కోట ఆసుపత్రి మృత్యుగీతం

3 Jan, 2020 00:01 IST|Sakshi

రాజస్తాన్‌లోని కోట నగరంలోవున్న జేకే లోన్‌ ప్రభుత్వాసుపత్రిలో నెల రోజుల వ్యవధిలో వంద మంది శిశువులు మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ వరస మరణాలపై మీడియాలో కథనాలు వెలువడ్డాక నాయకులు మేల్కొన్న దాఖలా కనబడింది. కోట స్థానం నుంచి గెలుపొందిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఈ మరణాలపై చేసిన ట్వీట్‌ చూశాక ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ స్పందించి ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హెచ్‌ ఎల్‌ మీనాను తొలగించి,  దాని పర్యవేక్షణ బాధ్యతల్ని వైద్య విద్యా శాఖ కార్యదర్శికి అప్పగించారు. కానీ అంతకు మినహా ప్రత్యేకించి తీసుకున్న దిద్దుబాటు చర్యలేవీ లేవని ఆ తర్వాత కూడా కొనసాగిన శిశు మరణాలు వెల్లడించాయి. డిసెంబర్‌లో మొదటి 24 రోజుల్లో 77మంది పిల్లలు చనిపోగా 23–24 మధ్య మరో పదిమంది మరణించారు. ఈ అయిదారు రోజుల్లో మరో 13మంది చనిపోయారు. న్యూమోనియా మొదలుకొని విషజ్వరాల వరకూ అనేక కారణాలతో ఇవి సంభవించాయి.

కోటలోని ప్రభుత్వాసుపత్రి అతి పెద్దది. 2014 మొదలుకొని అక్కడ సగటున ఏటా వేయిమంది పిల్లలు మృతి చెందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు ఆ సైతం ఆ సంఖ్య 900 దాటింది. రెండేళ్లక్రితం 63మంది శిశువుల ప్రాణాలు హరించిన గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిగానీ, ఇప్పుడు కోట ఆసుపత్రిగానీ మన దేశంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ప్రత్యక్ష ఆనవాళ్లు. నిరుపేద రోగులు జబ్బుపడితే దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తప్ప తగుమాత్రం వైద్య సౌకర్యాలు లభ్యమయ్యే ప్రభుత్వాసుపత్రికి చేరుకోవడం అసాధ్యమవుతోంది. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సౌకర్యాలు ఇప్పటికీ సక్రమంగా అందటం లేదు. ప్రాథమిక వైద్య కేంద్రాలు పెద్ద సంఖ్యలోనేవున్నా అక్కడ అవసరమైన మందులు లభ్యం కావడం లేదు. వైద్యులు అందుబాటులో వుండటం లేదు. కనుకనే రోగంబారిన పడినవారు ఇరుగు పొరుగు ఇచ్చే సలహాతో ఏదో ఒకటివాడి, అది ముదిరాక పెద్దాసుపత్రులకు వెళ్తున్నారు. కానీ అక్కడ సైతం అరకొర సౌకర్యాలే లభ్యమవుతున్నాయి.

ఇప్పుడు కోట ప్రభుత్వాసుపత్రిలోనూ అదే సమస్య. ఒకపక్క ఆ రాష్ట్రంలో ఎముకలు కొరికే చలివుండగా ఆ ఆసుపత్రికి తలుపులు, కిటికీలు కూడా సక్రమంగా లేవని దాన్ని సందర్శించిన జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తెలిపింది. ఆ ఆసుపత్రి ఆవరణలో పందులు తిరుగాడుతున్నాయని వివరించింది. ఒక శిశువును ఉంచాల్సిన మంచంపై ఇద్దరు ముగ్గుర్ని వుంచి వైద్యం చేస్తున్నారని ఆరోపించింది. కోట ఆసుపత్రిలో ఇంకా వైపరీత్యాలున్నాయి. శిశువుకు తగినంత వెచ్చదనాన్ని అందించడానికి వినియోగించే రేడియెంట్‌ వార్మర్‌లు 70 శాతం పనికిమాలినవేనని కమిషన్‌ తెలిపింది. అలాగే నలుగురు శిశువుల సంరక్షణకు ఒక నర్సు వుండాలని నిబంధనలు చెబుతుంటే కోట ఆసుపత్రిలో 13మందికి ఒక నర్సు పని చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్సకు వినియోగించే ఉపకరణాలు మొత్తం 533 వుండగా సరైన నిర్వహణ కొరవడిన కారణంగా అందులో 320 పనిచేయడం లేదని కమిషన్‌ ఎత్తిచూపింది. ఆపదలోవున్న నవజాత శిశువులకు కావలసిన ఆక్సిజెన్‌ను సిలెండర్ల ద్వారా కాక పైప్‌లైన్ల ద్వారా అందించాల్సివుండగా ఆ సదుపాయమే లేదని పేర్కొంది. ఇన్ని లోపాలున్నప్పుడు కోట ప్రభుత్వాసుపత్రిలో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకోవడంలో వింతేమీ లేదు. అటువంటివి జరగకపోతే ఆశ్చర్యపోవాలి.

ప్రసూతి మరణాలు, శిశు మరణాలు అరికట్టడంలో మన దేశం కొంత మేర ప్రగతి సాధించింది. 2006లో ప్రతి వేయిమంది శిశు జననాల్లో 57 మరణాలుంటే 2013నాటికి ఆ మరణాల సంఖ్య 33కి తగ్గింది. అలాగే ప్రసూతి మరణాలు కూడా 26.9 శాతం తగ్గాయి. అయితే  ఇప్పటికీ ఇంక్యుబేటర్లు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు సక్రమంగా లేక ప్రభుత్వాసుపత్రుల్లో నెలలు నిండని శిశువుల మరణాలు, బలహీన శిశువుల మరణాలు ఇంకా అధికంగానే వుంటున్నాయి. రాజస్తాన్‌లోని పెద్ద నగరంలోని పెద్దాసుపత్రిలో పిల్లలకు చికిత్స చేయడానికి అవసరమైన సదుపాయాలు లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ఆసుపత్రికి ఎక్కువమంది శిశువులు ఎలాంటి అనారోగ్య సమస్యలతో వస్తారో, వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు అవసరమవుతాయో ఆసుపత్రి నిర్వహణకు బాధ్యతవహించే అధికారులకు తెలియదనుకోలేం. ఆ రాష్ట్రంలోని ఆరోగ్యమంత్రిత్వ శాఖకు అవగాహన లేదనుకోలేం. ఏటా అదే ఆసుపత్రిలో వేయిమంది పిల్లలు మరణిస్తుంటే కారణమేమిటని ఆరా తీసేంత తీరిక కూడా వీరెవరికీ లేకపోయింది. పైగా చికిత్సపరంగా ఎలాంటి లోపాలూ లేవని ముఖ్యమంత్రి గెహ్లోత్‌ చెప్పుకుంటున్నారు. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 2019లో మరణాలు తగ్గాయంటున్నారు. కానీ తాను అధికారంలోకొచ్చి ఏడాదైనా కోట ఆసుపత్రిలో ఉపకరణాలు అంత అధ్వాన్న స్థితిలో ఎందుకున్నాయో, తగినంతమంది సిబ్బంది ఎందుకు లేరో...ఇలాంటì  ఆసుపత్రులు మరెన్ని వున్నాయో గెహ్లోత్‌ ఆత్మ విమర్శ చేసుకునివుంటే బాగుండేది.

ఇప్పుడు కోట ఆసుపత్రిలో సంభవించిన వరస మరణాలు చూశాకైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. ఆసుపత్రుల్లో వున్న లోటుపాట్లేమిటో సమీక్షించుకుని సరిదిద్దుకోవాలి. 2030కల్లా ప్రపంచ దేశాలన్నీ సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పదిహేడింటిలో పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, నాణ్యత గల విద్య వగైరాలతోపాటు ఆరోగ్యం కూడా వుంది. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలను మెరుగుపరచవలసివుంది. అయిదేళ్ల లోపు శిశు మరణాల నియంత్రణలో, ప్రసూతి మరణాల నియంత్రణలో మన దేశం మెరుగైన స్థితిలో వున్నదని అంతర్జాతీయ జర్నల్‌ లాన్‌సెట్‌ తెలిపింది. ఆరోగ్యరంగానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచి ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిస్తే తప్ప వ్యాధుల్ని అరికట్టడంలో, పసిపిల్లల మరణాలు నియంత్రించడంలో పూర్తి విజయం సాధించలేం. 

మరిన్ని వార్తలు