దాచాలని చూసినా, అన్నీ కళ్లెదుట కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతి మార్పూ సగటు మనిషి జీవితాన్ని స్పృశిస్తూనే ఉంది. సంధి కాలంలో నిలబడి.. గతాన్ని తడిమిన అనుభవ పాఠాలతో జాగ్రత్తపడితే భవిష్యత్తులోకి భరోసాతో అడుగేయవచ్చు! ఏయే పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుకోవాలో ప్రణాళికా రచనకిది శుభతరుణం.

దేశం నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మందగమనంపై ఎన్ని సంకేతాలు, హెచ్చరికలు వచ్చినా జాగ్రత్తపడకపోవడమూ దీనికొక కారణం కావచ్చు. మెరుగుపడని ఆర్థిక స్థితి వల్లే సమాధానం దొరకని సమస్యలా నిరుద్యోగం ప్రబలుతోంది. రైతు చేయూతకు ఎన్ని చర్యలు చేపట్టినా వ్యవసాయం కునారిల్లుతోంది. పర్యావరణ సమస్య జఠిలమౌతోంది. మానవా భివృద్ధి సూచీలో అడుగునే ఉన్నాం. మరో వంక దేశంలో జాతీయతా భావం బలపడుతోందని, అంతర్జాతీయ సంబంధాలు మెరుగవుతున్నాయని, ప్రపంచ యవనికపై భారత్‌ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతోందనే జనాభిప్రాయం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అవినీతి నియంత్రణతో పాటు పాలనా సంస్కరణల్లో కొంత ముందడుగు పడింది. ఇరుగుపొరుగుతో ఇబ్బందులున్నప్పటికీ అంత ర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. తీవ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సమాజాన్ని తనకు అనుకూలంగా భారత్‌ మలచగలిగింది. ఆర్థిక పరిస్థితి అడుగంటుతున్నా... స్టాక్‌ మార్కెట్‌ ఎగిసిపడుతోంది. వీటన్నిటిపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ నేతృ త్వపు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వ విధానాల ప్రభావం ఉంది. మారు తున్న భాజపా రాజకీయ నిమ్నోన్నతులకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ స్థితిగతులూ కొంత కార ణమే! ఈ ముఖ్య పార్టీల రాజకీయ సమీకరణాలు, ఉత్తానపతనాలెలా ఉన్నా, నూట పాతిక కోట్ల భారతీయులు ఆశావహంగా ఎదురుచూసే కొత్త సంవత్సరంలో... చెడు తగ్గి, మంచి పెరిగే ఓ బలమైన ముందడుగు పడాలన్నది అందరి అభిలాష.

రాజకీయ సుస్థిరత ఆర్థికాంశంతో ముడివడి ఉందనే వాస్తవాన్ని పాలకపక్షాలు అంత తెలిగ్గా అంగీకరించవు. అసలు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందన్నా, అతినమ్మకపు కాళ్లకింద ఇసుకను ‘మందగమనం’ క్రమంగా కరిగిస్తోందన్నా అవి ఒప్పుకోవు. ప్రస్తుతం బీజేపీ రాజకీయ పరిస్థితి దేశ ఆర్థిక స్థితిని బట్టి మారుతోందనే విషయం ఆ పార్టీకి తప్ప అందరికీ కనిపిస్తోంది. పదేళ్ల ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) పాలన తర్వాత 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఆ ఐదేళ్ల పాలనలో బీజేపీ, కూటమి రాజకీయ సూచీ ఊర్ద్వముఖంగా సాగినట్టు అప్పట్లో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్ని పరిశీలిస్తే స్పష్టమౌతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ... ‘కులపరమైన సున్నితాంశాలకు, మతపరమైన భావోద్వేగాలకు పదేళ్ల మారిటోరియం విధిస్తున్న’ట్టు ప్రధాని నరేంద్ర మోది బహిరంగ ప్రకటన చేశారు. అది ప్రజలూ నమ్మారు. జనం కష్టాల కడగండ్లు చూసిన పెద్ద నోట్ల రద్దు, సెగ తగిలిన జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో లభించిన సానుకూల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. అవి కల్పించిన విశ్వాసం, పలు ఎత్తుగడలు, వ్యూహాలతో 2019 ఎన్నికల్లో పోరిన బీజేపీ అనూహ్య ఫలితాల్ని సాధించింది.

కిందటి ఎన్నికల కన్నా లోకసభ స్థానాల సంఖ్య తగ్గుతుందేమో అని సందేహించిన చోట, సంఖ్య పెరిగింది. సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే నిబ్బరమైన మెజారిటీ బీజేపీకి లభించింది. దాంతో, తమ ఆర్థిక పంథాయే కరెక్టని, తమ రాజకీయ విధానాలకే జనం మద్దతుందని బీజేపీ బలంగా భావించింది. కిందటి అయిదేళ్లలో అణచిపెట్టుకున్న సొంత ఎజెండాను వేగంగా తెరపైకి తెచ్చింది. జాతీయత పేరుతో అధిక సంఖ్యాక వాదం, వివాదాస్పద రామమందిర నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌–అధికరణం 370 రద్దు, జాతీయ పౌర నమోదు పట్టి, పౌర సత్వ సవరణ చట్టం.... ఇలా తనదైన ఎజెండాను అమలుపరుస్తోంది. సహజంగానే వ్యతిరేకత పెరు గుతోంది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు పెద్దగా తీసుకోలేదు. తీసుకున్న ఒకటీ, అర చర్యలు సానుకూల ఫలితాలివ్వలేదు. భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు తరచూ తగ్గిస్తున్నాయి. వాస్తవ గణాంకాలూ ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మూడో త్రైమాసికం ఆర్థిక వృద్దిరేటు 4.5 వద్ద తచ్చాడుతుండగా, నాలుగో త్రైమాసికంలో అది 4 శాతానికి పడిపోయే సంకేతాలే కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం గొప్పగా మెరుగుపడే సూచనలు లేవని ఆర్థిక నిపుణులంటున్నారు. దీని ప్రభావం సగటు జీవి ప్రత్యక్ష మను గడతో పాటు రాజకీయ సుస్థిరతపైనా పడుతోంది. బీజేపీ క్రమంగా తన రాజకీయ పట్టు కోల్పో తోంది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఘండ్‌ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.

రాజకీయ వ్యూహ–ప్రతివ్యూహాలిచ్చే విజయాలన్నీ తాత్కాలికం. ప్రజాస్వామ్యంలో ప్రజా భిప్రాయమే ప్రామాణికం. జనం మనోగతం తెలిసి వ్యవహరించడమే పాలకులకు శిరోధార్యం! లక్ష్యం దిశలో ఎటు సాగుతున్నామో స్పష్టత ఉండాలంటే.. ఎక్కడ బయలుదేరామో అవగాహన ఉండాలంటారు. ఏడాది గమనంపై ఆత్మశోధన చేసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే కొత్త సంవత్సరం ప్రగతి దిశలో సరికొత్త దారులు పరుస్తుంది. జన జీవితం వెలుగులీనేలా మంచి కాలం వెల్లివిరుస్తుంది.

మరిన్ని వార్తలు