ట్రంప్‌ దుస్సాహసం

4 Jan, 2020 01:05 IST|Sakshi

నిత్యం ఉద్రిక్తతలతో సతమతమవుతున్న పశ్చిమాసియాలో అమెరికా మరో దుస్సాహసానికి పాల్పడింది. ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) కమాండర్‌ మేజర్‌ జనరల్‌ కాసిం సులేమానిని శుక్రవారం తెల్లారుజామున ద్రోన్‌ దాడిలో హతమార్చి ఇరాన్‌పై యుద్ధభేరి మోగిం చింది. ఏడెనిమిది రోజులుగా అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇరాక్‌ భూభాగంపై పరోక్ష యుద్ధం సాగు తోంది. ఆ దేశంపై తమకున్న పట్టు సడలనీయకూడదని అమెరికా.. అక్కడినుంచి దాన్ని పూర్తిగా సాగనంపాలని ఇరాన్‌ పోటీపడుతున్న తీరు చివరకు రెండు దేశాల మధ్యా ప్రత్యక్ష పోరుకు దారి తీస్తుందని అందరూ భయపడుతూనేవున్నారు. ఇప్పుడదే నిజమయ్యేలావుంది. మేజర్‌ జనరల్‌ కాసిం సులేమాని ఇరాన్‌లో అత్యంత కీలకమైన నేత. ఇరాన్‌ మత గురువు అలీ ఖమేనీకి కుడి భుజం. గత ఇరవైరెండేళ్లుగా ఐఆర్‌జీసీ కార్యకలాపాలు చూడటంతోపాటు, ఆ సంస్థ విదేశాల్లో నిర్వహించే సైనిక కార్యకలాపాల కోసం ఏర్పాటైన కుద్స్‌ ఫోర్స్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నవాడు. సిరియా ప్రధాని బషీర్‌ అల్‌ అసద్‌ను అంతమొందించాలన్న అమెరికా ప్రయత్నాలను వమ్ము చేయడంలో ఆయనది కీలకపాత్ర. అలాగే ఇరాక్, సిరియాల్లో వేళ్లూనుకున్న ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదుల్ని అంతమొందించడంలోనూ సులేమాని కృషి వుంది. అంత కీలక నేత కాబట్టే అమెరికాపై తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. 

 పదిహేడేళ్లక్రితం నమ్మశక్యం కాని సాకులతో ఇరాక్‌ను దురాక్రమించిన అమెరికా దాన్ని వల్ల కాటిగా మార్చింది. ఇరాక్‌ వద్ద ప్రపంచాన్ని ధ్వంసించే ఆయుధాలున్నాయని, వాటిని నాశనం చేయ డమే లక్ష్యమని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ప్రకటించారు. కానీ జరిగిందంతా వేరు. 2003–2010 మధ్య ఆ దురాక్రమణ యుద్ధానికి ఏడు లక్షలమంది బలయ్యారు. అందులో 80 శాతం మంది సాధారణ ఇరాక్‌ పౌరులు. మరిన్ని లక్షలమంది వికలాంగులుగా, అనాథలుగా మిగిలారు. ఆ తర్వాత అమెరికా దురాక్రమణను ఎదుర్కొంటామని రంగంలోకొచ్చి ఇరాక్‌లో 60 శాతం భూభా గాన్ని, పొరుగునున్న సిరియాలో నాలుగోవంతు భాగాన్ని  అధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్‌ ఉగ్రమూక సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ ఉగ్రవాదుల్ని అణచడంలో అమెరికా, మిత్ర రాజ్యాలు విఫలమై చేతులెత్తేశాక, ఇరాక్‌లోని కతైబ్‌ హిజ్బొల్లా మిలీషియా, మహ్‌దీ మిలీషియా వగైరా సంస్థలను ఏకం చేసి ఐఎస్‌ ఉగ్రవాదులపై సాహసోపేతంగా పోరాడి విజయం సాధించింది కుద్స్‌ దళాలే. ఈ పోరాటం పర్యవసానంగానే ఐఎస్‌ ఉగ్రమూకలు తోకముడిచాయి. అప్పట్లో అటు అమె రికా, ఇటు ఇరాన్‌ షియా మిలీషియాలకు ఆయుధ సరఫరా చేశాయి. ఐఎస్‌ను అంతమొందించ డంలో ఇరాన్‌ పాత్రను అమెరికా సైతం గుర్తించింది. కనుకనే అప్పటి అమెరికా విదేశాంగమంత్రి జాన్‌ కెర్రీ 2014లో ఇరాన్‌ విదేశాంగమంత్రి మహమ్మద్‌ జరీఫ్‌తో న్యూయార్క్‌లో సమావేశమ య్యారు. కానీ ఈ సాన్నిహిత్యం పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాలుగావున్న ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలకు నచ్చలేదు. అధికారంలోకొచ్చాక ట్రంప్‌ వారి ఒత్తిడితోనే ఇరాన్‌తో కయ్యానికి దిగారు. అమెరికా చొరవతో ఇరాన్‌తో అంతక్రితం కుదిరిన అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. ఐఆర్‌ జీసీని ఉగ్రవాద దళంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. ఆ దేశంపై అకారణంగా అనేక ఆంక్షలు విధించారు. దాన్నుంచి ముడి చమురును ప్రపంచంలో ఏ దేశమూ కొనకుండా నిషేధం విధించారు.  

