అరవింద్‌ సంచలనం

1 Dec, 2018 01:02 IST|Sakshi

తమ దగ్గర కీలక స్థానాల్లో పనిచేసి నిష్క్రమించినవారి గురించి పాలకులు బేజారెత్తే రోజులొ చ్చాయి. వెళ్లినవారు మౌనంగా ఉండకుండా తమ జ్ఞాపకాలు గ్రంథస్థం చేయడమే ఇందుకు కారణం. గతంలో ప్రధాని మీడియా కార్యదర్శిగా పనిచేసిన సంజయ్‌ బారు, కేంద్ర మాజీ మంత్రి నట్వర్‌సింగ్, కాగ్‌ మాజీ అధిపతి వినోద్‌ రాయ్‌ తదితరులు తమ అనుభవాలను వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇప్పుడిక కేంద్రంలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేసి నాలుగు నెలలక్రితం వైదొలగిన అరవింద్‌ సుబ్రహ్మణ్యం వంతు వచ్చింది.

పెద్ద నోట్ల రద్దు చర్యవల్ల మన వృద్ధి రేటు తీవ్రంగా దెబ్బతిన్నదని తాను రాసిన పుస్తకంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు... పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దిగ్భ్రాంతికరమైన నిరంకుశ చర్యగా ఆయన అభివర్ణించారు. ‘ఆఫ్‌ కౌన్సెల్‌– ది ఛాలెంజెస్‌ ఆఫ్‌ మోదీ–జైట్లీ ఎకానమీ’ పేరిట ఆయన రాసిన ఈ గ్రంథాన్ని వచ్చే శుక్రవారం ముంబైలో, ఆ తర్వాత మరో రెండు రోజులకు ఢిల్లీలో ఆవిష్కరించబోతున్నారు. ఆయన నాలుగేళ్లు సలహాదారుగా పనిచేసిన కాలంలోనే ఎన్నో కీలక విధాన నిర్ణయాలు అమలయ్యాయి గనుక ఆ పరిణామాలన్నిటిపైనా ఆయన ఏం చెబుతారో నన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ సహజంగానే ఉంటుంది. అరవింద్‌ సుబ్రహ్మణ్యం ఢిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల, అహ్మదాబాద్‌ ఐఐఎం, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీల్లో చదువుకుని ఐఎంఎఫ్‌ తదితర అంతర్జాతీయ సంస్థల్లో ఆర్థికవేత్తగా పనిచేసినవారు. సరుకులు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు రూప కల్పనలో కీలకపాత్ర పోషించారు. ఏదైనా గ్రంథం మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ప్రచురణకర్తలు అందులో సంచలనం సృష్టించగల భాగాలను ఎంచుకుని ముందుగా వెల్లడిస్తారు. అందువల్ల సహ జంగానే ఆ పుస్తకంపై అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతుంది. దానికోసం ఎదురుచూస్తారు. అర వింద్‌ సుబ్రహ్మణ్యం పుస్తకం విషయంలో అదే జరిగింది. 

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాధారణ పౌరుల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపిందో ఎవరూ మర్చిపోరు. దాన్ని నల్లడబ్బుపై బ్రహ్మాస్త్రమని కేంద్రంలోని పెద్దలు చెప్పినా, ఆచరణలో ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’గా పరిణమించింది. సామాన్య పౌరులు పగలనకా, రాత్రనకా గంటల తరబడి ఏటీఎంల ముందు నిల్చుని డబ్బు కోసం ఎదురుచూడటం ఊహించని పరిణామం. బ్యాంకుల్లో వారానికి రూ. 24,000 ఇస్తామని, పెళ్లిళ్లకు రూ. 2.5 లక్షలిస్తామని హామీ ఇచ్చినా దేశంలో ఎక్కడా దాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారు. పలుకుబడి గలవారు మాత్రం తమకు అవసరమైన డబ్బు పొందగలిగారు.

