ఘోర విషాదం

17 Sep, 2019 00:53 IST|Sakshi

ప్రకృతి అందాల్ని వీక్షించేందుకు ఎంతో ఉత్సాహంగా పాపికొండల యాత్రకు బయల్దేరిన పర్యాట కులు ఊహించనివిధంగా పెను విషాదంలో చిక్కుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 73మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఘటన జరిగిన సమీపంలో 8 మృతదేహాలు లభ్యంకాగా 27మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగలిగారు. మరో 38మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద ప్రాంతం గురించి స్థానికులు చెబుతున్న అంశాలు గమనిస్తే పడవ నడిపినవారికి దాన్ని గురించి కాస్తయినా అవగాహనలేదని అర్ధమవుతుంది. ప్రమాద స్థలి కచ్చులూరు వద్ద 315 అడుగుల లోతుండగా, అక్కడ నది వెడల్పు కేవలం 300 మీటర్లేనని అంటున్నారు. పైగా దానికి సమీపంలోనే కొండ ఉండటం వల్ల నీటి ఉరవడి అధికంగా ఉంటుంది. పర్యవసానంగా అక్కడ సుడులు ఎక్కు వుంటాయి. కనుకనే పడవ నడపడంలో అనుభవం ఉన్నవారెవరూ అటువంటి ప్రాంతానికి వెళ్లే సాహసం చేయరు. కానీ అందుకు భిన్నంగా ఈ పడవను నడిపిన సరంగులిద్దరూ అటువైపు తీసు కెళ్లారు. తీరా తప్పును సరిదిద్దుకుని, అక్కడినుంచి బయటకు రావడం కోసం ఇంజను వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో స్టీరింగ్‌కు ఉన్న తీగ తెగి ఇంజన్‌ ఆగిపోయి, పడవ నిలిచిపోయింది. చివరకు ఆ సుడుల్లో చిక్కుకుని తలకిందులైంది. గల్లంతైన చాలామంది పర్యాటకుల్లో అత్యధికులు ఈ తలకిందులైన పడవ కింద చిక్కుకుని ఉంటారని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం అంచనా వేసింది. పడవ నడిపిన ఇద్దరూ ఈ ప్రాంతానికి చెందినవారు కాకపోవడం వల్లనే ప్రమాదాన్ని పసిగట్ట లేకపోయారని స్థానికులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈసారి గోదావరి, కృష్ణా నదులు రెండింటిలోనూ వరద నీరు అత్యధికంగా ఉంది. ముఖ్యంగా గోదావరిలో దాదాపు అయిదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.  

పడవ ప్రయాణం ఆహ్లాదకరంగా, సురక్షితంగా సాగాలంటే ఏం చేయాలో, ఎలాంటి ప్రమా ణాలు పాటించాలో, ఏయే విభాగాలు ఎలాంటి విధులు నిర్వర్తించాలో వివరించే పుస్తకాన్ని రెండేళ్ల క్రితం జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) విడుదల చేసింది. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో జల రవాణా తక్కువే. చవగ్గా అయ్యేందుకు, కాలుష్యం తగ్గించేందుకు జల మార్గాల వినియోగాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది. కనుక పడవల వినియోగం మున్ముందు మరింత పెరుగుతుంది. దానికి అవసరమైన ప్రమాణాలు ఖరారు చేసేందుకు మరింత నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పడవల యజమానులు, సిబ్బంది మొదలుకొని పర్యాటకుల వరకూ ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడాలి. ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం పెంచాలి. అలాగే నదీ జలాల మార్గాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో, ఏయే ప్రాంతాలవైపు పడవలు వెళ్లకూడదో తెలిపేవిధంగా స్థానికుల సాయంతో మాన్యువల్‌ రూపొందించాలి. పడవ నడిపేవారికి ఆ మాన్యువల్‌ క్షుణ్ణంగా తెలుసో లేదో... ప్రయాణ సమయాల్లో వారు పర్యాటకులకు ఎలాంటి సూచనలిస్తున్నారో, అవి అందరూ పాటిం చేలా ఏం చర్యలు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు చూసేందుకు పర్యవేక్షక వ్యవస్థ ఉండాలి. పడవ ప్రయాణం చేసేవారు లైఫ్‌ జాకెట్లు ధరించాలన్న నిబంధన ఉన్నా పలు సందర్భాల్లో దీన్ని పట్టించుకునేవారుండరు. చాలా ప్రమాదాల్లో లైఫ్‌ జాకెట్లు ధరించకపోవడం వల్లే మరణాలు సంభ విస్తున్నాయి. అలాగే ప్రయాణికులు ప్రకృతి అందాలు చూసేందుకు అవగాహన లేమితో ఒకేవైపు చేరతారు. అది కూడా ప్రాణాంతకమవుతోంది. అలాగే వినియోగంలో ఉన్న పడవల భద్రతా ప్రమాణాలెలా ఉన్నాయో, వాటి సామర్థ్యం ఏపాటో చూడాలి. నిబంధనలు పాటించనివారిపై కేసులు పెట్టాలి. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న పడవకు వచ్చే నవంబర్‌ వరకూ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉన్నదంటున్నారు. అయితే నిబంధనల ప్రకారం 20కి మించి ప్రయాణించే పడవకు రెండో ఇంజన్‌ ఉండాలి. కానీ దీనికున్న రెండో ఇంజన్‌ కాస్తా చెడిపోయింది.

వివిధ కోణాల్లో సమగ్రంగా అన్ని అంశాలను పరిశీలించి అనుమతులిచ్చే నిర్దిష్టమైన వ్యవస్థ ఉంటే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమల్లోకి తెస్తామంటున్న వ్యవస్థ ఈ లోటు తీరుస్తుంది. ఆయన ప్రతిపాదించిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ వ్యవస్థలో నీటిపారుదల, పర్యాటక శాఖ వగైరాల భాగస్వామ్యం ఉంటుంది. అలాగే పడవల రాకపోకలపై నిఘా పెట్టేందుకు గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి వ్యవస్థలు అందుబాటులో లేనందువల్ల ఇన్నాళ్లూ ఎవరు ఎందుకు అనుమతులిస్తున్నారో, ఎందుకు నిరాకరిస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది. ఇది పడవ యజమానులకు వరంగా మారుతోంది. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న పడవను దేవీపట్నం వద్ద పోలీసులు తనిఖీ చేసి నిలిపేస్తే, తమకు పోలవరం పోలీసుల అనుమతి ఉందని చెప్పి నిర్వాహకులు పడవను తీసుకెళ్లారని చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించడం, దాని ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షించదగ్గది. 

ప్రమాద సమయంలో కచ్చులూరులోని అడవిబిడ్డలు ప్రదర్శించిన మానవీయత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాన్ని గమనించిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా వారు నాటుపడవల్లో బయల్దేరారు. లైఫ్‌ జాకెట్లు ధరించి కొట్టుకుపోతున్న వారెందరినో రక్షించారు. ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులైనవారు ఎలా స్పందించాలో వారు ఆచరించి చూపారు. గత 30 ఏళ్లలో  గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదాల్లో వందమందికిపైగా కన్నుమూశారు. మున్ముందు ఇలాంటి ప్రమాదాలకు తావీయని రీతిలో అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తారని, ఈ విషాద ఉదంతం అందుకు ఒక గుణపాఠం కావాలని ఆశిద్దాం. 

మరిన్ని వార్తలు