పతనం తెచ్చిన సదవకాశం

12 Mar, 2020 00:40 IST|Sakshi

ప్రపంచమంతటా విస్తరిస్తున్న కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్న తరుణంలో పులి మీద పుట్రలా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో స్టాక్‌ మార్కెట్లన్నీ కకావికలయ్యాయి. మహా మహా చమురు కంపెనీల షేర్ల ధరలు 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. రూపాయి విలువ 17 నెలల కనిష్ట స్థానానికి క్షీణించింది. చమురు ఉత్పత్తిలో రెండు, మూడు స్థానాల్లోవున్న సౌదీ అరేబియా, రష్యాల వైరం పతాక స్థాయికి చేరుకోవడం, కరోనా విస్తృతి ప్రభావంతో చమురు వినియోగం తగ్గడం వంటి కారణాల పర్యవసానంగా ఈ పరిస్థితి ఏర్పడింది. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో ఒకేసారి చమురు ధరలు పతనం కావడం ఇదే మొదటి సారి. స్టాక్‌ మార్కెట్ల స్పందన మాటెలావున్నా, ప్రపంచ దేశాల కరెన్సీలు పల్టీలు కొట్టినా ఈ చమురు ధరల పతనం మనతో సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతోకొంత మేలుతో పాటు సమస్యల్ని కూడా తెస్తుంది. మేలు చేకూర్చే అవకాశాల్ని వినియోగించుకోవడం, సమస్యల్ని అధిగమించడం ఇప్పుడు పెద్ద సవాలు. అయితే చమురు ధరలు ఇదే స్థాయిలో ఎన్నాళ్లుంటాయన్నది ప్రశ్నార్థకమే. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకనుగుణంగా పెట్రో ధరలు తగ్గిస్తే సామాన్యులపై పడిన భారం కాస్తంత ఉపశమిస్తుంది. విదేశీ మారకద్రవ్య నిల్వల లోటు భర్తీకి అవకాశం ఏర్పడుతుంది. ద్రవ్య లోటును తగ్గించుకోవచ్చు.  

ఆరేళ్లక్రితం షేల్‌ ఆయిల్‌తో చమురు రంగంలోకి దిగిన అమెరికా స్వల్పకాలంలోనే అగ్రజుడిగా ఎదిగి ప్రపంచ చమురు మార్కెట్‌నే శాసించే స్థాయికి చేరుకుంది. తమ భూభాగంలో భూమికి ఆరువేల అడుగుల లోతున నాపరాయి రాతిపొరల్లో చమురు నిల్వలు అపారంగా విస్తరించివున్నా యని, దీన్నంతటినీ రాగల 50 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా వినియోగించుకుని ఇంధన రంగంలో ఏకచ్ఛత్రాధిపత్యం నెలకొల్పవచ్చునని అమెరికా వేసిన అంచనాలో లోపమేమీ లేదు.  రోజుకు 0.4 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తితో ప్రారంభించి ఇప్పుడు 40 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే దిగ్గజంగా మారింది. అప్పటివరకూ అది తన అవసరాల కోసం సౌదీ అరేబియా, రష్యాల వద్ద చమురు కొనేది. అంతక్రితం చమురు దిగుమతులపై ఆధారపడిన దేశం ఒక్కసారిగా ఎదగడమే కాదు... ఆ రంగంలో పాతుకుపోయి ఇష్టారాజ్యం కొనసాగిస్తున్న తమను సవాలు చేయడంపై ఆగ్ర హించి ఒక్కటైన దేశాలు పరస్పర విభేదాల్లో కూరుకుపోవడం తాజా సమస్యకు మూలం. తమకు ప్రధాన ప్రత్యర్థిగా మారిన అమెరికాను అదుపు చేయడమెలా అన్న అంశంలో ఇప్పుడు రష్యా, సౌదీలు వాదులాడుకుంటున్నాయి. అమెరికా కట్టడికి 15 దేశాలు సభ్యులుగా వున్న చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌)తో చేతులు కలుపుతానని, ఆ సంస్థ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని మూడేళ్లక్రితం రష్యా హామీ ఇచ్చింది. అలాగని ఒపెక్‌లో దానికి సభ్యత్వం లేదు.