అసలు చలామణిలో ఉన్న పెద్ద నోట్ల లెక్కెంతో ఎవరికీ సరైన అంచనా లేదని వివిధ సందర్భాల్లో అటు రిజర్వ్‌బ్యాంకు, ఇటు కేంద్రం చేసిన ప్రకటనలు తెలియజెప్పాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించాక వీటి విలువ రూ. 15,44,000 కోట్లు అని కేంద్రం చెప్పింది. అదే రోజున రిజర్వ్‌బ్యాంకు దాన్ని రూ. 20,51,000 కోట్లని తెలియజేసింది. కేంద్రం చెప్పిన లెక్కే సరైందనుకుంటే...పెద్ద నోట్ల రద్దు తర్వాత అందులో దాదాపు అంతా వెనక్కొచ్చినట్టే. గత ఆగస్టులో రిజర్వ్‌బ్యాంక్‌ ఒక ప్రకటన చేస్తూ వెనక్కి తిరిగొచ్చిన పాత నోట్ల విలువ రూ. 15.3 లక్షల కోట్లని వెల్లడించింది. దాన్నిబట్టి చలామణిలో ఉన్న 99.3 శాతం డబ్బు వెనక్కొచ్చినట్టే. సారాంశంలో కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్‌ అనుకున్నట్టు చలామణిలో ఉన్న కరెన్సీలో నల్లడబ్బు లేదని తేలిపోయింది. 


ఈ నిర్ణయంపై అరవింద్‌ కటువైన వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఆయన దిగ్భ్రాంతికరమైన చర్యగా అభివర్ణించడంతో ఊరుకోక నిరంకుశమైనదని కూడా అన్నారు. అందరినీ ఆశ్చర్యపరచగల వ్యాఖ్యలివి. పెద్దనోట్ల రద్దుపై దాని వ్యతిరేకులు చాన్నాళ్లుగా ఈ తరహా మాటలంటున్నారు. కానీ ఆ సమయంలో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా అరవింద్‌ మాటలకు విలువుంటుంది. అప్పట్లో దానిపై నోరు విప్పేందుకు అరవింద్‌ సిద్ధపడలేదు. ఆ నిర్ణయం ఆయనకుగానీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి గానీ ముందుగా చెప్పలేదని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే జైట్లీ దాన్ని తోసిపుచ్చినా, అరవింద్‌ మౌనంగానే ఉండిపోయారు. ఆఖరికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సమయంలో కూడా ఆయన పెద్ద నోట్ల రద్దు అంశానికి సంబంధించిన ప్రశ్నలపై జవాబులు దాటవేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టగల కొన్ని సున్నితమైన అంశాల విషయంలో ఎలా ఉండాలో తాను తెలుసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో ఆయన చమత్కరించారు కూడా.

అయితే ఈ గ్రంథ రచనలో దాన్ని పాటించినట్టు లేరు. పుస్తకంలో ఆయన చెప్పిన మరొక మాట ముఖ్యమైనది. పెద్ద నోట్ల రద్దు వంటి తీవ్ర చర్యలు యుద్ధ సమయాల్లో, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు, కరెన్సీ సంక్షోభం లేదా రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు మాత్రమే తీసుకోవాలన్నది ఆయన అభిప్రాయం. 2016లో ఇలాంటి పరిస్థితులేమీ లేవు. జీఎస్‌టీ బిల్లు రూపశిల్పుల్లో అరవింద్‌ కూడా ఒకరైనా, దాని అమలు తీరుపై ఆయనకు అసంతృప్తి ఉన్నదని పుస్తకం చెబుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత అమలు చేయడం వల్ల దాని ప్రభావం జీఎస్‌టీపై బాగా పడిందన్నది ఆయన అభి ప్రాయం.

అరవింద్‌ సుబ్రహ్మణ్యం పుస్తకం ఎంతగా సంచలనం రేపగలదో విపక్షాల స్పందనలు చూస్తేనే అర్ధమవుతుంది. అరవింద్‌ అభిప్రాయాలు వెల్లడై 24 గంటలు గడుస్తున్నా బీజేపీ నుంచి ఎవరూ మాట్లాడకపోవడాన్ని బట్టి వారెంత సంకటస్థితిలో పడ్డారో గ్రహించవచ్చు. అయితే పెద్ద నోట్ల రద్దు విషయంలో అప్పట్లో ప్రభుత్వానికి తన అభిప్రాయాల్ని ఆయన విస్పష్టంగా చెప్పారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దుపై ఆయనకు ఇంతటి తీవ్రమైన అభిప్రాయా లున్నా... ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉంటున్న తనను ఆ విషయంలో సంప్రదించలేదని గ్రహిం చాక కూడా ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగారన్నది ఆశ్చర్యకరం. పుస్తకావిష్కరణ సమ యంలోనైనా దీనిపై ఆయన వివరణనిస్తారేమో చూడాలి.

మరిన్ని వార్తలు