కొంత ఆశ... కొంత నిరాశ

26 Feb, 2020 00:21 IST|Sakshi

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అసాధారణమైన స్వాగత సత్కారాలు అందుకుని స్వదేశంలోని ఓటర్లకూ, ప్రత్యర్థి పక్షానికీ తన ఘనతను చాటిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో రోజైన మంగళవారం పూర్తిగా ద్వైపాక్షిక అంశాలపై దృష్టి పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన చర్చల్లో మూడు వందల కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు ఖరారు చేసుకోవడంతోపాటు ఇంధనరంగంతోసహా మూడు రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇరు దేశాల అధికారుల మధ్యా సాగిన చర్చోపచర్చలు ఒక కొలిక్కి రాకపోవడం వల్ల ముందనుకున్నట్టే వాణిజ్య రంగంలో కుదరవలసిన ఒప్పందంపై ఈ పర్యటనలో సంతకాలు కాలేదు. రెండు దేశాల ప్రస్తుత సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత ఉచ్ఛస్థితిలో ఉన్నాయని ట్రంప్‌ అభివర్ణించడాన్నిబట్టి చూస్తే మన దేశంపై ఆయనకున్న అసంతృప్తి క్రమేపీ తగ్గుతున్నదని భావించాలి. అయితే అమెరికా సరు కులపై భారత్‌ విధిస్తున్న ‘అధిక టారిఫ్‌’ల గురించి, దానివల్ల తమకు జరిగే నష్టం గురించి ఆయ నింకా చెప్పడం మానుకోలేదు. తమను భారత్‌ ‘న్యాయసమ్మతం’గా చూడాలని, అధిక టారిఫ్‌లు తగ్గించుకోవాలని ఆయన మరోసారి చెప్పారు.

అమెరికా అధ్యక్ష పీఠంపై ఉన్నవారు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించ వలసిన బాధ్యత తమకున్నదని, వాటిని సరిచేయడం కూడా తమ కర్తవ్యమేనని భావిస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో వివాదాస్పద అంశంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం గురించి ట్రంప్‌ ఆ కోణంలోనే మోదీ వద్ద ప్రస్తావిస్తారని పలువురు ఆశించారు. కానీ పాలకుడిగా గత మూడున్న రేళ్లనుంచి ట్రంప్‌ వ్యవహారశైలిని గమనిస్తున్నవారు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఈ పర్యటన నుంచి ట్రంప్‌ ఆశిస్తున్న ప్రయోజనాలు వేరు. అమెరికాలో ఈ ఏడాది ఆఖరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గరిష్టంగా ప్రయోజనం పొందడానికి ఆయన ఈ పర్యటనకొచ్చారు. అక్కడున్న ఎన్నారైల అభిమానాన్ని చూరగొనడంతోపాటు భారత్‌తో కుదుర్చుకునే ఒప్పందాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నానన్న అభిప్రాయం అమెరికా పౌరుల్లో కలిగించాలన్న తాపత్రయం ట్రంప్‌కు ఉంది. అందుకు పూర్తి సహాయసహకారాలు అందించిన మోదీ ప్రభుత్వాన్ని ఆయన ఇరకాటంలో పెట్టేలా మాట్లాడతారని ఎవరూ అనుకోరు. అందుకే సీఏఏ అంశం పూర్తిగా భారత్‌ ఆంతరంగిక సమస్యని తేల్చిచెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై అడిగిన ప్రశ్నకూ ఆ మాదిరే జవాబిచ్చారు. 

అయితే, మత స్వాతంత్య్రానికి విఘాతం కలుగుతున్నదని వచ్చిన ఆరోపణలను మోదీ దృష్టికి తీసుకెళ్లానని... ఆ విషయంలో ముస్లింలు కోరుకుంటున్నదేమిటో తెలుసుకుంటున్నామని ఆయన జవాబిచ్చారని ట్రంప్‌ అన్నారు. మోదీ శక్తిమంతుడని, ఇలాంటి సమస్యలను అధిగమిస్తారని కూడా చెప్పారు. కశ్మీర్‌ విషయంలో మొదటినుంచీ ఉన్న అభిప్రాయాన్నే మరోసారి ట్రంప్‌ ప్రకటించారను కోవాలి. కశ్మీర్‌ సమస్య విషయంలో భారత్, పాకిస్తాన్‌లకు వేర్వేరు కోణాలున్నాయని, ఆ రెండు దేశాలూ కలిసి చర్చించుకుని ఈ విషయంలో ఒక అంగీకారానికి రావాలని కోరుకుంటున్నట్టు తెలి పారు. బహుశా ఒకటికి రెండుసార్లు దీనిపై మీడియా ప్రశ్నించడంవల్ల కావొచ్చు... రెండు దేశాలూ కోరితే మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమేనని చెప్పారు.

అమెరికాకున్న ఈ మధ్యవర్తిత్వం ఉబలాటం ఎంత పాతదో, దీనిపై మన దేశానికున్న అభ్యంతరం కూడా అంతే పాతది. ట్రంప్‌ ఈ విషయంలో చేసిన ప్రకటన మన దేశానికి సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది. మన దేశం పదే పదే కశ్మీర్‌ సమస్య గురించి పాక్‌తో చర్చించడానికి సిద్ధంగా వున్నామని చెబుతోంది. ఈ విషయంలో ఎవరి మధ్యవర్తి త్వాన్ని అంగీకరించబోమని గతంలో అనేకసార్లు చెప్పింది. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక, ముఖ్యంగా గత ఆగస్టులో కశ్మీర్‌ ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక ఈ వైఖరి మరింత మారింది. కశ్మీర్‌ గురించి పాక్‌తో చర్చించాల్సిందేమీ లేదని, అయితే దాని ప్రాపకంతో సాగుతున్న హింస గురించి ఆ దేశంతో మాట్లాడటానికి సిద్ధమని మన దేశం చెబుతోంది. ఈ నేప థ్యంలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్య ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందనడంలో సందేహం లేదు. దీనిపై ప్రభుత్వ స్పంద నేమిటో చూడాల్సివుంది.    

స్వర్గీయ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1998లో అణు పరీక్ష జరిపినందుకు అప్పటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ మన దేశంపై ఆంక్షలు విధించారు. మరో రెండేళ్ల తర్వాత వాటిని పాక్షికంగా తొలగించడంతోపాటు మన దేశంలో అయిదు రోజుల పర్యటనకు కూడా వచ్చారు. మొత్తంగా రెండు దేశాల మధ్యా ఈ రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహసంబంధాలను పునశ్చరణ చేసుకుంటే అవి నానాటికీ బలపడుతూనే వచ్చాయని అర్థమవుతుంది. జార్జి బుష్‌ ఏలుబడిలో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నాక ఈ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. తాజా చర్చల్లో ఇరు దేశాల సంబంధాలనూ అంతర్జాతీయ సమగ్ర భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించడం కూడా అటువంటిదే. అయితే తాలిబన్‌లతో అమెరికా కుదుర్చుకోబోయే ఒప్పందం గురించి మోదీకి వివరిస్తే, ఆయన బ్రహ్మాండంగా ఉన్నదని మెచ్చుకున్నారనడం వాస్తవదూరంగా ఉంది.

అఫ్గాన్‌లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పించి, అధికారం తాలిబన్‌ల చేతిలో పెడితే అది భారత్‌కు తలనొప్పిగా మారుతుందని అమెరికాకు తెలియందేమీ కాదు. కానీ ఏదోవిధంగా సమస్య పరిష్కారం అయినట్టు చూపించి నిష్క్రమించాలని అమెరికా తొందరపడుతోంది. ఒకపక్క మనతో సాన్నిహిత్యాన్ని నెరపు తూనే, మన దేశం నుంచి గరిష్టంగా లబ్ధి పొందాలని చూస్తూనే పాక్‌ ప్రాపకంతో తాలిబన్‌లతో ఒప్పందానికి సిద్ధపడుతోంది. ఈ క్రమంలో మన వైఖరిని పరిగణనలోకి తీసుకోకపోవడం, ఈ ప్రాంత భద్రతకు తగిన హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో అమెరికాతో మన దేశం వివరంగా మాట్లాడవలసివుంది. 

మరిన్ని వార్తలు