తప్పుడు ప్రచారం తడాఖా

23 Jul, 2020 00:26 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కూ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కూ రూపురేఖల్లోనే కాదు... అభిప్రాయాల్లోనూ పోలికలుంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విషయంలోనూ తమ దృక్పథాలు ఒకటేనని ఇప్పుడు జాన్సన్‌ నిరూపించారు. యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ విడిపో వాలా వద్దా అన్న అంశంపై నాలుగేళ్లనాడు జరిగిన రెఫరెండంను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నించిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన పార్లమెంటరీ కమిటీ వెలువరించిన నివేదిక గమనిస్తే జాన్సన్‌ ప్రభుత్వ సహాయ నిరాకరణ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాస్తవానికి ఈ నివేదిక తయారై తొమ్మిది నెలలు దాటింది.

గత ఏడాది అక్టోబర్‌లో దాన్ని ప్రభుత్వానికి అందజేశారు. కానీ నివేదికను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇందులోని అంశాలు తెలిస్తే జనంలో ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయని, డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో జనం తమను తిరస్కరించే అవకాశం వున్నదని కన్సర్వేటివ్‌ పార్టీ భయపడింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మొరాయిస్తూనే వుంది. కానీ ఈ విషయంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో గత్యంతరం లేక నివేదికను బయట పెట్టింది. అయితే ఇది రష్యా ప్రమేయం వుండొచ్చునని మాత్రమే తేల్చింది. లోతుగా దర్యాప్తు జరి పించి నేర నిర్ధారణ చేయాల్సింది మాత్రం జాన్సన్‌ ప్రభుత్వమే.  

ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్‌లు శక్తిమంతమైనవి. ప్రపంచ రాజకీయా లను అవి దశాబ్దాలపాటు శాసించాయి. ఎన్నో దేశాల్లో వాటి మాటే చెల్లుబాటయింది. ఇప్పటికీ అవుతోంది. తాము చెప్పినట్టు వినడానికి సిద్ధపడని నేతల్ని అధికారం నుంచి కూలదోసిన చరిత్ర కూడా ఆ దేశాలకుంది. అలాంటి దేశాల అంతర్గత రాజకీయాల్లో రష్యా గుట్టు చప్పుడు కాకుండా జోక్యం చేసుకుని, తనకు అనుకూలంగా వుండే నేతల్ని అధికార పీఠాలపై కూర్చోబెట్టిందంటే వినడానికి ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ ఇది వాస్తవమని నిరుడు అమెరికాలో రాబర్ట్‌ మ్యూలర్‌ నివేదిక చెప్పింది. ఇప్పుడు బ్రిటన్‌ పార్లమెంటరీ నివేదిక చెబుతోంది. ఇంతకూ రష్యా తన కార్య సాధన కోసం ఏం చేస్తుంది? కోట్లాదిమంది ఓటర్లను మాయా జాలంలో ముంచెత్తే మంత్రదండం ఏమైనా పుతిన్‌ దగ్గర వుందా? బయటి దేశాలవారెవరో చేసిన ప్రచారానికి అమెరికా, బ్రిటన్‌ ప్రజలు బోల్తా పడ్డారా? ఈ ప్రశ్నలకు ఎవరిదగ్గరా ఖచ్చితమైన జవాబుల్లేవు. కానీ నిరుడు ఏప్రిల్‌లో అమెరికాలో వెల్లడైన రాబర్ట్‌ మ్యూలర్‌ నివేదిక 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం వున్నదని నిర్ధారించింది.

ఇందులో నేరుగా ట్రంప్‌ బాధ్యత ఎంత అన్న అంశంపై ఆ నివేదిక ఏం చెప్పిందో ఇంతవరకూ తెలియదు. ఏ నివేదికనైనా ఎంతవరకూ బయటపెట్టాలో నిర్ణయించే అధికారం అధ్యక్షుడిగా ట్రంప్‌కు వుంటుంది. ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకున్నారు. నివేదిక తనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని ట్రంప్‌ చేసుకున్న ప్రచారాన్ని మాత్రం స్వయానా మ్యూలరే ఖండించారు. రష్యా తీరుపై గత అయిదారేళ్లుగా కథలు కథలుగా మీడియాలో వెల్లడవుతూనే వున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం దండిగా వున్న డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను దెబ్బతీయడానికి సామాజిక మాధ్యమాల నిండా ఆమెకు వ్యతిరేకంగా భారీయెత్తున అబద్ధాలు ప్రచారమయ్యాయి. అవి ఏ స్థాయిలో వున్నాయంటే వాటిని ఖండించడానికి హిల్లరీ టీమ్‌కు బోలెడంత సమయం పట్టింది. వాటికి జవాబిచ్చేలోగా మరిన్ని ప్రచారంలోకొచ్చేవి. బ్రిటన్‌లోనూ స్కాట్లాండ్‌ రెఫరెండం సమయంలో, బ్రెగ్జిట్‌ ఓటింగ్‌ సమయంలో మార్ఫింగ్‌ ఫొటోలనూ, తప్పుడు కథనాలనూ విస్తృతంగా ప్రచారం చేశారు. అమెరికాలో ట్రంప్‌ వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ఇతరులు రష్యా ప్రచారానికి అండదండగా నిలిచారు.

వీరు కేంబ్రిడ్జి ఎనలిటికా ఆసరా తీసుకోవడంతోపాటు ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వగైరా సామాజిక మాధ్యమాల్లో దొంగ పేర్లతో అకౌంట్లు తెరిచి నకిలీ సమాచారాన్ని, తప్పుడు వార్తల్ని వ్యాప్తిలోకి తెచ్చారని మ్యూలర్‌ నివేదిక తేల్చింది. తమ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి ట్రంప్‌ చేసిన ప్రయత్నాలనూ ప్రస్తావించింది. ఇప్పుడు బ్రిటన్‌ పార్లమెంటరీ నివేదిక చూసినా ఇలాంటి అంశాల ప్రస్తావనే వుంది. బ్రిటన్‌లో న్యాయవాదులు, అకౌంటెంట్లు, ఎస్టేట్‌ ఏజెంట్లు తెలిసో తెలియకో రష్యా ప్రచారంలో వాహకులుగా మారారని, హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లోని కొందరు ఎంపీలు సైతం రష్యాలో తమ కున్న వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇందులో తలదూర్చారని ఆ నివేదిక అంటోంది. బ్రిటన్‌లో కామన్స్‌ సభ సభ్యులతో పోలిస్తే హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యులకు అదనపు హక్కులుంటాయి. ఈ పారదర్శకత లేమినే రష్యా ఉపయోగించుకుంటున్నదని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఈ నివేదిక వెల్లడయ్యాక ఎప్పటిలాగే బ్రిటన్‌ ప్రభుత్వం రష్యా ప్రమేయాన్ని తోసిపుచ్చింది. 2019 ఎన్నికల్లో వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా అదేమీ ఫలించలేదన్నది ప్రభుత్వ వాదన. కమిటీ కోరుతున్నట్టు దర్యాప్తు అవసరం లేదన్నదే దాని భావన. కానీ ఇదంత తేలిగ్గా కొట్టిపారేసేది కాదు. 2014లో స్కాట్లాండ్‌ రెఫరెండం జరిగినప్పుడు ట్విటర్‌లోని 4,000కుపైగా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం సాగింది. అందులో 3,841 ఖాతాలు రష్యాకు, 770 ఖాతాలు ఇరాన్‌కి చెందినవని ఇంటర్నెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ 2018లోనే వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా ఒక రోజంతా కోటి ట్వీట్లు విడుదలయ్యాయని కూడా అది లెక్కేసింది. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలు కూడా నిస్సహాయంగా వుండటం, జవాబుదారీతనాన్ని ప్రదర్శించలేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది బ్రిటన్‌ లేదా అమెరికా సమస్య మాత్రమే కాదు... రష్యాను ఆద ర్శంగా తీసుకుని తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూసేవారు అన్ని దేశాల్లోనూ బయల్దేరారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతోపాటు, ప్రజల్లో చైతన్యం కలిగించడం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం.

మరిన్ని వార్తలు