వివక్ష అంతమే కీలకం

5 Sep, 2018 00:17 IST|Sakshi

లా కమిషన్‌ తన తన పదవీకాలం పూర్తయిన చివరిరోజున అనేక ప్రధానాంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇటీవలికాలంలో తరచు చర్చనీయాంశం అవుతున్న ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదనపై 185 పేజీల సమాలోచన పత్రాన్ని విడుదల చేసింది. పౌర స్మృతి అవసరం ఇప్పుడు లేదని, వర్తమాన పరిస్థితుల్లో దాన్ని తీసుకురావడం వాంఛనీయం కూడా కాదని కమిషన్‌ అభిప్రాయపడింది. ఇప్పుడున్న వివిధ వైయక్తిక(పర్సనల్‌) చట్టాల్లో ఉన్న వివక్షను అంత మొందించి వాటన్నిటిలో సమానతకు తావిచ్చేలా మార్పులు చేయొచ్చునని కూడా సూచించింది. మన రాజ్యాంగం పౌరులందరినీ సమానంగా పరిగణించింది. కుల, మత, లింగ ప్రాతిపదికన ఎవరిపైనా వివక్ష ప్రదర్శించకూడదని నిర్దేశించింది. కానీ విషాదమేమంటే... వేర్వేరు మతాలకు చెందిన వైయక్తిక చట్టాల్లో ఏదో మేర ఈ వివక్ష కొనసాగుతోంది. లా కమిషన్‌ చెప్పినట్టు వీటిని సవరిస్తే నిజానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమే ఉండదు.

ఉమ్మడి పౌర స్మృతిపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పిన మాటలైనా, రాజ్యాంగంలోని 44వ అధికరణను చూసినా లా కమిషన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరికాదన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. ఏదో ఒకనాటికి దేశం ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించుకోగలదన్న ఆశాభావాన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ అప్పట్లో వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఒకటైన 44వ అధికరణ నిర్దేశిస్తున్నది. ఇప్పుడు లా కమిషన్‌ సూచనలు ఈ స్ఫూర్తికి భిన్నమైనవిగా అనిపించినా సామాజికంగా, సాంస్కృతికంగా అనేక వైవిధ్యతలతో నిండిన మన దేశంలో అందరికీ ఉమ్మడిగా వర్తించే వైయక్తిక చట్టాలు ఉండాలనుకోవటం సరికాదు. సమస్య ఆ చట్టాల్లోని వివక్షదే అయినప్పుడు దాన్ని పారదోలగలిగితే తమ తమ వ్యక్తిగత విశ్వాసాలకు అను గుణంగా ఎవరు ఏ వైయక్తిక చట్టం అనుసరించినా సమస్య ఉండదు. నిజానికి రాజ్యాంగసభలో 44వ అధికరణపై చర్చలు తీవ్రంగా జరిగాయి. సభ్యులంతా మత ప్రాతిపదికన విడిపోయారు. ఆ సమయంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ ఈ అధికరణను మైనారిటీలపై రుద్దే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 

వివిధ మతస్తులకు వారి వారి సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా వేర్వేరు వైయక్తిక చట్టాలున్నాయి. వివాహం, విడాకులు, పునర్వివాహం, దత్తత, వారసత్వం, గార్డియన్‌షిప్‌ వగైరా అనేక అంశాలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏ మతాచారాలైనా, విశ్వాసాలైనా రాజ్యాంగ  విరుద్ధమైనప్పుడు, లింగ సమానత్వాన్ని నిరాకరిస్తున్నప్పుడు వాటిని రద్దు చేయాల్సిందేనని లోగడ సుప్రీంకోర్టు చెప్పింది. మన చట్టాలు వివిధ మతాలకుండే వైయక్తిక చట్టాలను గుర్తించాయి. కానీ ఆ చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడే చెల్లుబాటవుతాయన్నది సర్వోన్నత న్యాయస్థానం భావన. స్త్రీల పట్ల వివక్ష చూపుతున్న ఏకపక్ష తలాక్‌ విధానాన్ని, నికా హలాలా, బహుభార్యత్వ ఆచారాలను రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలని, వాటిని నిషేధించాలని రెండేళ్లక్రితం కొందరు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అంతక్రితమే ఉమ్మడి పౌరస్మృతిపై అడపా దడపా చర్చలు జరుగుతున్నా ఆ కేసు సందర్భంగా అది మరింతగా చర్చలోకొచ్చింది. ఆ సమయంలోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ‘ఉమ్మడి పౌరస్మృతి’కి సంబంధించిన వివిధ అంశాలను పరి శీలించాల’ని లా కమిషన్‌ను కోరింది. 

ఉమ్మడి పౌరస్మృతి అంశంపై కమిషన్‌ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. చాలా అంశాలను లోతుగా పరిశీలించింది. మహిళల పట్ల వివక్ష అన్నది కేవలం ముస్లిం వైయక్తిక చట్టాల్లో మాత్రమే ఉందనుకోనడం పొరపాటు. హిందూ, పార్సీ వైయక్తిక చట్టాల్లో సైతం ఇలాంటి ధోరణులున్నాయి. దాంపత్య పునరుద్ధరణ హక్కులు, సహభాగిత్వం, వివాహేతర సంబంధాల్లో జన్మించిన పిల్లల హక్కులు, దత్తత, సంరక్షకత్వం వగైరా అంశాల్లో ఎన్నో లోపాలున్నాయి. పార్సీ చట్టాల్లో కూడా కొన్ని సమస్యలున్నాయి. అన్యమతస్తుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు వారసత్వ హక్కు లేదు. పిల్లల సంరక్షణకు సంబంధించి కూడా వివిధ వైయక్తిక చట్టాల్లో వేర్వేరు విధానాలున్నాయి. బహు భార్యత్వం, వైవాహికేతర సంబంధాలు, నికా హలాలా వంటి అంశాలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. అలాగే ఓటేయడానికి 18 ఏళ్ల అర్హత చాలన్నప్పుడు పెళ్లికి మాత్రం మగవాడి వయసు కనీసం 21 ఏళ్లుండాలని, ఆడపిల్లకు 18 ఏళ్లు సరిపోతాయని నిర్దేశించటం అహేతుకమవుతుంది. దీనివల్ల భార్యాభర్తల్లో భార్య మగవాడికన్నా తక్కువ వయసు కలిగి ఉండాలనే అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. వీటన్నిటిపైనా సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి వివిధ వైయక్తిక చట్టాల్లో వివక్షకు తావిస్తున్న నిబంధనలను సవరిస్తే, ప్రజాస్వామిక అవగాహనకు అనుగుణమైన నిబంధనలు ఏర్పరిస్తే దానివల్ల మంచి ఫలితాలుంటాయి. అటువంటి ప్రయత్నం మున్ముందు ఉమ్మడి పౌరస్మృతికి బాటలు పరిస్తే మంచిదే.

లా కమిషన్‌ చేసిన మరో మంచి సూచన రాజద్రోహ నేరానికి సంబంధించింది. ఈ నేరానికి సంబంధించిన ఐపీసీ 124ఏ సెక్షన్‌ దుర్వినియోగమవుతున్నంతగా మన దేశంలో మరేదీ కావటం లేదు. మాట, రాత, గీత, నినాదం... ఇలా ఏం చేసినా ఈ సెక్షన్‌ కింద కేసులు పెట్టడం ఈమధ్య కాలంలో ముదిరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేయటం రాజద్రోహమ వుతోంది. అత్యంత కఠినమైన ఈ చట్టాన్ని న్యాయనిపుణులతో, భిన్నవర్గాలవారితో చర్చించి సవ రించాలని కమిషన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగినది. ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమర్శలకూ, అభిప్రాయాలకూ, ఆలోచనలకూ చోటీయకపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకో దని కూడా నిర్మొహమాటంగా చెప్పింది. వైయక్తిక చట్టాలు, రాజద్రోహం అంశాల్లో లా కమిషన్‌ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన మార్పులు తలపెడితే మన ప్రజాస్వామ్యానికి అర్ధం, పరమార్ధం ఉంటాయి.
 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు