మాజీ నియంతకు మరణశిక్ష

18 Dec, 2019 00:17 IST|Sakshi

పాకిస్తాన్‌ను ఒక అర్థరాత్రి చెరబట్టి, ఏ రకమైన ప్రజామోదమూ లేకుండా తొమ్మిదేళ్లపాటు పాలించి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిన జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌కు అక్కడి ప్రత్యేక న్యాయ స్థానం దేశద్రోహ నేరంకింద మరణశిక్ష విధించడం ఆ దేశంలో మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌కి వెళ్లినప్పుడు ఈ శిక్ష నిలబడుతుందా... పాక్‌ సైన్యం ఈ తీర్పును ఎలా పరిగణిస్తుందన్న అంశాలు పక్కనబెడితే పాకిస్తాన్‌ చరిత్రలో సైనిక కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న సైనికాధికారికి పౌర న్యాయస్థానంలో మరణశిక్ష పడటం ఇదే ప్రథమం. ఇప్పటికే అనారోగ్యంతో దుబాయ్‌ ఆసుపత్రిలో ఉన్న ముషార్రఫ్‌ తన వాదన వినకుండా తీర్పునిచ్చారని, తనను వేధిస్తున్నారని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చుగానీ... ఆయన చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు.

1999 అక్టోబర్‌లో అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ శ్రీలంక పర్యటనకెళ్లినప్పుడు రక్తరహిత కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ముషార్రఫ్‌ ఆ తర్వాత వరసబెట్టి ప్రజా స్వామ్య వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ముందుగా మీడియా పీకనొక్కి, ఆ తర్వాత న్యాయవ్యవస్థ పనిపట్టారు. 2007లో దేశంలో రాజ్యాంగాన్ని రద్దుచేసి, కొత్తగా తాత్కాలిక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దానికింద ఎమర్జెన్సీ విధించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ మూర్తులంతా పదవుల్నించి తప్పుకుని కొత్త రాజ్యాంగం కింద ప్రమాణస్వీకారం చేయాలని హుకుం జారీచేశారు. ఈ తాత్కాలిక రాజ్యాంగాన్ని తక్షణం నిలిపేస్తున్నట్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. వీరిని, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇఫ్తెకర్‌ చౌధ్రితోసహా వంద మంది న్యాయమూర్తులను పదవులనుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచారు.

వివిధ హైకోర్టులు, ఆ కిందిస్థాయి న్యాయస్థానాలకు చెందిన 76 మంది న్యాయమూర్తులు కొత్త రాజ్యాంగం ప్రకారం ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ నాయకులందరినీ ఖైదు చేశారు. ఈ చర్య తర్వాత పాకిస్తాన్‌ అంతటా ఆందోళనలు రాజుకోవడంతో ముషార్రఫ్‌ తన ప్రభుత్వాన్ని తానే రద్దు చేసుకుని నేరుగా పాలించడం మొదలుపెట్టారు. అటు సైనిక దళాల చీఫ్‌గా, ఇటు దేశాధ్యక్షుడిగా జోడు పదవుల్లో ఉన్న ముషార్రఫ్‌పై ఏదో ఒక పదవే ఉంచుకోవాలంటూ సైన్యం నుంచి కూడా ఒత్తిళ్లు రావడంతో సైనిక దళాల పదవికి స్వస్తి చెప్పి అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించు కున్నారు. తనకు ఆప్తుడైన ఐఎస్‌ఐ చీఫ్‌ కయానీకి సైనిక దళాల చీఫ్‌ పదవి కట్టబెట్టారు. రాజ్యాం గాన్ని రద్దు చేసిన కేసులోనే ఇప్పుడు ముషార్రఫ్‌కు ఇప్పుడు మరణశిక్ష పడింది.

తనను ఏరి కోరి తెచ్చుకున్న నవాజ్‌ షరీఫ్‌కు తాను ఎసరు పెట్టినట్టే... తాను తెచ్చుకున్న జనరల్‌ కయానీ తనకే ఎదురు తిరగడం ముషార్రఫ్‌కు అనుభవంలోకొచ్చింది. 2008 ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ముషార్రఫ్‌ కనుసన్నల్లో పనిచేసే పీఎంఎల్‌–క్యూ తుడిచిపెట్టుకుపోగా పీపీపీ ఘనవిజయం సాధించింది. తన టక్కుటమార విద్యలన్నీ విఫలమయ్యాయని గ్రహించాక ఇక అయిష్టంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. పౌర ప్రభుత్వాలను కబ్జా చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైనికాధికారుల్లో ముషార్రఫ్‌ మొదటివారేమీ కాదు. ఆ దేశం దాదాపు 35 ఏళ్లపాటు సైనిక పదఘట్టనల్లోనే బతుకీడ్చింది. తమ పాలనలోని అవినీతి జనం కళ్లబడకుండా, పేదరికం, అవిద్య, నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాల జోలికి వారు పోకుండా ఇస్లామిక్‌ సిద్ధాంతం పేరు చెప్పి ప్రజలను బుజ్జగించడం సైనిక పాలకులు అనుసరిస్తూ వచ్చిన వ్యూహం.

ఆ తానులో ముక్కగా ముషార్రఫ్‌ కూడా దాన్నే కొనసాగించారు. అటు అఫ్ఘాన్‌లో తాలిబన్‌లకు బహి రంగంగా సహాయసహకారాలిస్తూ, భారత్‌లో ఉగ్రవాద దాడులు చేసేందుకు ప్రోత్సహించారు. పాక్‌లో తన చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వం అవసరం గనుక అమెరికా ఈ కుట్రలన్నిటికీ సహక రిస్తూ వచ్చింది. 2001లో అమెరికాపై ఉగ్రవాదులు దాడులు చేశాక ఇదంతా మారక తప్పలేదు. ఆ తర్వాత చాటుమాటుగా ఉగ్రవాదులకు మద్దతు పలుకుతూ వచ్చారు. ఈ సంస్కృతిని ఇంకా పాక్‌ విడనాడలేదు. 

ఇప్పుడు తీర్పు వెలువరించిన ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టించిన వైనాన్ని గమనిస్తే, ముషార్రఫ్‌ను కాపాడటానికి అది ఎన్ని పాట్లు పడిందో అర్థమవుతుంది. ఈ పనంతా మొదట్లో ముషార్రఫ్‌ చేసుకోవాల్సి వచ్చింది. 2013నాటి ఈ కేసు విచారణలో అడుగు ముందుకు పడకుండా ఎప్పటికప్పుడు ఆయన ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూనే వచ్చారు. అవన్నీ వృధాయేనని అర్థమయ్యాక 2016లో ఆయన కొద్దిరోజుల్లో తిరిగొస్తానని నమ్మబలికి దేశం నుంచి నిష్క్రమించారు. ఈ మూడేళ్లూ చడీచప్పుడూ చేయని ఇమ్రాన్‌ సర్కార్‌ ఇక తీర్పు వెలువడటం తథ్యమని తెలిశాక ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వకుండా ఆపాలంటూ పిటిషన్‌ వేసింది.

అలా నెలరోజులు గడిచిపోయింది. ఆ అడ్డంకి కూడా అధిగమించి ఈ నెల 17న తీర్పునిస్తామని ఈ నెల 5న ప్రకటించాక ముషార్రఫ్‌తో పాటు అప్పటి ప్రధాని షౌకత్‌ అజీజ్, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్‌ హమీద్‌ దోగర్, అప్పటి న్యాయమంత్రి జహీద్‌ హమీద్‌లను కూడా నిందితులుగా చేర్చాలంటూ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. వీరందరినీ చేర్చి కొత్తగా విచారించాలని కోరింది. ఇన్నేళ్లపాటు ఏం చేశారంటూ ప్రభుత్వాన్ని మందలించి, పిటిషన్‌ను కొట్టేసి ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరిం చింది. తుది అప్పీల్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ తీర్పును ఎటూ సుప్రీంకోర్టు నిలిపివేస్తుంది. ఆ నిర్ణయం ఇప్పట్లో రాదనే చెప్పాలి. అక్కడ కూడా చుక్కెదురయ్యాక దేశాధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టొచ్చు. కానీ ఆ దేశ రాజకీయాలపై ఇంకా సైన్యం పట్టుసడలని వర్తమానంలో ఈ తీర్పు ప్రతీ కాత్మకమైనదే అయినా ఎన్నదగినది. దీని పర్యవసానాలెలా ఉంటాయో మున్ముందు చూడాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా