పట్టుదలగా శ్రమిస్తేనే పతకాలు

4 Sep, 2018 00:31 IST|Sakshi

నలభై అయిదు దేశాలకు చెందిన 1,100మంది క్రీడాకారులు పక్షం రోజులపాటు వివిధ క్రీడాం శాల్లో పరస్పరం తలపడిన ఆసియా క్రీడోత్సవాలు ఇండొనేసియా రాజధాని జకార్తాలో ఆదివారం ముగిశాయి. ఆరంభ వేడుకల్లాగే ముగింపు సంరంభం కూడా కన్నులపండువగా సాగి అందరినీ అలరించింది. ఇటువంటి అంతర్జాతీయ క్రీడా సంబరాలు దేశాల మధ్య సదవగాహనను పెంచు తాయి. ఆరోగ్యకరమైన పోటీని, క్రీడాస్ఫూర్తిని రగిలిస్తాయి. క్రీడా రంగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడమంటే మాటలు కాదు. ఆ అవకాశం దక్కించుకున్న ప్రతి ఒక్కరూ తమ తమ క్రీడల్లో అహర్నిశలూ శ్రమిస్తారు. తమ నైపుణ్యానికి పదునుబెట్టుకుంటారు. ప్రత్యర్థిని మట్టికరిపించి క్రీడాభిమానుల హృదయాల్లో చెరగని ముద్రేయాలని చూస్తారు. అయితే బరిలో అప్పటికప్పుడు మెరుపువేగంతో తీసుకునే సరైన నిర్ణయాలు విజయాన్నందిస్తాయి.

ఎప్పటిలాగే చైనా 132 స్వర్ణాలతో, 92 రజతాలతో శిఖరాగ్రాన నిలిచి వేరెవరూ తన దరిదాపుల్లో కూడా లేకుండా చూసుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యంతో పోలిస్తే ఇది తక్కువే కావొచ్చుగానీ... ఉన్నతమైన కలలు కనగలిగినవారే ముందుకు దూసుకెళ్తారు. చైనా ఆ పనే చేసింది. ‘డ్రాగన్‌’తో తలపడటం మాటలు కాదని ఆ దేశ క్రీడాకారులు నిరూపించారు. బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్, ఈత, జిమ్నా స్టిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్‌ వగైరాల్లో అసమాన ప్రతిభ కనబరుస్తూ వస్తున్న చైనాకు ఫుట్‌ బాల్‌లో సైతం అగ్రభాగాన నిలవాలన్న ఆశ ఎప్పటినుంచో ఉంది. కానీ అది ఇంతవరకూ నెరవేర లేదు. జకార్తాలో ఆ దేశ మహిళా టీం రజతం గెల్చుకున్నా, పురుషుల టీం బోల్తా పడింది. వచ్చే ఆసియా క్రీడోత్సవాలకు చైనాయే ఆతిథ్యమివ్వబోతున్నది గనుక ఫుట్‌బాల్‌లో సైతం బోణీ చేసేం దుకు మరింత పట్టుదలగా శ్రమిస్తుందనుకోవచ్చు. 

మన దేశం ఈసారి 15 స్వర్ణ పతకాలు, 24 రజతాలు, 30 కాంశ్య పతకాలు గెల్చుకుని ఫర్వా లేదనిపించింది. 1951లో జరిగిన తొలి ఆసియా క్రీడోత్సవాల్లో కూడా ఇదే స్థాయిలో స్వర్ణాలు సాధించాం గనుక కనీసం మొదలెట్టిన చోటుకైనా ఇప్పటికి చేరుకోగలిగామని సంతృప్తిపడాలి. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడోత్సవాల్లో కనీసం ఈ మాదిరి ప్రతిభ కూడా మనవాళ్లు కనబరచలేకపోయారు. 1951తో పోలిస్తే మన దేశ జనాభా నాలుగు రెట్లు పెరిగింది. అప్పటితో పోలిస్తే భిన్న రంగాల్లో ఎంతో ముందున్నాం. ఎంచుకున్న రంగంలో సమర్ధతను పెంచుకునేందుకు అనువైన శక్తిసామర్థ్యాలున్నాయి. ఈ కోణం నుంచి చూస్తే ఇప్పుడొచ్చిన పతకాలు తీసికట్టని చెప్పాలి. అంతర్జాతీయ క్రీడా సంబరాలు వచ్చినప్పుడల్లా గంపెడాశలు పెట్టుకోవటం... తీరా మన వాళ్లు ముఖాలు వేలాడేసుకు రావటం రివాజుగా మారింది. ప్రతిసారీ అంతక్రితం కంటే ఎంతో కొంత మెరుగ్గా ఉన్నారని సరిపెట్టుకుని సంతృప్తి పడటం తప్ప ఔరా అనిపించే స్థాయిలో ఆట తీరు ఉండటం లేదు.

