యోగి రాజ్యంలో మరో ఉన్మాదం

5 Dec, 2018 02:04 IST|Sakshi

ఈమధ్య దాదాపు చడీచప్పుడూ లేదనుకున్న గోరక్షక ముఠా మళ్లీ జూలు విదిల్చింది. ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌షహర్‌ సమీప గ్రామంలో సోమవారం ఆవు కళేబరాలు కనిపించడంతో రెచ్చిపోయి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసి హతమార్చడమేకాక మరో నలుగురు కానిస్టేబుళ్లను తీవ్రంగా గాయపరిచింది. పోలీస్‌ ఔట్‌పోస్టుతో పాటు పలు వాహనాలకు కూడా నిప్పెట్టింది. తిండి పేరు చెప్పి, మతం పేరు చెప్పి, గోరక్షణ పేరు చెప్పి హత్యలు జరగడమే తప్ప, ఆ ఉదంతాల్లో హంత కులకు శిక్ష పడిన దాఖలాలు కనబడని యోగి ఆదిత్యనాథ్‌ రాజ్యంలో చివరకు పోలీసు ప్రాణాలకు కూడా భరోసా లేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది. ఇంతక్రితం జరిగిన ఘటనలకూ, ఇప్పుడు జరిగినదానికీ కొంత వ్యత్యాసం ఉంది. మిగిలిన ఉదంతాలన్నిటిలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమో లేక ఘటన జరిగిన తర్వాత అక్కడికి రావడమో మాత్రమే జరిగేది. కానీ బులం ద్‌షహర్‌ సమీపాన జరిగిన ఉదంతంలో మూక పోలీస్‌ ఔట్‌పోస్టు ముట్టడించినప్పుడు ఇన్‌స్పెక్టర్‌ సుబోద్‌కుమార్‌ చొరవ తీసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

అందుకు కారణం ఉంది. అంత కంతకు జనం పెరగడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేవరకూ కదలబోమని రహదారిపై బైఠాయించడం వల్ల అది శాంతిభద్రతల సమస్యగా మారొచ్చునని ఆయన అంచనా వేశారు. ఇదే ఆయన ప్రాణా లమీదకు తెచ్చింది. రాళ్ల దాడిలో గాయపడిన సుబో«ద్‌ను ఆసుపత్రికి తరలించేందుకు డ్రైవర్‌ ప్రయత్నిస్తుండగా ఉన్మాద మూక ఆయన్ను గురిచూసి కాల్చి చంపింది. మరో యువకుడు కూడా బుల్లెట్‌ గాయాలతో మరణించాడు. అతని ప్రాణం తీసిన బుల్లెట్‌ ఎవరిదో తేలాల్సి ఉంది. పోలీ సులు నలుగురిని అరెస్టు చేయగా, సూత్రధారిగా భావిస్తున్న బజరంగ్‌దళ్‌ స్థానిక నాయకుడు పరారీలో ఉన్నాడు. 

ఆవు కళేబరాలు కనబడటం మొదలుకొని ఇన్‌స్పెక్టర్‌ హత్య, విధ్వంసం వరకూ గమనిస్తే ఇదంతా ఒక పథకం ప్రకారం చేసినట్టు కనబడుతుంది. ఘటన జరిగిన ప్రాంతానికి 50 కిలో మీటర్ల దూరంలో, అదే జిల్లాలో ముస్లింల మతపరమైన కార్యక్రమం వరసగా మూడురోజులు జరిగి ఆరోజే పూర్తయింది. బులంద్‌షహర్‌ జిల్లా, దాని పొరుగునున్న అలీగఢ్, మీరట్, ముజఫర్‌నగర్‌ తదితర జిల్లాలు మతపరమైన ఘర్షణలకు పెట్టింది పేరు. అలాంటిచోట ఉన్నట్టుండి కళేబరాలు కనబడటం, దానిపై ఇంత భారీయెత్తున హింస, విధ్వంసం చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది.

నేర ప్రపంచాన్ని అణిచేయడానికి కంకణం కట్టుకున్నానని చెప్పి ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగిస్తున్న యోగి ప్రభుత్వం నిద్రపోయిందో, కావాలని దీన్ని ఉపేక్షించిందో తెలియదు. ఉన్మాద మూకకు కళేబరాలు దొరకడం ఒక సాకు మాత్రమే. గతంలో ఇంట్లో ఆవు మాంసం ఉందని వదంతులు సృష్టించి దాద్రిలో అఖ్లాక్‌ అనే వ్యక్తిని కొట్టి చంపిన కేసును తన సోదరుడే దర్యాప్తు చేశాడని ఇన్‌స్పెక్టర్‌ సోదరి చెబుతున్నారు. ఆ కేసు దర్యాప్తులో ఒత్తిళ్లకు లొంగనందుకే ఇప్పుడు పొట్టనబెట్టుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇందులో ఆయన సహచరుల పాత్ర కూడా ఉన్నదని అనుమానిస్తున్నారు. ఆమె సందేహాలు కొట్టిపారేయదగ్గవి కాదు. ఉత్తరప్రదేశ్‌ చట్టం ప్రకారం ఆవును చంపడం నేరం. నిజంగా గోరక్షణ కోసం పాటుబడేవారు ఆ చట్టం కింద కేసు నమోదు చేయమని కోరవచ్చు. అక్కడున్నది బీజేపీ సర్కారే తప్ప వేరే పార్టీ ప్రభుత్వం కాదు. అందుకు భిన్నంగా అనవసర ఆవేశాన్ని ప్రదర్శించి, దాన్ని ఉన్మాద స్థాయికి తీసుకుపోయి హింసకు పాల్పడటం ఏ ప్రయోజనాన్ని ఆశించి అనుకోవాలి? మతపరమైన ఘర్షణలు చెలరేగడానికి ఆస్కారమున్నచోట ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఇంతగా చేష్టలుడిగిపోవడం దిగ్భ్రాంతికరం. 

దాదాపు నాలుగేళ్లుగా గోరక్షణ పేరిట సాగుతున్న దాడుల వెనక సంఘ్‌ పరివార్‌ సంస్థలకు చెందినవారిపైనే ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలే. వదంతుల్ని నమ్మి, ఉన్మాదం ప్రకోపించి మూకలు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు కనిపిస్తున్నా వీటిని అరికట్టడానికి ఇంతవరకూ పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జార్ఖండ్‌లో నిరుడు పశు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో వందమంది గుంపు అన్సారీ అనే యువకుణ్ణి కొట్టి చంపాక ఆ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారించి ఒక బీజేపీ సభ్యుడితోపాటు 8మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అటుతర్వాత వారంతా హైకోర్టుకు అప్పీల్‌ చేసుకున్నారు. వారికి బెయిల్‌ లభించింది.

ఈ తరహా ఉన్మాద మూకలను నియంత్రించడానికి పటిష్టమైన చట్టం తీసుకురావడంపై పార్లమెంటు ఆలోచించాలని గత జూలైలో అప్పటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆధ్వర్యంలోని ధర్మాసనం సూచించింది. మూక దాడుల సందర్భంగా ప్రేక్షక పాత్ర వహించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లో ఉన్మాద మూకలకు వర్తింప జేయగల 34, 147, 148, 120బీ వంటి అనేక సెక్షన్లు ఉన్నాయి. దుండగానికి ఒడిగట్టే మూకపై నేర స్వభావాన్ని బట్టి హత్య, హత్యాయత్నం, మరణానికి దారితీసిన చర్య, తీవ్రంగా గాయపరచడం వంటి నేరాలతోపాటు ఈ సెక్షన్లను కూడా ప్రయోగించవచ్చు. వీటన్నిటినీ చేర్చి సమగ్ర చట్టం తీసు కొచ్చినా లేక ఈ సెక్షన్లనే నేరుగా వినియోగించుకున్నా ఉన్మాదంతో చెలరేగే ముఠాలకు గట్టి హెచ్చ రికగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఈ రెండింటిలో ఏదీ జరగకపోగా దుండగులకు రాజకీయ ప్రాపకం సులభంగా దొరుకుతోంది. పర్యవసానంగా ఈ విష సంస్కృతి విస్తరిస్తోంది. ఇప్పుడది కర్తవ్యనిష్టతో విధులు నిర్వర్తించిన ఒక పోలీసు అధికారినే పొట్టనబెట్టుకుంది. కనీసం ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి మూకదాడుల విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోతే అంత ర్జాతీయంగా మన పరువు మరింతగా దిగజారుతుంది.

>
మరిన్ని వార్తలు