గత నెల 27న ఇరాక్‌లోని కిర్కుక్‌లోవున్న అమెరికా సైనిక స్థావరంపై జరిగిన రాకెట్‌ దాడి అమె రికా ఏకాకితనాన్ని బయటపెట్టింది. ఆ దాడిని ఇరాక్‌ ప్రభుత్వం నోటిమాటగా ఖండించినా, అమెరికా ఆరోపించిన తరహాలో కతైబ్‌ మిలీషియాదే బాధ్యత అని చెప్పలేదు. అటు కతైబ్‌ మిలీ షియా కూడా అందులో తమ పాత్ర లేదని తెలిపింది. మరోపక్క ఇరాన్‌ సైతం అమెరికాపై జరిగిన దాడితో సంబంధం లేదని చెప్పింది. ఇదంతా ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ఆ దాడిలో అమెరికా సైనికుడొకరు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఇరాక్‌లో 19 ఏళ్లుగా తిష్ట వేసినా, చివరకు అక్కడి ప్రభుత్వం నుంచి కూడా తమకు మద్దతు లభించలేదని అర్థమయ్యాక అమెరికా ఏకపక్షంగా తానే ప్రతీకార దాడికి దిగింది. కతైబ్‌ మిలీషియా స్థావరంపై వైమానిక దాడులు జరిపి 24మంది మిలి టెంట్లను హతమార్చింది. దాంతో కతైబ్‌ మిలీషియా అమెరికా దౌత్య కార్యాలయాన్ని చుట్టుముట్టి 24 గంటలకు పైగా  దిగ్బంధించింది. అక్కడి ఔట్‌పోస్టుకు నిప్పుపెట్టింది. తమపై రాకెట్‌ దాడి జరగడం, ప్రతీకారం తీర్చుకుంటే దౌత్యకార్యాలయంపైకి దండయాత్రకి రావడం వంటి పరిణామాలతో ఆగ్ర హంతోవున్న ట్రంప్‌ ఇప్పుడు సులేమానిపై దాడికి తెగించారు. గత ఆరునెలలుగా కతైబ్‌ మిలీషియా ఇరాక్‌ భూభాగంనుంచి విదేశీ సేనలు వెళ్లిపోవాలని ఉద్యమిస్తోంది. అమెరికా తమ స్థావరంపై దాడి చేశాక ఇప్పుడు అమెరికాపై అది తన పోరాటాన్ని కేంద్రీకరించింది. ఐఎస్‌ను ఎదుర్కొని తమకు మేలు చేసిన కతైబ్‌ మిలీషియావైపే ఇరాక్‌ ప్రభుత్వంవుంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణిం చిన 24మంది మిలిటెంట్లకు నివాళిగా మూడు రోజులు సంతాపదినాలు పాటిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

అమెరికా హంతక దాడి పర్యవసానాలు రానున్న రోజుల్లో తీవ్రంగానేవుంటాయి. కేవలం పశ్చి మాసియాను మాత్రమే కాదు... ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెడతాయి. ఆర్థికవ్యవస్థల్ని అస్తవ్యస్థం చేస్తాయి. ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇరాన్‌ ఇప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌తో ఘర్షణకు దిగుతుందా లేక పశ్చిమాసియాలోవున్న అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుంటుందా అన్నది చూడాల్సివుంది. ఏం జరిగినా మరో యుద్ధం బద్దలు కావడం ఖాయం. కనుకనే అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని మన దేశంతోసహా అనేక దేశాలు కోరుతున్నాయి. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. 

మరిన్ని వార్తలు