అందుకు ఈసారి కొన్ని మినహాయింపులున్నాయి. బహుళ క్రీడాంశాల సమా హారమైన హెప్టాథ్లాన్‌లో పసిడి పతకాన్ని సాధించిన స్వప్న బర్మన్‌ గురించి, బాక్సింగ్‌లో మోత మోగించిన అమిత్‌ పంఘాల్‌ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. వీరిద్దరూ పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగినవారు. తాము ఎంచుకున్న క్రీడల్లో సాధన చేయడానికి కావల్సిన సాధనా సంపత్తులు వారిదగ్గర లేవు. స్వప్నబర్మన్‌ బెంగాల్‌లోని మారుమూల గ్రామంలో ఓ రిక్షా కార్మికుడి కుమార్తె. ఓ చిన్న రేకుల షెడ్డే వారి గూడు. పైగా తండ్రికి అయిదేళ్లక్రితం గుండెపోటు వచ్చి మంచా నికే పరిమితమయ్యాడు. పొట్టిగా ఉండటం వల్ల ఈ ఆటకు పనికిరావని కోచ్‌ తిరగ్గొట్టాడు. కాళ్లకు ఆరేసి వేళ్లుండటం వల్ల బూట్లు ధరించటం ఎంతో కష్టం. వాటికి పనికొచ్చేలా బూట్లు తయారు చేయించుకోవటం ఆమె వల్ల కాని పని. స్వప్న ప్రతిభను ఏ ప్రభుత్వ సంస్థా గమనించలేదు. అదృష్టవశాత్తూ మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రారంభించిన ఒక కార్యక్రమం వల్ల ఈ మట్టిలో మాణిక్యం వెలుగుచూసింది. 68 ఏళ్లనుంచి ఆ ఆటలో ఏ పతకమూ అందుకోలేకపోతున్న మన దేశానికి అనుకోని రీతిలో స్వర్ణాన్ని సాధించింది. బాక్సింగ్‌ స్టార్‌ అమిత్‌పంఘాల్‌ పరిస్థితీ అదే.

బాక్సింగ్‌కు అవసరమైన గ్లోవ్స్‌ కూడా కొనుక్కోవటం అతని శక్తికి మించిన పని. దానికితోడు బాక్సింగ్‌లో ఉండేవారికి మంచి ఆహారం అవసరం. పేదరికం వల్ల అది కూడా పెద్దగా సాధ్య పడలేదు. ఇదే క్రీడలో అతనితోపాటు శిక్షణ పొందిన అతని అన్న అమిత్‌ కోసం బాక్సింగ్‌ నుంచి తప్పుకుని, సైన్యంలో చేరి నెలనెలా డబ్బు పంపుతూ ప్రోత్సహించాడు. ఇలా పడుతూ లేస్తూ శిక్షణ పొందిన అమిత్‌ జకార్తాలో ఓడించింది సాధారణ ప్రత్యర్థిని కాదు. రియో ఒలింపిక్స్‌లో చాంపి యన్‌గా నిలిచిన ఉజ్బెకిస్తాన్‌ క్రీడాకారుడు హసన్‌బోయ్‌ దుస్మతోవ్‌ను! చిత్తశుద్ధితో వెదకాలే గానీ ఇలాంటి స్వప్నలు, అమిత్‌లు దేశంలో వేలాదిమంది ఉంటారు. మెరికల్లాంటి అథ్లెట్ల కోసం టార్గెట్‌ ఒలిపింక్‌ పోడియం స్కీం(టీఓపీ) వంటి ప్రభుత్వ పథకాలున్నాయి. అవి కొందరికి అక్కరకొస్తు న్నాయి కూడా. కానీ చేరాల్సినంతమందికి ఆ పథకాలు చేరటం లేదు. 

వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచేవారిని గుర్తించి వారికి అత్యంత నిపుణులైనవారితో శిక్షణ నిప్పించటం, అవసరమైన సదుపాయాలన్నీ కల్పించి ఏ లోటూ లేకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత. ఈ శిక్షణ, సదుపాయాల కల్పన ఏదో ఒక క్రీడా సందర్భాన్ని పురస్కరించుకుని చేస్తే చాలదు. అదొక నిరంతర ప్రక్రియగా ఉండాలి. దాన్నొక యజ్ఞంగా భావించాలి. పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాంశాలను తప్పనిసరి చేయాలి. ఇతర పాఠ్యాంశాల్లాగే వాటికి కూడా మూల్యాంకన జరుగుతుండాలి. శిక్షణనివ్వడానికి  ప్రతిభావంతులైనవారిని నియమించాలి. అంతే కాదు... విద్యా సంస్థల వెలుపల ఉంటున్న మెరికల్ని కూడా పసిగట్టాలి. మౌలిక సదుపాయాలకు ధారాళంగా నిధులు వెచ్చించాలి. ఇవన్నీ చేయగలిగితే దేశం తలెత్తుకునేలా, గర్వపడేలా అంతర్జాతీయ క్రీడా వేదికలపై మనవాళ్లు కూడా మెరుస్తారు.
 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా