మాల్యా వచ్చేదెపుడు?

13 Dec, 2018 00:39 IST|Sakshi

బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 9,000 కోట్లకు పైగా బకాయిల్ని ఎగ్గొట్టి రెండేళ్లక్రితం దేశం విడిచి పరారైన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను తిరిగి రప్పించే ప్రయత్నంలో తొలి విజయం లభించింది. లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ చీఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆయన్ను తిరిగి భారత్‌కు అప్ప గించడం సబబేనని సోమవారం తీర్పునిచ్చింది. విజయ్‌ మాల్యా దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలతో, బడా నాయకులతో ఎలా చెట్టపట్టాలేసుకుని తిరిగేవాడో అందరికీ తెలుసు. అందుకే ఆయనకు సులభంగా అప్పు దొరికేది. ఒక్క మాల్యాకు మాత్రమే కాదు... దేశంలోని బడా పారి శ్రామికవేత్తలందరికీ బ్యాంకులు ఎప్పుడూ ఎర్ర తివాచీలు పరుస్తూనే ఉన్నాయి. వారిలో చాలా మంది ఎగ్గొట్టే అవకాశం ఉన్నదని తెలిసినా ఇదే వరస. రైతులకు బ్యాంకుల్లో అప్పు దొరకడమే అరుదు.

దొరికినా వారు విధించే సవాలక్ష నిబంధనలు అందుకు ఆటంకంగా నిలుస్తాయి. పర్యవసానంగా వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటారు. కష్టాల సాగుతో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు విజయ్‌ మాల్యా కేసును విచారించిన సందర్భంలో అక్కడి న్యాయస్థానం మన బ్యాంకులపై చేసిన వ్యాఖ్యలు గమనిం చదగ్గవి. రుణాలివ్వడానికి ముందు, తర్వాత కూడా భారతీయ బ్యాంకులు ఆయన మోసాన్ని గ్రహించడంలో విఫలమయ్యాయని న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్‌నాట్‌ విమర్శించారు. ఇది ఉద్దేశ పూర్వకమైన వైఫల్యమా, అమాయకత్వం వల్ల జరిగిందా అన్నది తేల్చడానికి అవసరమైన సాక్ష్యా ధారాలు తన ముందు లేవని వ్యాఖ్యానించారు. ఆమెకు మాల్యా కేసు ఒక్కటే రావడంవల్ల స్పష్టత వచ్చి ఉండదుగానీ... ఎగవేతదార్ల వివరాలు, వారికి సంబంధించిన పత్రాలన్నీ ఇస్తే మన దేశం లోని బ్యాంకింగ్‌ వ్యవస్థను చూసి ఎమ్మాకు కళ్లు తిరిగేవి.
 
ఒకసారి ఒకరి దగ్గర మోసపోతే అమాయకులుగా జమకట్టొచ్చు. కానీ అది రివాజుగా మారినప్పుడు దాన్ని అమాయకత్వం అనరు. కుమ్మక్కు అంటారు. మన దేశంలో జరుగుతున్నది అదే. బ్యాంకుల్ని మోసగించే ప్రక్రియ భారీ యంత్రపరికరాలు దిగుమతి చేసుకోవడం దగ్గరనుంచి మొదలవుతుంది. వాటి వ్యయాన్ని అధికంగా చూపి, ఆ మేరకు అప్పు చేయడంతో మొదలై వివిధ దశల్లో కోట్లాది రూపాయల రుణం తీసుకుంటారు. ఇవన్నీ నిర్దిష్ట కాల వ్యవధిలో చెల్లిస్తుంటే పేచీ ఉండదు. కానీ వారి ఉద్దేశాలే వేరు. అప్పు తీసుకునేది తీర్చడానికి కాదు...ఎగ్గొట్టడానికి. తాము తీర్చకపోయినా ఎవరూ చడీ చప్పుడూ చేయరని, ఏళ్లూ పూళ్లూ గడిచాక వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ కింద, వడ్డీ మాఫీ కింద స్వల్ప మొత్తాలు కట్టించుకుని తమను సులభంగా వదిలేస్తారన్నది వారి భరోసా.

ఇలా ఉద్దేశపూర్వకంగా అప్పులు తీర్చకుండా మొహం చాటేస్తున్నవారి వివరాలు వెల్ల డించాలని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలని నాలుగు నెలలక్రితం కేంద్ర సమాచార హక్కు కమిషన్‌(సీఐసీ) కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖకు, రిజర్వ్‌బ్యాంకును ఆదేశించింది. రూ. 50 కోట్లకు మించి బకాయిపడ్డవారందరి వివరాలూ అందులో ఉండాలని స్పష్టం చేసింది. ఇందులో వైపరీత్యమేమీ లేదు. రైతులు బకాయిలు చెల్లించడంలో ఆలస్యమైతే వారు తనఖా పెట్టిన ఆస్తుల్ని వేలం వేస్తామని బ్యాంకు సిబ్బంది వారి ఇళ్లకెళ్లి బెదిరిస్తారు. నోటీసులు పంపుతారు. కొన్ని సందర్భాల్లో అలాంటి రైతుల ఫొటోలు ఆ బ్యాంకు శాఖల్లో ప్రదర్శిస్తారు.

బకాయిలు చెల్లించని వారి చరాస్తుల స్వాధీనం ప్రక్రియలో ఆల స్యమేమీ ఉండదు. రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) చట్టం కింద చరాస్తులు స్వాధీనం చేసుకోవడం అత్యంత సులభం. దీన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎంతో మంది ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారుల విషయంలో కూడా ఇలాగే చేయాలని ఎవరూ పట్టుబట్టడం లేదు.  కనీసం వారి పేర్లు బహిరంగపరచమని అడుగుతున్నారు. సీఐసీ కోరింది కూడా అదే.  కానీ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పినా కదలని కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌బ్యాంకు సీఐసీ ఆదేశిస్తే కదులుతాయా?  

వరసగా మూడు నెలలపాటు వడ్డీ చెల్లించని రుణాలుంటే వాటిని మొండి బకాయిలుగా పరిగణిస్తారు. వాటిని వసూలు చేసుకోవడం ఎలా అన్న ఆత్రుత అప్పటినుంచి మొదలవుతుంది. కానీ ఇలాంటి బకాయిల సంగతి బయటపెడితే ఖాతాదారుల్లో తమ విశ్వసనీయత దెబ్బ తింటుందన్న కారణంతో బ్యాంకులు ఏం జరగనట్టు ఉండిపోతాయి. అలాగని మరోసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా చూడవు. ఎటూ మొండి బకాయిల సంగతి వెల్లడికాదన్న ధీమాతో, తమకేమీ జరగదన్న భరోసాతో ఇష్టానుసారం రుణాలివ్వడం కొనసాగిస్తున్నారు. విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ లాంటివారు ఈ ధోరణిని ఆసరాగా తీసుకునే వేల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారు. ఇలాంటివారు దేశం విడిచిపారిపోతుంటే అన్ని వ్యవస్థలూ సహకరిస్తున్నాయి.

ఇప్పుడు బ్రిటన్‌ కోర్టు ఇచ్చిన అప్పగింత ఆదేశాలు తమ విజయమని కేంద్రం చెప్పుకుంటోంది. అయితే వీటివల్ల వల్ల ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ ఉండదు. ఆ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాలు చేస్తాడు. అక్కడ తీర్పు వెలువడటానికి మరికొంతకాలం పడుతుంది. ఆ తీర్పు తనకు అను కూలంగా లేకపోతే విజయ్‌మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాడు. అక్కడ సైతం మాల్యాకు భంగపాటు ఎదురయ్యాక కాస్త ఆశ పెట్టుకోవచ్చు. అది కూడా గ్యారెంటీ లేదు. దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు టైగర్‌ హనీఫ్‌ కేసులో అన్ని అవరోధాలూ అధిగమించి అయిదేళ్లు కావస్తున్నాఇంకా అతన్ని ఇక్కడకు రప్పించడం సాధ్యపడటం లేదు. విజయ్‌ మాల్యా వ్యవహారం సాధ్య మైనంత త్వరగా ముగిసేలా చూడటంతోపాటు ఎగవేతదార్ల జాబితా ప్రకటించటం, బకాయిల వసూళ్లకు గట్టిగా ప్రయత్నించటం, రుణాల మంజూరుకు పకడ్బందీ నిబంధనలు రూపొందించటం అత్యవసరం. 

మరిన్ని వార్తలు