కానీ గత వారం వియన్నాలో జరిగిన ఒపెక్‌ దేశాల సమావేశంలో సభ్య దేశాలన్నీ రోజుకు పది లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి తగ్గించుకోవాలని సౌదీ అరేబియా చేసిన ప్రతిపాదన దానికి రుచించలేదు. చమురును దిగుమతి చేసుకునే చైనా, దక్షిణ కొరియాలు కరోనా బారిన పడి ఇంధన వినియోగంలో వెనకబడ్డాయి గనుక ఇది అవసరమన్నది సౌదీ అభిప్రాయం. ఆ చర్య అమెరికాకు లబ్ధి చేకూరు స్తుందన్న భావనతో రష్యా దీన్ని అంగీకరించలేదు. తాము ఉత్పత్తిలో కోత పెడితే అమెరికా చమురు సంస్థలకు పట్టపగ్గాలుండవని, అవి మార్కెట్లను మరింతగా ఆక్రమించుకుంటాయని రష్యా వాదన. దాంతో రష్యాకు గుణపాఠం చెప్పి, దానిపై ఒత్తిడి పెంచడం కోసం సౌదీ ఒక్కసారిగా చమురు ఎగుమతి ధరను తగ్గించింది. అదే సమయంలో ఉత్పత్తిని పెంచింది. సౌదీ, రష్యాలు రెండూ రాజీ కొచ్చి చర్చిస్తే తప్ప ఇప్పుడేర్పడిన సంక్షోభం ఉపశమించదని, బ్యారెల్‌ చమురు ధర 20 డాలర్లకు పతనమైతే అది అందరికీ చేటు కలిగిస్తుందని ఒపెక్‌ దేశాలు ఆందోళన పడుతున్నాయి. అవి ఏకాభిప్రాయానికి రావడం, యధాపూర్వ స్థితి ఏర్పడటం ఎన్నాళ్లకు సాధ్యమో ఎవరూ చెప్పలే కున్నారు.  

చమురు ఉత్థానపతనాలు ప్రపంచ రాజకీయాలను శాసించడం ఎప్పుడూ ఉన్నదే. కానీ ఏ నిర్ణయం ఎటు దారితీస్తుందో, ఎవరికి దెబ్బ తగులుతుందో అంచనా వేయడం అంత సులభమేమీ కాదు. గతంలో అమెరికా షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తిదారుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చమురు ధరలను సౌదీ తగ్గించినప్పుడు అమెరికాకు కలిగిన నష్టం పెద్దగా లేదు సరిగదా సౌదీ ఆర్థిక వ్యవస్థే సమస్యల్లో చిక్కుకుంది. దాంతో అది తన వైఖరిని మార్చుకుంది. చమురు దిగుమతిపైనే ప్రధానంగా ఆధారపడే మనలాంటి దేశాలకు తాజాగా పతనమైన చమురు ధరల వల్ల ప్రయోజనమే వుంటుంది. అదే సమయంలో సమస్యలూ వుంటాయి. ఇందులో అనుకూలాంశమేమంటే...విదేశీ మారకద్రవ్య నిల్వల లోటును గణనీయంగా తగ్గించుకోవడానికి, ద్రవ్యోలబ్ణాన్ని కట్టడి చేయడానికి  ఇంతకు మించిన మంచి అవకాశం ఏ దేశానికీ రాదు. అందువల్ల ఆదా అయ్యే సొమ్ముతో అనేక కీలకమైన పథకాలకు ఆర్థిక సాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ చమురు ధర ఎక్కువ కాలం బ్యారెల్‌కు 40 డాలర్ల లోపు స్థిరంగావుంటే అది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని, మార్కె ట్లకు అది శుభసూచకం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం ఏర్పడితే అది ఎఫ్‌డీఐలపై ప్రభావం చూపడమే కాదు... ఇక్కడినుంచి పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుందంటున్నారు. ఏదేమైనా పడిపోయిన చమురు ధరల వల్ల కలిగే ప్రయోజనాన్ని పౌరు లకు బదిలీ చేయడం అవసరం. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా పెట్రో ఉత్ప త్తులపై పన్నులు పెంచి, నామమాత్రంగా ధర తగ్గించడం ప్రభుత్వాలకు అలవాటైంది. ఈసారి ఆ విధానాన్ని అమలు చేయరని ఆశించాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా