పారదర్శకతకు పట్టాభిషేకం

14 Nov, 2019 00:07 IST|Sakshi

ఎవరికి వారు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) తమకు వర్తించదంటూ మొరాయిస్తున్న వేళ...ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం ఆర్టీఐ పరిధిలోనికే వస్తుందని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. ఈ విషయంలో దాదాపు పదేళ్లక్రితం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనంటూ సమర్థించింది. ఈ దేశంలో ఎంత శక్తిమంతులైనా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారైనా రాజ్యాంగ చట్టం వారికంటే అత్యున్నతమైనదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చాటిచెప్పింది. పారదర్శకతకు పట్టాభిషేకం చేస్తూ, తెలుసుకోవడం పౌరులకుండే తిరుగులేని హక్కని నిర్ధారిస్తూ ఎన్నో సందర్భాల్లో తీర్పులు వెలువరించింది. తాజా తీర్పు ద్వారా ఇది తనకు కూడా వర్తిస్తుందని తెలియజేసి ఆ చట్ట పరిధిని విస్తృతం చేసింది. పారదర్శకత అంశంలో రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు మూడు వేర్వేరు తీర్పులు ఇచ్చినా... ఆ మూడూ ఏకాభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది.

అయితే న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకోవాలని, పారదర్శకత అన్నది దాని స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది. ఇందులో పరస్పర విరు ద్ధతేమీ లేదు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సుప్రీంకోర్టు వంటి వ్యవస్థకు కొన్ని అంశాల్లో గోప్యత అవసరమవుతుంది. ఏది పారదర్శకత పరిధిలోనికొస్తుందో, ఏది గోప్యత ఉండకతప్పనిదో ఆయా సందర్భాల్లో అది తేల్చుకుంటుంది. వాటిల్లోని సహేతుకతపై ఎటూ చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ చరిత్రాత్మక తీర్పునివ్వడానికి దారితీసిన పరిణామాలను ఒక్కసారి గమనించాలి. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టు కొలీజియానికీ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల సమాచారాన్నివ్వాలని...న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు అందజేయాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇదంతా మొదలైంది. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయన కేంద్ర సమాచార కమి షన్‌(సీఐసీ)ముందు పిటిషన్‌ వేశారు. అక్కడ ఆయనకు అనుకూలమైన నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసి అప్పట్లో అందరినీ విస్మయపరిచింది. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఏపీ షా నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టు వాదనను తోసిపుచ్చి సీఐసీ నిర్ణయాన్ని సమర్థించింది.  న్యాయవ్యవస్థ స్వతంత్రత న్యాయమూర్తికుండే వ్యక్తిగత విశేషాధికారం కాదనీ, అది న్యాయమూర్తి గురుత బాధ్యతని ఆ సందర్భంగా తేల్చి చెప్పింది. దాంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. అది తొలుత ద్విసభ్య ధర్మాసనానికి, ఆ తర్వాత త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లింది. ఇందులో కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలున్నాయని భావించడంతో వివాదం రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చింది.

ఆర్టీఐ చట్టం విషయంలో భిన్న సందర్భాల్లో ఎవరెలా మాట్లాడుతున్నారో ప్రజలకు తేటతెల్లం అవుతూనే ఉంది. మాకు ఈ చట్టం వర్తించబోదని మొరాయించేవారి జాబితా తక్కువేమీ లేదు. చట్టం వచ్చినప్పుడే పాలనా పరంగా రహస్యాలు పాటించడం తప్పనిసరంటూ కొన్ని వ్యవస్థలకు మినహాయింపునిచ్చారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ తదితర 22 సంస్థలు అందులో ఉన్నాయి. కొన్నిటిని అనం తరకాలంలో చేర్చారు. తమ కార్యకలాపాలు కూడా దీని పరిధిలోనికి రావని వాదించిన సంస్థలూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు సరేసరి. ఇవి ప్రభుత్వాల నుంచి రాయితీలు, మినహాయింపులు పొందడం దగ్గరనుంచి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాల సేకరణ వరకూ ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నాయి. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. అయినా ఆర్టీఐ చట్టం తమకు వర్తించబోదంటూ తర్కిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చూశాకైనా ఇలాంటి వాదనలు తగ్గితే మంచిదే. ప్రభుత్వంతోసహా వివిధ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే హక్కు పౌరులకు ఉండటం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది. వ్యవస్థలన్నీ పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజా స్వామ్యం వర్థిల్లుతుంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే కొలీజియం వ్యవస్థపై ఎప్పటినుంచో ఫిర్యాదులున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక కోసం అది అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో వెల్లడికావడం లేదని, ఎవరు ఎందుకు ఎంపికవుతున్నారో, ఎందుకు కావడం లేదో తెలుసుకోవడం పౌరసమాజం హక్కు అని ఎప్పటినుంచో వాదనలున్నాయి. ఈ వ్యవస్థకు ఆద్యుడైన జస్టిస్‌ జేఎస్‌ వర్మ సైతం కొలీజియం నిర్ణయాలు పారదర్శకంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కానీ ఈ అంశంలో సమాచార హక్కు చట్టం పరిధి తనకు వర్తించబోదని సుప్రీంకోర్టు వాదించింది. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం అలాంటి వాదన సరికాదని స్పష్టం చేయడం హర్షించదగ్గది. 

న్యాయమూర్తుల పదవులకు కొలీజియం సిఫార్సు చేసినవారి పేర్లేమిటో వెల్లడించవచ్చు తప్ప అందుకు గల కారణాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తాజా తీర్పు చెబుతోంది. అయితే అందరి విషయంలోనూ కారణాలు చెప్పకపోయినా, ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని భావించినవారికి అభ్యంతరం లేనప్పుడు ఏయే కారణాలరీత్యా తిరస్కరించవలసి  వచ్చిందో వెల్లడించడమే సరైంది. ఏదేమైనా అవసరమైన గోప్యతను పాటిస్తూనే పారదర్శకంగా ఉండటం, అదే సమయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటం ఒక సవాలే. దీన్ని మన సర్వోన్నత న్యాయస్థానం ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తుందో చూడాల్సి ఉంది.  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా