చైనా ‘కరోనా’ షాపింగ్‌!

22 Apr, 2020 00:01 IST|Sakshi

సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది. అందుకే మన దేశంలో ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెట్టడానికి అమల్లో వున్న నిబంధనలు సవరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. వాస్తవానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచే వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరమన్న నిబంధన ఇంతక్రితమే వుంది. ‘మన భూభాగంతో సరిహద్దుల్ని పంచుకునే’ దేశాలన్నిటికీ వర్తింపజేయడం ప్రస్తుత ప్రతిపాదన వెనకున్న ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఫెమా చట్టంలోని నిబంధనల్ని సవ రించాల్సివుంది. అలా చేసే ముందు పలు కీలకాంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఏదేమైనా ఇది తగలవలసినవారికే తగిలింది. ఇలాంటి వివక్ష తగదంటూ ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎఫ్‌డీఐలకు సంబంధించిన ఏ నిబంధనైనా వివక్షారహితంగా వుండాలన్న ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)సూత్రానికి, జీ–20 దేశాల మధ్య కుదిరిన అవగాహనకు ఇది వ్యతిరేకమని ఆ ప్రకటన ఆరోపించింది.

అన్ని పెట్టుబడులకూ సమానావకాశాలివ్వాలని, అరమరికలు లేని విధానాలు పాటించాలని ఆ ప్రకటన కోరింది. ఈ మాటల్నే చైనా తనకూ వర్తింపజేసుకుంటే అసలు సమస్యే వచ్చేది కాదు.  ప్రపంచమంతా ఇప్పుడు కరోనా మహమ్మారిపై పోరులో నిమగ్నమైవుంది. అందరికన్నా ముందు ఆ మహమ్మారి తాకిడికి గురై దాదాపు 80 రోజులు ఇబ్బందుల్లో పడిన చైనా...తాను గడించిన అనుభవంతో ఈ మహమ్మారిని తరమడానికి తోడ్పడితే అందరూ మెచ్చేవారు. కానీ అది వేరే పనిలో బిజీగా వున్నదని ఈమధ్య కథనాలు మొదలయ్యాయి. కరోనా మహమ్మారిని తుదముట్టించడానికి అవసరమైన ఔషధాలు లేని ప్రస్తుత తరుణంలో లాక్‌డౌన్‌ విధించుకోవడమే ఉత్తమమని ప్రతి దేశమూ భావిస్తోంది. పర్యవ సానంగా అన్ని ఆర్థిక వ్యవస్థలూ ఏటికి ఎదురీదుతున్నాయి. ఇదే అదునుగా చైనా ‘అవకాశవాద స్వాధీనాల’పై దృష్టి పెట్టిందన్న కథనాలు గుప్పుమన్నాయి. మన హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హెచ్‌డీ ఎఫ్‌సీలో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా తనకున్న వాటాను ఇటీవలే ఒక శాతంకన్నా ఎక్కువ పెంచిన ఉదంతం మన దేశం అప్రమత్తం కావడానికి కారణమంటున్నారు. అయితే తాజా నిబంధనలో ఎక్కడా ఆ దేశం ప్రస్తావన లేదు. 

చైనాతో మన సంబంధాలు మొదటినుంచీ ఒకడుగు ముందుకు...రెండడుగులు వెనక్కు అన్న చందంగానే వుంటున్నాయి. పరస్పర అనుమానాలు, సందేహాలు వున్నా ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలు విస్తరిస్తూనే వున్నాయి. గత ఆరేళ్ల కాలంలో మన దేశంలో చైనా పెట్టుబడులు 800 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇంతగా ఆర్థికబంధం వున్నా నిరుడు ఆగస్టులో డోక్లాం సరిహద్దుల్లో వివాదం రేగినప్పుడు 1962 నాటి యుద్ధం నేర్పిన గుణపాఠాలు మర్చిపోవద్దంటూ అది మన దేశాన్ని హెచ్చరించింది. వివాదం ముదిరినప్పుడూ, పరస్పరం సవాళ్లు విసురుకున్నప్పుడూ మాట్లాడే భాషను ముందే ప్రయోగించి, తన ఆధిక్యత చాటుకునే ప్రయత్నం చేసింది. ఇరు దేశా ధినేతలమధ్యా సుహృద్భావ సంబంధాలున్నప్పుడూ, మరికొద్దిరోజుల్లో నేతలిద్దరూ సమావేశం కాబోతున్నప్పుడూ చైనా ఇలా ప్రవర్తించింది. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లలో అన్ని సంస్థల షేర్ల ధరలూ 30 నుంచి 50 శాతం వరకూ పడిపోయిన వర్తమానంలో గుట్టుచప్పుడు కాకుండా తన వాటాను పెంచుకోవాలని చూడటం చైనాకే చెల్లింది. వాస్తవానికి ఆస్ట్రేలియా, స్పెయిన్, జర్మనీల్లోని కంపెనీల పరిస్థితి కూడా ఇలాగేవుంది. ఆ దేశాలు సైతం తమ సంస్థలను సంరక్షించుకోవడానికి ఇదే మాదిరి చర్యలు తీసుకున్నాయి.

లాభం వస్తుందనుకుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా వాలిపోవడం వ్యాపారుల నైజం. చైనా కూడా ఆ వ్యాపార ధర్మాన్నే పాటిస్తున్నదనడంలో సందేహం లేదు. అయితే కరోనా మహమ్మారి వంటి పెను విపత్తును అన్ని దేశాలూ ఎదుర్కొంటున్న సమయంలో సైతం ఆ పనే చేస్తానంటే ఏ దేశమూ అంగీకరించదు. ఒకపక్క కరోనా వైరస్‌ చైనా సృష్టేనని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సర్వనాశనం చేయడమే దీని వెనకున్న ఉద్దేశమని అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు ఆరోపిస్తున్న వర్తమానంలో ఈ మాదిరి షాపింగ్‌కు దిగడం మంచిదికాదన్న ఇంగితజ్ఞానం కూడా చైనాకు లేకపోయింది. మన దేశంలోని అనేక స్టార్టప్‌ సంస్థల్లో చైనా పెట్టుబడులు తక్కువేమీ లేవు. ఓలా, స్నాప్‌డీల్, పేటీఎం, బిగ్‌బాస్కెట్, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, జొమాటో తదితర సంస్థలు అందుకు ఉదాహరణ. చైనాకు చెందిన అతి పెద్ద ఫార్మా సంస్థ ఫోసన్‌ ఫార్మా మన దేశీయ సంస్థ గ్లాండ్‌ ఫార్మాలో 74 శాతం వాటాను 109 కోట్ల డాలర్ల పెట్టుబడితో సొంతం చేసుకుంది. డిజిటల్, ఫార్మా సంస్థలతోపాటు ఆ దేశం సోలార్‌ ఎనర్జీ, ఆటోమొబైల్‌ రంగాల్లో కూడా పెట్టుబడులకు తహతహ లాడుతోంది.

ఏ దేశమైనా రక్షణతో ముడిపడివుండే వ్యూహాత్మక రంగాలను ఎఫ్‌డీఐలనుంచి మినహా యిస్తుంది. మన దేశం కూడా ఆ పనే చేసింది. దాంతోపాటు ఇరుగు పొరుగు దేశాలనుంచి వచ్చే ఎఫ్‌డీఐల విషయంలోనూ తగిన కట్టడి విధిస్తే బాగుండేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల మాటెలావున్నా చైనా ఆర్థికంగా బలమైన దేశం. పైగా ఆ దేశంతో మనకున్న వివాదాలు చాలా పాతవి. దాని దూకుడు సంగతి కూడా తెలిసిందే. ఈమధ్యకాలంలో రకరకాల పేర్లతో వున్న సంస్థల్లో నిధులు జమచేసి వాటి ద్వారా వేరే దేశాల్లో టేకోవర్లకు సిద్ధపడే ధోరణి పెరుగుతోంది. చైనాపై ఈ ఆరోపణ ఎప్పటినుంచో వుంది. అదే నిజమైతే ఇప్పుడు మన దేశం సవరించదల్చుకున్న నిబంధనకు దొరక్కుండా అది వేరే మార్గంలో వచ్చినా రావొచ్చు. అలాగే ఇలాంటి ఆత్మరక్షణ చర్యలకు పూనుకున్నప్పుడు దాంతో ఎదు రయ్యే సమస్యలూ వుంటాయి. అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి, తగిన నిబంధనలు రూపొందిం   చడం అవసరం. 

మరిన్ని వార్తలు