భాషా వివాదం!

19 Sep, 2019 00:27 IST|Sakshi

ఎప్పటిలాగే హిందీపై పెను వివాదం రేగింది. ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అందుకు కారకులయ్యారు. ‘హిందీ దివస్‌’ సందర్భంగా మొన్న శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశానికి ఉమ్మడి భాషగా హిందీ ఉండాలని, అప్పుడే మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ కన్న కలలు నెరవేరతాయని చెప్పడం ఈ వివాదానికి మూలం. అయితే హిందీని ద్వితీయ భాషగానైనా నేర్చుకోవాలన్నదే తన ఉద్దేశమని షా వివరణ ఇచ్చారు. మన దేశానికి జాతీయ భాష లేదు. కేంద్ర స్థాయిలో అధికార భాషగా హిందీ, ఇంగ్లిష్‌ ఉన్నాయి. రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ భాషలు అధికార భాషలుగా ఉంటున్నాయి. 1960 ప్రాంతంలో హిందీ భాషను ‘రుద్దడాన్ని’ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో పెద్దయెత్తున ఆందోళనలు పెల్లు బికాయి. ఆ తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకొచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషల్ని ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌ గుర్తించింది.

హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో కేంద్రం ఇంగ్లిష్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధి కార భాషల చట్టాన్ని సవరించారు. దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే డజను రాష్ట్రాల్లో మాతృ భాష హిందీయేనని పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణలో తేలుతుంటుంది. అలాగని ఆ రాష్ట్రాల్లో అన్నిచోట్లా దాన్ని ఒకేలా మాట్లాడరు. అక్కడ హిందీకి దగ్గరగా ఉండే బ్రజ్‌ భాష, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీవంటి 49 రకాల పలుకుబడులున్నాయి.‘ప్రామాణిక హిందీ’ పాఠ్యపుస్తకాలకూ, ప్రభుత్వ లావాదేవీలకూ మాత్రమే పరిమితం. 1805లో బ్రిటిష్‌ వలసపాలకుల ఆదేశాలమేరకు కోల్‌కతాలోని ఫోర్ట్‌ విలియం కళాశాలలో పనిచేసే నలుగురు మున్షీలు ఈ ‘ప్రామాణిక హిందీ’ని రూపొందించారు. మొత్తంగా హిందీయేతర భాషలు మాట్లాడేవారు దేశంలో 60 శాతంమంది ఉంటే... హిందీ, దానికి దగ్గరగా ఉండే భాషలు మాట్లాడేవారు 40 శాతంమంది. వాస్తవాలిలా ఉంటే హిందీ భాష మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనడం అవివేకం. 

ఇప్పుడు అమిత్‌ షా ప్రకటనను ఇతర పార్టీలతోపాటు కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకిస్తున్నదిగానీ...ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో హిందీకి అగ్రాసనం వేయాలని ప్రయత్నించింది. 2008లో దేశంలో హిందీ వినిమయాన్ని పెంచడం కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రతి పాదనలే దీనికి రుజువు. మెట్రిక్, ఆ పైస్థాయి అభ్యర్థులకు  ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్నది ఆ ప్రతిపాదనల్లో ఒకటి. అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన వల్ల హిందీ భాషా ప్రాంత అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందుతారని, ఇతర రాష్ట్రాల వారు నష్టపోతారని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి తమ పార్టీయే నేతృత్వం వహిస్తున్నా ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పారు. మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతి రేకత రావడంతో ఆ ప్రతిపాదన మూలనబడింది. ఈమధ్య విడుదలైన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో సైతం హిందీకి అగ్ర తాంబూలం ఇచ్చే ప్రతిపాదన ఉంది. దాని ప్రకారం ఆరో తరగతి మొదలుకొని హిందీ భాషా ప్రాంతాల పిల్లలు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో ఆధునిక భాష నేర్చుకోవచ్చు. హిందీయేతర ప్రాంతాల విద్యార్థులు మాత్రం హిందీ, ఇంగ్లిష్‌లతోపాటు స్థానిక భాష నేర్చుకోవచ్చునని ఆ ప్రతిపాదన అంటున్నది.

సారాంశంలో ఈ ప్రతిపాదన హిందీని తప్పనిసరి చేస్తున్నది. మన రాజ్యాంగం త్రిభాషా సూత్రాన్ని గుర్తించింది. అధికార భాషల చట్టం కూడా ఈ విషయంలో స్పష్టతతో ఉంది. కానీ పాలకులు మాత్రం ఎప్పటికప్పుడు హిందీని ఉన్నత పీఠం ఎక్కిం చాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకే భాష మాట్లాడేవారి మధ్య సదవగాహన, సహోదరత్వం వంటివి పెంపొందుతాయన్నది వాస్తవమే. కానీ ప్రాంతీయ భాషలకు విలువీయకుండా, వాటి నెత్తిన మరో భాషను రుద్దుతామంటేనే పేచీ వస్తుంది. మన దేశంలో భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదా యాలు వర్థిల్లుతున్నాయి. ఈ భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ విశిష్టత. ఫలానా భాష నేర్చుకోమని లేదా నేర్చుకోరాదని నిర్బంధంగా అమలు చేస్తే అది తమ భాషా సంస్కృతులకు ముప్పు కలగ జేస్తుందన్న సంశయం కలుగుతుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో సైతం ఈ భాషా సమస్య ఎంత రగడ సృష్టించిందో మరిచిపోకూడదు. హిందీని ఉమ్మడి భాషగా ప్రకటించాలని బ్రిటిష్‌ ప్రభు త్వాన్ని కోరుతూ భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో పురుషోత్తందాస్‌ టాండన్‌ నేతృత్వంలో కొందరు ఉత్తరాది రాష్ట్రాల నాయకులు తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పుడు ఎన్‌జీ రంగా తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు.   

ఇవాళ చదువుల నిమిత్తమో, ఉపాధికోసమో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావటం తప్పనిసరైంది. కనుక దేశ పౌరులంతా హిందీతోసహా ఏ భాషనైనా ఇష్టంతో, ప్రేమతో నేర్చుకోవడాన్ని పాలకులు ప్రోత్సహించాలి. దక్షిణాదివారికి పొరుగు రాష్ట్రంలోని ప్రాంతీయ భాష... ఉత్తరాదివారికి దక్షిణాది రాష్ట్రాల్లోని భాషలు నేర్చుకుంటే వాటివల్ల ప్రయోజనమే తప్ప చేటు కలగదు. దేశంలో హిందీ చలనచిత్రాలు, సీరియళ్లు, నెట్‌ఫ్లిక్స్‌వంటి సామాజిమాధ్యమాల ద్వారా విడుదలవుతున్న చిత్రాలు హిందీని దేశ ప్రజలకు అలవాటు చేస్తున్నాయి. అక్కడి సంస్కృతీ సంప్ర దాయాలపై అవగాహన కలిగిస్తున్నాయి. భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసినా... ఉద్యోగా వకాశాలకు షరతుగా మార్చినా ఆందోళనలు చెలరేగుతాయి. ఆ భాషపై విముఖతను పెంచుతాయి. ఒక భాష ఉన్నతమైనదనడం ఇతర భాషలను తక్కువ చేయడమే అవుతుంది. కనీసం ఇప్పుడు దేశంలో చెలరేగిన వ్యతిరేకత చూశాకైనా నేతలు హిందీ దురభిమానాన్ని కట్టిపెట్టాలి. 

మరిన్ని వార్తలు