అనర్థదాయకం

17 Dec, 2019 00:03 IST|Sakshi

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో చోటుచేసుకుంటున్న విధ్వంసం, పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యవాదులందరినీ కలవరపరుస్తున్నాయి. ఒక నగరమని కాదు, ఒక విశ్వవిద్యాలయమని కాదు... దేశవ్యాప్తంగా ఎన్నోచోట్ల ఈ చట్టంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతు న్నాయి. న్యూఢిల్లీ, లక్నో, వారణాసి, ముంబై, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం నగరాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఈ ఆందోళనలకు దిగినవారంతా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టం పౌరుల్ని మత ప్రాతిపదికన విభజిస్తోందని ఆరోపిస్తున్నవారితోపాటు తమ రాష్ట్రాల్లోకి అక్ర మంగా వలస వచ్చినవారిలో కొందరిని ఇక్కడే ఉంచడానికి ఈ చట్టం వీలు కల్పిస్తోందని ఈశాన్య రాష్ట్రాల పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బిల్లులో శ్రీలంక తమిళ శరణార్థుల ప్రస్తావన లేక పోవడంతో తమిళనాడులో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ ఆందోళన ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఎన్‌డీఏ మిత్రపక్షాలు అసోం గణ పరిషత్‌(ఏజీపీ), జేడీ(యూ)లు కూడా ఇప్పుడు పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ ఏజీపీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని తెలిపింది. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడం, పోలీసులపై దాడులు చేసి వారిని రక్తలు కారేలా కొట్టడం, దాన్ని నియంత్రించే పేరు మీద పోలీసులు దాడి చేయడం వంటి దృశ్యాలు చానెళ్లలో చూసి అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు.

విశ్వవిద్యాలయం వెలుపల జరిగిన విధ్వం సంపైనా, తమపై జరిగిన దాడులపైనా దర్యాప్తు చేయడం పోలీసుల బాధ్యతే. దాన్నెవరూ కాదనరు. కానీ ఆ పేరు మీద జామియాలోని లైబ్రరీపై, అక్కడి వాష్‌రూంపై దాడి చేసి దొరికినవారిని దొరికి నట్టు కొట్టి తీవ్రంగా గాయపర్చడం, విద్యార్థినులను సైతం కొట్టడం సరైన చర్య కాదు. ఈ ఆందోళన సాకుగా తీసుకుని సంఘ వ్యతిరేక శక్తులు విధ్వంసానికి దిగాయని జామియా విద్యార్థులు కూడా ఆరోపించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేయదల్చుకున్నాం తప్ప, హింసకు దిగే ఉద్దేశం లేదని వారు చెప్పారు. బహుశా సరైన చర్యలు తీసుకుని ఉంటే సోమవారంనాటికి ఈ ఉద్రిక్త వాతా వరణం ఎంతో కొంత సడలేది. కానీ అందుకు విరుద్ధంగా అది మరింత తీవ్ర రూపం దాల్చింది. జామియాలోనూ, అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలోనూ పోలీసులు దాడులు చేయడాన్ని నిర సిస్తూ దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఇతర విద్యాసంస్థల విద్యార్థులు నిరసన లకు దిగారు. తాము ఎంతో సహనంతో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ జామియాలో ముగ్గురు విద్యార్థులకు తగిలిన బుల్లెట్‌ గాయాలకు కారకులు ఎవరు? 

ఉద్యమాల్లో అధిక సంఖ్యలో జనం పాల్గొంటున్నప్పుడు నిర్వాహకులకు వారిపై అదుపు ఉండదు. ఇది ఆసరా చేసుకుని సంఘ వ్యతిరేక శక్తులు ఆ ఉద్యమాలను పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రమాదాన్ని ఊహించబట్టే విశ్వవిద్యాలయం ఆవరణలోనే ఆందోళనలు నిర్వహించమని తాను విద్యార్థులకు సూచించానని జామియా మిలియా వైస్‌ చాన్సలర్‌ నజ్మా అఖ్తర్‌ చెబుతున్నారు. కారణం ఏమైనా విద్యార్థుల ఆందోళన రోడ్లపైకి వచ్చింది. కనీసం పోలీసులైనా విశ్వ విద్యాలయ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది అందులోకి ప్రవేశించి ఉంటే బాగుం డేది. అప్పుడు లైబ్రరీని ధ్వంసం చేశారని, వాష్‌రూంలోకి చొరబడి విద్యార్థులను గాయపరిచారని ఆరోపణలొచ్చేవి కాదు. ఏ సమస్యపైన అయినా ఆందోళన జరుగుతున్నప్పుడు వీలైనంతవరకూ ఉద్రిక్తతలు తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కానీ జామియాలో అందుకు విరుద్ధంగా జరి గింది. ఫలితంగా విద్యార్థుల ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరించింది. రాజీవ్‌గాంధీ హయాంలో అస్సాం విద్యార్థులు అక్రమ వలసలను అరికట్టాలని కోరుతూ  1985లో జరిపిన ఉద్యమాన్ని ఈ తరహాలోనే అణచడానికి ప్రయత్నించినప్పుడు అదెలా విస్తరించిందో పాలకులకు గుర్తుండే ఉంటుంది. గత వారమంతా ఉద్రిక్తంగా ఉన్న అస్సాం సోమవారానికి కాస్త ఉపశమించింది.

గువాహటిలో జరిగిన పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించగా, 29 మందికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఆందోళన హింసాత్మకం అయింది. కేవలం వదంతులు నమ్మి జనం ఆందోళనకు దిగుతున్నారని, విపక్షాలు వారిని పక్కదోవపట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెబుతున్నారు. కానీ ఈ చట్టం తీసుకొచ్చేముందు సమాజంలోని అన్ని వర్గాల వారితో చర్చించివుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. జాతీయ పౌరసత్వ నమోదు  (ఎన్‌ఆర్‌సీ)ని ఏదోమేరకు అంగీకరించిన అస్సాంలో సైతం ఇప్పుడు కొత్త చట్టంపై ఇంత బలమైన వ్యతిరేకత ఎందుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. పరాయి దేశాల నుంచి వచ్చినవారిలో కొందరికి పౌరసత్వం ఇవ్వడానికి కొత్త చట్టం తీసుకొస్తున్నారని, ఇది తమ భాష, సంస్కృతి వగై రాలపై బలమైన ప్రభావం చూపడమేకాక... తమ ఉపాధిని సైతం దెబ్బతీస్తుందని అస్సాం పౌరులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో తలెత్తిన సందేహాలు నివృత్తి చేయడానికి బదులు ఎవరో కారకులని నిందించడం వల్ల ఉపయోగం లేదు.

దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల్ని ఉపశమింపజేయడానికి ఏం చేయాలని ఆలోచించాల్సిన తరుణంలో మేఘాలయ గవర్నర్‌ తథాగత్‌ రాయ్‌ ‘ఇక్కడుండటం ఇష్టంలేనివాళ్లు ఉత్తర కొరియా పోవచ్చు’ అంటూ ట్వీట్‌ చేయడం బాధ్యతారాహిత్యం. ఇలాంటి నేతలను అదుపు చేయడంతోపాటు జరుగుతున్న ఆందోళనలపై దృష్టి పెట్టి, సందేహ నివృత్తి కోసం తగిన చర్యలు తీసుకోవడం అవసరమని కేంద్రం గుర్తించాలి. ప్రశ్నించడం దానికదే నేరం కాదు. ప్రజాస్వామ్యానికి అది ఎంతో అవసరం కూడా. ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చినప్పుడు, సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు ఉద్యమాలు బయల్దేరవు. అవి ఉగ్రరూపం దాల్చవు. 

>
మరిన్ని వార్తలు