కరోనా నేర్పిన పాఠాలు

4 Jun, 2020 00:26 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారిపై మన దేశం ఎడతెగకుండా పోరు సాగిస్తున్నా ఆ కేసుల సంఖ్య 2,07,000 దాటిపోయింది. ఆ వైరస్‌ దండయాత్ర మొదలెట్టినప్పుడువున్న స్థాయిలో  ఇప్పుడు భయాందోళనలు లేవు. ఎవరైనా తుమ్మినా, దగ్గినా, జ్వరం వుందని చెప్పినా వారిని చూసి హడలెత్తే వారు ఇప్పటికీ ఎక్కువే. కరోనా బాధితులనూ, వ్యాధిగ్రస్తుల కుటుంబాలనూ దూరంపెట్టేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ దాని బారినపడితే మరణం ఖాయమన్న అపోహ పోయింది. అలాగే వ్యాధి గురించి వెల్లడిస్తే దోషిగా పరిగణిస్తారన్న భయం కూడా తగ్గింది. వ్యాధి గురించి బెంబేలెత్తడం వృథా అని, దానికి బదులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది దరిచేరదని అవగాహన ఏర్పడింది. ఏ సంక్షోభాన్నయినా స్వప్రయోజనాలకు ఉపయోగించుకుందామని చూసే ఉన్మాదులు కరోనాను అడ్డుపెట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. అకారణంగా కొందరిపై దౌర్జన్యం చేశారు కూడా. ఆ వ్యాధికి కులం, మతం, ప్రాంతం, ధనిక, బీద తారతమ్యాలు లేవని, ఆ సాకుతో వివక్ష ప్రదర్శించరాదని నేతలు చెప్పాక అలాంటి కుత్సిత ధోరణులకు కొంతవరకూ బ్రేకు పడింది.

ప్రస్తుతానికి మనం కరోనాకు సంబంధించినంతవరకూ ప్రపంచంలో ఏడో స్థానంలో వున్నాం. వ్యాధిగ్రస్తుల సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువున్నట్టే అనిపిస్తున్నా ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. కరోనా మరణాల ప్రపంచ సగటు 6.13 శాతం వుండగా మన దేశంలో అది 2.82 శాతం. వ్యాధి వ్యాప్తి ఎక్కువగా వున్న దేశాల్లో మరణాల రేటు మనకన్నా చాలా ఎక్కువ.  కోలుకుంటున్నవారి శాతం కూడా ప్రపంచ సగటుతో పోలిస్తే మన దేశంలో ఎక్కువే. అయితే వ్యాధి జాడ బయటపడిన 93 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటిందని, ఇదింకా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతున్న వైనం కనబడటం లేదని గుర్తుంచుకోవాలి. ఇంకా లోతుకు పోతే మరిన్ని అంశాలు బయటపడతాయి. కరోనా కేసుల సంఖ్య లక్షగా నమోదైన పక్షం రోజుల్లోనే అది రెట్టింపు కావడం గమనించదగ్గది. తొలి 50,000 కేసులకూ 66 రోజులు పట్టింది. కానీ ఆ సంఖ్య మరో 50,000 కావడానికి కేవలం 12 రోజులు, మరో 50,000కు చేరడానికి 8 రోజులు పట్టింది. చివరి 50,000 కేసులకూ ఏడు రోజుల వ్యవధి మాత్రమే వుంది. ఇప్పుడున్న మరణాల రేటు తీరు ఇలాగేవుంటే వచ్చే నెలాఖరుకు 30,000మంది మృత్యువాత పడే అవకాశం వున్నదని నిపుణుల అంచనా. వేరే దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినా, అన్ని విలువైన ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడితే అది ఎంతో విషాదకరం. వీటిని నివారించడానికి, కనీసం కనిష్ట స్థాయిలో వుంచడానికి సమాజం మొత్తం సమష్టిగా కదలాల్సివుంది. ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రజల్ని మరింత అప్రమత్తం చేయక తప్పదు. కరోనా విషయంలో కచ్చితంగా తీసుకునే జాగ్రత్తలే ప్రాణహాని నుంచి కాపాడతాయి. 

లాక్‌డౌన్‌ నిబంధనలు వున్నా ప్రభుత్వాలిచ్చిన వెసులుబాట్లు ఆసరా చేసుకుని దైనందిన కార్యకలాపాలు ఏదో మేర మొదలయ్యాయి. ఇంకా వ్యాపార, వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు మందకొడిగానే వున్నాయి. పౌరుల కదలికలు కూడా తగ్గాయి. కానీ చాలా చోట్ల భౌతిక దూరం పాటించడంలో శ్రద్ధ తగ్గింది. ప్రభుత్వాలే ఇందుకు కారణం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో యధాప్రకారం జనం చాలా దగ్గరగా మసులుతున్నా క్రమబద్ధీకరించడం కన బడదు. దుకాణాల దగ్గరా అదే స్థితి. ప్రభుత్వాలు వెసులుబాట్లు ఇచ్చాయి గనుక కరోనా కేసుల సంఖ్య పెరగొచ్చునని ముందు అనుకున్నదే. కానీ దాన్ని ఏమేరకు పరిమితం చేయొచ్చునన్న ఆలోచన కొరవడకూడదు. తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన ఇప్పట్లో చేయకూడదు. పర్యావరణానికి హాని చేకూర్చే విధానాలకు స్వస్తి చెప్పడం, ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు మానుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యమీయడం ప్రస్తుత అవసరం. మహారాష్ట్ర యధావిధిగా అత్యధిక కేసులు నమోదు చేస్తోంది. ఈమధ్యకాలంలో రోజుకు బయట పడుతున్న కేసుల సంఖ్యలో ఆ రాష్ట్రం వాటాయే ఎక్కువ. ఆ తర్వాత ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్‌ వగైరాలుంటున్నాయి. అయితే మహారాష్టలో గత రెండు వారాలుగా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. ఢిల్లీ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కేసుల పెరుగుదలకు సంబంధించిన జాతీయ సగటు 4.67 శాతంవుంటే, ఢిల్లీలో అది 6.26 శాతం.      

ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో పరీక్షలు ముమ్మరంగా చేయడం లేదు. కేవలం బయటపడిన కేసుల్ని మాత్రమే తీసుకుని, చికిత్సనందించే ధోరణి కొనసాగుతోంది. పరీక్షలు విస్తృతంగా చేసినప్పుడే ఆ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం సాధ్యమవుతుందని, ఈ విషయంలో ఏమరపాటు ప్రదర్శిస్తే ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాధి జాడ బయటపడిన తొలినాళ్లలోనే తెలియజేసింది. వనరుల కొరత కావొచ్చు... ఇంకేదైనా కారణం కావొచ్చు చాలా రాష్ట్రలు పరీక్షల విషయంలో వెనకబడివుంటున్నాయి. ఇందుకు సంబంధించి మొదట్లోనే జాతీయ విధానం రూపొందించివుంటే... అందుకవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను కూడా కేంద్రం తీసుకుని వుంటే ఇలాంటి లోపాలుండేవి కాదు. కరోనా వైరస్‌తో పోరాడే క్రమంలో మనలోని శక్తిసామర్థ్యాలు కూడా వెల్లడయ్యాయి. పరీక్షలు జరపడంలో, వ్యాధిగ్రస్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో, మరణాల రేటును కనిష్టంగా వుంచడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్ర భాగంలో వుంది. ఇప్పటికీ రోజూ వేలాదిమందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ పడుతున్న తపన ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితినుంచి గుణపాఠం నేర్చుకుని వైద్య రంగ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసుకుంటేనే కరోనా వైరస్‌కు బలైనవారి ఆత్మలు శాంతిస్తాయి. 

మరిన్ని వార్తలు